Ads

02 June, 2021

స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, అవాంఛిత సంతానం జన్మిస్తారు! Bhagavadgita

 

స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన,  అవాంఛిత సంతానం జన్మిస్తారు!

('భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (38 - 42 శ్లోకాలు)!)

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 38 నుండి 42 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగం వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/2G6O2HqiROg ]

ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన కలిగే వివిధ రకాల పాపాల గురించి అర్జునుడు, శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు..

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।।

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ ।

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్ధన ।। 39 ।।

కౌరవుల ఆలోచనలు దురాశచే భ్రష్టు పట్టి, బంధువులను సర్వనాశనం చేయటంలో గానీ, మిత్రులపై కక్ష తీర్చుకుని, విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారికి ఎటువంటి దోషం కనబడుటలేదు. కానీ, ఓ జనార్ధనా, మనవారిని చంపటం దోషం అనే విషయాన్ని ఎరిగిన మనం, ఈ పాపపు పని నుండి ఎందుకు  తప్పుకోకూడదు? అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించాడు అర్జునుడు.

ప్రవృత్తి రీత్యా యోధుడే అయినా, ఇక్కడ అర్జునుడు అనవసరపు హింసని కోరుకోవడం లేదు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం, అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. వంద మంది కౌరవులు చంపబడ్డారు.. కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి ప్రవేశించి, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని, అతన్ని పశువు లాగా కట్టి వేసి, శోకిస్తూ వున్న ద్రౌపది కాళ్ళ దగ్గర పడేశాడు అర్జునుడు. కానీ, క్షమా గుణము, సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అతను తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడయినందువలన, అశ్వత్థామని క్షమించి వదిలేయమంది. మరో పక్క, అశ్వత్థామని వెంటనే చంపివేయాలని, భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో, అర్జునుడు శ్రీ కృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు. అందుకు కృష్ణ భగవానుడు, ‘గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా, అతనిని తప్పకుండా క్షమింపవలసినదే. కానీ, ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని, తప్పకుండా శిక్షించవలసినదే’. అర్జునుడు ఈ విరుద్ధమయిన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కానీ, అతని తల వెనుక పిలకను కత్తిరించి, అతని నుదురుభాగంలో వున్న మణిని తొలగించి, అతనిని శిబిరము నుండి బహిష్కరించాడు. కాబట్టి, సాధ్యమయినంత వరకూ హింసని విడనాడటం, అర్జునుడి సహజ స్వభావం. అలాంటి వ్యక్తిత్వం కలిగిన అర్జునుడు, పెద్దలనీ, బంధువులనీ చంపటం, తగని పని అనీ, దాని వలన సుఖ సంతోషాలకు బదులు, దోషాలూ, బ్రహ్మహాత్యా పాతకాలూ వెంటాడుతాయనీ, తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు.

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।

ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మోఽభిభవత్యుత ।। 40 ।।

వంశము నాశనమయినప్పుడు, వంశాచారములన్నీ నశిస్తాయి. మిగిలిన కుటుంబ సభ్యులు, అధర్మ పరులవుతారు.

కుటుంబ పెద్దలు, తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలనూ, ఏంతో  కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలనూ, ఆదర్శాలనూ, తమ ముందు తరాలవారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు, మానవీయ విలువలూ, మరియు ధార్మిక పద్ధతులు పాటించటానికి, కుటుంబ సభ్యులకి దోహదపడతాయి. కుటుంబ పెద్దలందరూ అకాలమరణం పాలయితే, వారి, వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణా లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశాలు నాశనమైనప్పుడు, వాటి సాంప్రదాయాలు కూడా నశిస్తాయనీ, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు, అధార్మిక, అనైతిక  అలవాట్లు పెంచుకుని, తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారనీ, అందుకే కుటుంబ పెద్దలు, ఎన్నటికీ సంహరింపబడరాదనీ, అంటున్నాడు.

అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।

స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।

ఓ కృష్ణ.. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, కుల స్త్రీలు నీతి తప్పిన వారవుతారు. ఓ వృష్ణి వంశస్థుడా.. స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన,  అవాంఛిత సంతానం జన్మిస్తారు.

వైదిక నాగరికత, స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది. స్త్రీలు పవిత్రంగా ఉండటానికి, ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. అందుకే, మను-స్మృతి లో, ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః (3.56)’ ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమయిన నడవడికతో ఉంటారో, ఆ యొక్క పవిత్రతకు, వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో, అక్కడ దేవతలు హర్షిస్తారు’. కానీ, స్త్రీలు నీతి బాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు, బాధ్యతారహితమైన పురుషులు, తమ జారత్వాన్ని అదనుగా తీసుకొవడం వలన, అవాంఛిత సంతానం కలుగుతారు. అది పూర్వీకుల వంశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తుంది.

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।

పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ।। 42 ।।

‘అవాంఛిత సంతానం పెరగటం వలన, కులానికీ, కుల నాశనానికి కారణమైన వారికి కూడా, నరకము ప్రాప్తిస్తుంది. శ్రాద్ద తర్పణములు లుప్తమయిన కారణముగా, ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుతారు..’ అని తన మనోభావాలనూ, యుద్ధం వలన కలిగే అరాచకాలనూ, శ్రీకృష్ణుడితో వ్యక్తపరుస్తున్నాడు అర్జునుడు.

మన తదుపరి వీడియోలో, పెద్దలనూ, గురువులనూ సంహరించడం వలన కలిగే మరిన్ని అనర్థాల గురించీ, కుల నాశనం గురించీ, శ్రీ కృష్ణుడితో అర్జునుడి సంభాషణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugzb6MI-0UNhCzLrUqR4AaABCQ

No comments: