Ads

12 June, 2021

ధనవృద్ధీ, వ్యాపారాభివృద్ధీ, గృహశాంతి కొరకు ఈ మంత్రాలను పఠించండి!

  

ధనవృద్ధీ, వ్యాపారాభివృద్ధీ, గృహశాంతి కొరకు ఈ మంత్రాలను పఠించండి!

సకల లోకాలలో ఐశ్వర్యానికి అధిపతి కుబేరుడు. ఈయన ఒక చేతిలో గదను ధరించి, మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తాడు. సిరిసంపదలకూ, నవ నిధులకూ అధిపతి అయిన కుబేరుడు, ఉత్తర దిక్పాలకుడూ, లోకపాలకుడూ, ధనదుడూ, ధనాధిపతీ, యక్షరాజూ, రాక్షసాధిపతీ, భూతేశుడూ, గుహ్యకాధిపతీ, కిన్నెరరాజూ, మయరాజూ, నరరాజు. ఇన్ని సంపదలకు రాజైన కుబేరుడిని ఆరాధించడం వలన, ధన ప్రాప్తీ, వ్యాపారంలో అభివృద్ధీ, మంచి తెలివితేటలూ, కుటుంబంలో శాంతి, మరియు ఆనందం కలుగుతాయి. మన అవసరాలకు ఆ కుబేరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించాలి. ఏ ఏ మంత్రాలను పఠిస్తే, ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వాటిని పఠించేటప్పుడు, ఏ ఏ నియమాలు పాటించాలి? అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/CJV6qo4Q5ic ​]

1. కుబేర ధనప్రాప్తి మంత్రం:

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ।

ఈ మంత్రాన్ని జపించడం వలన, ధనవంతులవుతారు. ప్రతి ఒక్కరి కల అయిన ఇల్లూ, వాహనం వంటి సౌకర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. నమ్మకం, భక్తితో దీనిని పఠిస్తూ, మీ కోరికను మనస్సులో సంకల్పించుకుంటే, తప్పక నేరవేరుతుంది. 

2. కుబేర మంత్రం: 

ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ।
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ।। 

ఈ మంత్రం జపించడం వలన, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ శ్రేయస్సు సంప్రాప్తిస్తుంది. తత్ఫలితంగా, ఇంట్లో ఎలాంటి అశాంతీ, లేదా గొడవలూ వచ్చే అవకాశం ఉండదు.

3. మహాలక్ష్మీ కుబేర మంత్రం:

ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః ।

సిరిసంపదలకు అధిపతి శ్రీ మహాలక్ష్మీదేవి అయితే, సిరిసంపదలకు కాపలాదారుడు, కుబేరుడు. వీరిద్దరినీ కలిపి పూజించడం ద్వారా, సకల సంపదలూ చేకూరుతాయి. కోల్పోయిన అష్టైశ్వర్యాలూ, తిరిగి సంపాదించుకోవచ్చు. ధన ప్రాప్తి కోసం, లక్ష్మీ కుబేర పూజ చేయడం శుభకరం. కుబేర యంత్రాన్ని పూజించడం వలన కూడా, మంచి ఫలితాలను పొందవచ్చు. కుబేర యంత్రానికి నాలుగు మూలలా, పసుపూ, కుంకుమా, చందనంతో అలంకరించి, పువ్వులతో అర్చిస్తూ ప్రార్థించాలి. 

4. కుబేర గాయత్రీ మంత్రం:

ఓం యక్ష రాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ ।

ఈ మంత్రాన్ని పఠించడం వలన, కుబేరుడి ఆశీర్వాదంతో, తెలివి తేటలు సమృద్ధిగా పెరుగుతాయి. 

ఈ మంత్రాలను రోజూ, 108 సార్లు ఉచ్ఛరించడం ద్వారా, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుబేరుని దిశగా చెప్పబడే ఉత్తర దిశను చూస్తున్నట్లుగా కూర్చుని, ఈ మంత్రాలను పఠించాలి. కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పఠించే ఈ మంత్రాలు, ప్రతి రోజూ 108 సార్లు, 21 రోజుల పాటు భక్తితో స్తుతించాలి. కుబేరుడిని పూజించిన తరువాత, అన్ని మంత్రాలూ ఒకే సారి పఠించకూడదు. వీటిలో ఏదో ఒక మంత్రాన్ని మాత్రమే పఠించాలి. ఇలా చేయడం వలన, త్వరగా మీ కోరికలు నేరవేరుతాయి. కుబేరుని మంత్రాన్ని పఠించేటప్పుడు, మనస్సును ప్రశాంతగా ఉంచుకోవాలి. అదేవిధంగా, కుబేర పూజను, నిర్మలమైన మనస్సుతో చేయాలి. ఏ మంత్రాన్ని పఠించినా, ఏ దేవుణ్ణి పూజించినా, కేవలం భక్తితో మాత్రమే చేయాలి కానీ, స్వార్థ చింతనతో, కుటిల తలంపులతో చేయకూడదు.

సర్వేజనా: సుఖినోభవంతు!

No comments: