కుల నాశనానికి కారణమైన వారు, నరకలోకానికి వెళతారు!
'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (43 - 47 శ్లోకాలు)!
భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 43 నుండి 47 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ogXCVnZBAO4 ]
పెద్దలనూ, గురువులనూ సంహరించడం వలన కలిగే అనర్థాల గురించి, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు..
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ।। 43 ।।
కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన, అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోతాయి.
ఉత్సన్నకులధర్మాణామ్ మనుష్యాణాం జనార్దన ।
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ।। 44 ।।
ఓ జనార్దనా, కులాచారములను నాశనం చేసిన వారు, నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను.
కుంటుంబ పెద్దను కోల్పోయి, స్త్రీలు జారత్వం కలిగి, అవాంఛిత సంతానాన్ని కని, కులాన్ని నాశనం చేయడం మాత్రమే కాక, అలా కుల నాశనానికి కారణమైన వారు, నరకలోకానికి వెళతారని చెబుతున్నాడు. అయితే, ఈ విషయాలను కృష్ణుడికి చెబుతున్న అర్జునుడు, వాటిని రూఢిపరుస్తూ, ఇటువంటి నీచకార్యాలకు నరకం ప్రాప్తిస్తుందనే సంగతి, పండితులు చెప్పగా విన్నానని అంటున్నాడు.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ।। 45 ।।
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ।। 46 ।।
అయ్యో! ఎంత ఆశ్చర్యం? ఈ మహాపాపం చేయటానికి నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్దపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా, ప్రతిఘటించకుండా ఉన్న నన్ను, యుద్ధభూమిలో చంపివేసినా, దీనికంటే మేలే.
జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని, అర్జునుడు ప్రస్తావించాడు కానీ, ఈ దుష్టులను సమాజంలో పెరగనిస్తే, దుర్మార్గమే వర్ధిల్లుతుందన్న విషయాన్ని, అర్జునుడు గ్రహించలేకపోయాడు. 'అహో' అన్న పదంతో, తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 'బత' అంటే 'ఘోరమైన ఫలితాలు'. "ఎంత ఆశ్చర్యం, ఘోరమైన పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా, మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్ఠి పని చేయ నిశ్చయించాము." అని కృష్ణుడితో అంటున్నాడు. తమ తప్పులను తెలుసుకోలేని వారు, తరచుగా, వాటిని పరిస్థితులకూ, వేరేవారికి వాటిని ఆపాదిస్తారు. అదే విధముగా, ధృతరాష్ట్రుని పుత్రులు, దురాశచే ప్రేరేపింప బడ్డారని అనుకున్నాడు కానీ, తన యొక్క కారుణ్య భావ పరంపర, ఒక మహనీయమైన భావం కాదనీ, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహం అనీ, అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే - శారీరిక వ్యామోహం, హృదయ దౌర్బల్యం, మరియు కర్తవ్యాన్ని విస్మరించటం వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే, అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. తన సొంత వారిపై యుద్ధం చేయడం కన్నా, నిరాయుధుడై, తన వారి చేతిలో హతమయినా మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తనలోని కారుణ్యతను చూపిస్తున్నాడు.
సంజయ ఉవాచ:
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ।। 47 ।।
‘ఈ విధంగా చెబుతూ, అర్జునుడు దీనస్థితిలో, తీవ్ర శోకసంతప్తుడై, తన బాణాలనూ, ధనుస్సునూ ప్రక్కన జారవిడచి, రథం లో కూలబడ్డాడు’ అని సంజయుడు ధ్రుతరాష్ట్రుడితో చెబుతున్నాడు.
మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా, భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. నెమ్మదిగా మొదలైన అర్జునుడి నిర్వేదం, ఇప్పుడు తార స్థాయికి చేరింది. తను ధర్మ బద్ధంగా నిర్వర్తించవలసిన విధిని, నైరాశ్యంతో వదిలేశాడు. జ్ఞానంతో, భక్తితో, భగవంతునికి శరణాగతి చేయటానికి, ఇది పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడేమీ కాదు. అతడు దివ్య లోకాలకు వెళ్లి, తన తండ్రి, స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి, తాను పూర్వ జన్మలో "నరుడు". కాబట్టి, పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. దీనికి రుజువేమిటంటే, మహాభారత యుద్ధం ముందు, యదు సైన్యాన్నంతా దుర్యోధనునికి వదిలేసి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన వుంటే, తనకు అపజయం ఎన్నటికీ కలుగదనే దృఢవిశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ, అర్జునుడి మనస్సులో కొంత కలవరం చెలరేగింది. దీనికి కారణం కూడా, లీలామానుష రూపధారి అయిన కృష్ణ భగవానుడే. అర్జునుడి ద్వారా, సమస్త లోకానికీ జ్ఞానం వొసగాలనే సంకల్పంతో, ఈ విధంగా అర్జునుడిని తర్జనభర్జనలకు గురిచేశాడు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే
అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ:
శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, మొదటి అధ్యాయం, అర్జున విషాదయోగంలోని 47 శ్లోకాలు సంపూర్ణం.
ఇక మన తదుపరి వీడియోలో, రెండవ అధ్యాయము, సాంఖ్యయోగంలోని శ్లోకాలూ, వాటి తాత్పర్యాల గురించి తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgyNuPVf9bDeN7GZojt4AaABCQ
No comments:
Post a Comment