Ads

14 June, 2021

ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన ‘బోయవాడు - ఎలుగుబంటి’ కథ!

 

ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన ‘బోయవాడు - ఎలుగుబంటి’ కథ!

అయోనిజ అయిన సీతమ్మను అపహరించిన రావణాసురుడు, ఆమెను లంకలో బంధించి, రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బంధీగా ఉన్న విషయం, హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు, వానర సేన సహాయంతో, సేతువు నిర్మించి, సముద్రాన్ని దాటాడు. రామ రావణ యుద్ధంలో, ఇంద్రజిత్తూ, కుంభకర్ణుడి లాంటి రాక్షసవీరులందరూ హతమయ్యారు. దశకంఠుడి సంహారంతో, యుద్ధం ముగిసింది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/YK8QjVW2kc0 ​]

ఆ తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్లి, ‘తల్లీ! నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు.. వాళ్ళందరినీ ఇక్కడే నా పిడికిటి పోట్లతో కొట్టి చంపేస్తాన’ని సీతమ్మతో తన ఆక్రోశాన్ని వెళ్లగ్రక్కాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీతమ్మ తల్లి, ‘నాయనా! నీ -ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు. వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు. కాబట్టి, వారిని ఏమీ చేయకు. పైగా, వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా, మన దగ్గరకి వచ్చి తప్పు చేసినా, వారిని క్షమించాలి’. అని హనుమను వారించి, ఓ బోయవాడి కథ చెప్పింది. హనుమంతుడి ఆగ్రహాన్ని తగ్గించడానికి, సీతమ్మ చెప్పిన ఆ వేటగాడి కథేంటో, అందులోని నీతేంటో, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

ఒక బోయవాడు వేటకు వెళ్లి, అనేక జంతువులను వేటాడుతూ, జీవనం సాగించేవాడు. అయితే, ఒకరోజు అతడిని పులి వెంటాడింది. దాని నుంచి తప్పించుకోడానికి, వేటగాడు భయంతో పరుగు లంఘించాడు. అలా కొద్ది దూరం పరుగెత్తిన తర్వాత, ఒక పెద్ద వృక్షం కనబడితే, దానిమీదికెక్కి, పులి నుండి తప్పించుకుని క్షేమంగా బయటపడదామనుకున్నాడు. ఆ చెట్టు పైకి ఎక్కుతుండగా, పైకి చూస్తే, అక్కడ ఓ ఎలుగు బంటి ఉంది. దానిని చూడగానే వేటగాడు, వణికిపోయాడు. పులి నుంచి తప్పించుకుందామనే ఆతృతలో, ఎలుగుకు చిక్కానని, భయంతో దానిని చూస్తూ ఉండిపోయాడు. అతడి భయాన్ని గ్రహించిన ఎలుగుబంటి, ‘తెలిసో తెలియకో నాదగ్గరికి వచ్చావు కాబట్టి, నీకు అభయమిస్తున్నాను. నీవు కూడా నాతో పాటు ఉండు’ అని ఆశ్రయమిచ్చింది. ఎలుగు మాటలతో వేటగాడు కాస్త ఊరట చెందాడు.

వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని చూసి, ‘మిత్రమా! అతడు మనిషి.. అతనికి కృతజ్ఞత ఉండదు. మనమిద్దరం జంతువులమే కాబట్టి, వాడిని కిందికి తోసెయ్.. నేను తినేసి వెళ్ళిపోతాను’ అన్నది. అప్పుడు ఎలుగు.. ‘అతడు భయంతో నా దగ్గరికి వచ్చాడు.. అతడు నాకు అతిథి.. నేను మాటిచ్చాను కాబట్టి, రక్షించడం నా కర్తవ్యం’ అని బదులిచ్చింది. అలా ఎలుగూ - పులీ మధ్య వాదోపవాదాలు నడిచాయి. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది. అప్పుడు వేటగాడిని మచ్చిక చేసుకోవడానికి, పులి ప్రయత్నించింది. ‘మిత్రమా! ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం, అతిథివి అంటూ నాటకాలాడుతోంది. నేను వెళ్ళగానే, ఆ ఎలుగు నిన్ను తినేస్తుంద’ని వేటగాడిని నమ్మబలికింది. ఎలుగును క్రిందకు తోసెస్తే, నిన్ను వదిలేస్తానని, వేటగాడికి మాయమాటలు చెప్పింది. పులి చెప్పింది నిజమేనని భావించిన వేటగాడు, నిద్రపోతున్న ఎలుగుబంటిని, అమాంతం క్రిందకు తోసేశాడు.

వెంటనే మేల్కొన్న ఎలుగు బంటి, క్రింద పడబోతూ, చెట్టుకొమ్మని పట్టుకుని వ్రేలాడింది. ప్రాణాలు కాపాడుకుని, తిరిగి చెట్టు పైకి వచ్చిన ఎలుగు, ‘మిత్రమా! పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడకు.. నువ్వు నా అతిథివి’ అంటూ, తాను దాచుకున్న ఆహారం అతడికి అందజేసింది. తాను చేసిన తప్పుకు వేటగాడు సిగ్గుపడి, తలదించుకున్నాడు. పులి ఎలుగుబంటితో, ‘ఈ మానవులు స్వార్థపరులు.. ఈ నీచ మానవులు, తమ స్వార్ధం కోసం, ఆశ్రయం ఇచ్చినవారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్లు వట్టి కృతఘ్నులు. అందుకే చెబుతున్నా.. అతడిని క్రిందకు తోసేయ్. నేను తినేసి వెళ్ళిపోతాను’ అని ఎలుగు మనస్సు మార్చే ప్రయత్నం చేసింది.

పులి మాటలకు ఎలుగుబంటి చిన్నగా నవ్వి, ఊరుకుంది. ఇక చేసేది లేక, తన ప్రయత్నం విఫలమవ్వడంతో, పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ‘తమకు హాని తలపెట్టినవారికి కూడా మేలు చేయడం, ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమా, వారి ప్రభువైన రావణాసురుడు చెప్పినట్లే, ఆ రాక్షస స్త్రీలు చేశారే తప్ప, వారికి నాపై ఎటువంటి ప్రత్యక్ష శత్రుత్వం లేదు’ అని, సీతమ్మ వివరించింది. ఈ కథను విన్న ఆంజనేయుడు, ‘నీవంటి శీలవతీ, ఉత్తమురాలూ, ఈ యుగంలోనే కాదు. ఏ యుగంలోనూ పుట్టలేదు.. పుట్టబోదమ్మ.. నీవు కరుణామూర్తివి’ అని సీతమ్మను పరి పరి విధాలా పొగడి, మారుతి శాంతి పొందాడు. అపకారికైనా ఉపకారం చేయటమే, దైవానుగ్రహకారకం.

Link: https://www.youtube.com/post/Ugz638ps8rWGwzYVLUZ4AaABCQ

No comments: