యుద్ధ రంగంలో బంధువులను చూసి చలించిపోయిన అర్జునుడు!
యుద్ధరంగం మధ్యలో నిలబడి, తన వారిని చూసిన అర్జునుడు, తన అభిప్రాయాలను శ్రీ కృష్ణుడితో ఈ విధంగా చెబుతున్నాడు..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/4Sp133zs0ag ]
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా ।। 26 ।।
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
అర్జునుడి కోరిక మేరకు, రథాన్ని యుద్ధరంగం మధ్యలోకి తీసుకువెళ్లాడు శ్రీ కృష్ణుడు. అక్కడ అర్జునుడు రెండు సైన్యముల మధ్యలో నిలబడి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులనూ, తాతలనూ, గురువులనూ, మేనమామలనూ, సోదరులనూ, దాయాదులనూ, పుత్రులనూ, మనుమలనూ, మిత్రులనూ, మామలనూ, ఇంకా శ్రేయోభిలాషులనందరినీ చూశాడు.
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ।। 27 ।।
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।
రణరంగంలో ఉన్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్యంతో నిండినవాడై, తీవ్ర విచారానికి లోనై, శ్రీ కృష్ణుడితో ఈ విధంగా చెబుతున్నాడు.
అర్జునుడి బాధకు కారణం, యుద్ధ భూమిలో ఉన్న తన బంధువులనూ, తన కుటుంబానికి చెందిన వారినీ, తన స్వహస్తాలతో సంహరించడం. శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధిస్తే, గర్వకారణంగా ఉంటుంది. కానీ, తన సొంత వారినీ, కుటుంబీకులనూ నిర్దయగా సంహరించడం అనే విషయం, అర్జునుడిని బాధించింది. పాండుపుత్రులపై దాయాదులు చేసిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారంగా, వారితో యుద్ధానికి తలపడడానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడు, అందరినీ ఒక్కసారిగా చూసి, జరగబోయే నష్టం గ్రహించడంతో, అకస్మాత్తుగా మానసిక పరివర్తన కలిగింది. అందుకే, సంజయుడు ఈ శ్లోకంలో, అతని మృదుహృదయాన్నీ, ఆదరించే స్వభావాన్నీ సూచిస్తూ, తన తల్లిని గుర్తుచేస్తూ, కుంతీ దేవి తనయుడా అని సంబోధించాడు.
అర్జున ఉవాచ ।
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ।। 28 ।।
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।।
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।।
అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి, ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి.. నా నోరు ఎండిపోతోంది. గాండీవం చేజారిపోతోంది.. ఎంత కోపతాపాలున్నా, అసూయా, ద్వేషాలున్నా, బంధువులపై అనురాగం అనేది ఏదో ఒక మూలన ఉండే ఉంటుంది. అర్జునుడికి కూడా తన కుటుంబీకులను చూసి, అనురాగం పొంగింది. భౌతికమయిన అనురాగాన్ని అనుభూతి చెందిన అర్జునుడిని, నిరాశ వెంటాడుతోంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా, భయపెడుతోంది. ఏ వింటి శబ్దం వింటే, బలవంతులైన శత్రువులు సైతం వణికిపోతారో, అటువంటి శక్తివంతమైన అస్త్రం ‘గాండీవం’ తన చేతి నుండి జారిపోతోంది. తన వారితో యుద్ధం చేయడానికీ, వారిని సంహరించడానికీ, తాను మానసికంగా సిద్ధంగా లేడన్న విషయాన్ని కృష్ణుడితో చెబుతున్నాడు.
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
ఓ కేశవా, అంతటా అశుభ శకునాలే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో, నేను తెలుసుకోలేకపోతున్నాను.
ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణ భగవానుడిని కేశవా అని సంభోదించాడు. అంటే, ‘కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా’ అని అర్థం. జరగబోయే యుద్ధ పరిణామాల గురించి ఆలోచించి, కలత చెంది, శోకానికి గురయ్యాడు అర్జునుడు. అర్జునుడు మానసికంగా బలహీనపడిపోయాడు. ‘తన వారిని చంపితేనే విజయం వరిస్తుంది’ అనే ఆలోచనతో అతని తల తిరుగుతోంది. అటువంటి పరిస్థితులలో, ఇరుకున పడిన అర్జునుడికి, చుట్టు ప్రక్కల జరిగే ప్రతీ సంఘటనా, అపశకునంగానే తోచింది. తన సొంత బంధువులను చంపడం వలన కలిగే మంచి ఏంటనే విషయంపై, ఆలోచనలో పడ్డాడు. తన వారిని చంపడం అవసరమా? ఈ యుద్ధం అవసరమా? అనే సందిగ్ధంలో చిక్కుకున్నాడు అర్జునుడు.
మన తదుపరి వీడియోలో, రణరంగాన్ని చూసి విరక్తి చెందిన అర్జునుడు, యుద్ధానికి సిద్ధమవ్వడానికి కారణమైన రాజ్యాధికారం గురించి ఏం చెబుతున్నాడో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments:
Post a Comment