శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం!
మన భారతీయ సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు, మన మహర్షులు మనకందించిన పురాణాలు. అటువంటి అష్టాదశ పురాణాల్లో ఒకటి, గరుడ పురాణం. ఈ అష్టాదశ పురాణాలనూ, వ్యాసమహర్షే రచించాడు. గరుడ పురాణం అంటే, యమధర్మరాజు, పాపులకు విధించే శిక్షలు మాత్రమే ఉంటాయని, చాలా మంది దీనిని చదవడానికి గానీ, ఇంట్లో ఉంచుకోవడానికిగానీ భయపడతారు. కానీ, ఈ పురాణంలో అసలు దేని గురించి వివరించబడి ఉంది? అనే విషయం, మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ధర్మ, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, తన వాహనమైన గరుత్మంతుడి కోరిక మేరకు, శ్రీమహావిష్ణువు బోధించాడు. ఆ నిగూఢ విషయాలను బహిర్గత పరిచేదే, ఈ గరుడ పురాణం.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LfQinWIsacs ]
ఇందులో మొత్తం, 18 వేల శ్లోకాలున్నాయి. మన పురాణాలను మూడు రకాలుగా విభజించారు. అవి సాత్త్విక, రాజస, తామసాలు. ఈ గరుడ పురాణం, సాత్విక పురాణంగా చెప్పబడుతోంది. దీనిలో పూర్వ ఖండం, ఉత్తర ఖండం అనే రెండు భాగాలున్నాయి. పూర్వ ఖండంలో, విష్ణువును ఎలా ఆరాధించాలి? తులసీ మాహాత్మ్యం, ఏకాదశి వ్రత విధానం, నామ మహిమ, సదాచార విధానం, మొదలైన అంశాలుంటాయి. ఇక ఉత్తర ఖండాన్ని, ప్రేతకల్పం అంటారు. ఇందులో, మరణించిన తర్వాత మనిషి పొందే అవస్థలూ, యమలోకంలో మనిషికి విధించే శిక్షలూ మొదలైన వివరాలుంటాయి. ఈ పురాణంలో, మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరకలోక వర్ణనా, మానవుడు చేసే వివిధ పాపాలూ, వాటికి నరకలోకంలో విధించే శిక్షలూ, పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలూ, పితృ కార్యాల వర్ణన అనే అంశాలు మిళితమై ఉన్నాయి. మనం ఈ భూమిపై ఏ పాపం చేసినా, దానికి నరకంలో పరిహారం చెల్లించుకోవాలి. నరకంలోని శిక్షను జీవుడు సూక్ష్మ శరీరంతో అనుభవించాల్సి ఉంటుందని, ఈ గరుడ పురాణం చెబుతుంది. ఈ పురాణంలో, మరణం తర్వాత విధించే శిక్షలు భయ కంపితులను చేసినా, అవి పరోక్షంగా మనకు, క్రమ శిక్షణను ఉద్బోధిస్తాయి. నైతికతనూ, సామాజిక బాధ్యతనూ తెలియజేస్తాయి. మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించిన నరకలోక శిక్షలేంటి? గరుడ పురాణంలోని ప్రేతకల్పం ప్రకారం, ఏ ఏ తప్పులకు ఎటువంటి శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది? వాటి పేర్లేంటి? అనే ఆసక్తికర విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..
1. అవీచి
తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళకూ, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళకూ, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి, ఇతరులను వెూసం చేసే వాళ్ళకూ, ఈ శిక్ష విధిస్తారు. ఇది చాలా కఠినంగా ఉంటుంది. నీటి బొట్టు కూడా లేని ప్రాంతంలో పడేస్తారు.
2. అయోపానం
ఈ శిక్ష తాగుబోతులకు అమలు చేస్తారు. ఇందులో ఆడా, మగా తాగుబోతులకు, వేరు వేరుగా శిక్షలుంటాయి. వారు బ్రతికుండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కకట్టి, అన్నిసార్లు ఈ శిక్షను విధిస్తారు. ఇందులో ఆడవాళ్లయితే, ఇనప ద్రవాన్ని తాగాలి. అదే మగవారైతే, మరిగే లావాను తాగాలి.
3. అవీచిమీంత
అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారికి, ఈ శిక్ష అమలు చేస్తారు. ఇందులో, ఎత్తైన పర్వతశిఖరాల నుంచి, పాపులను క్రింద పడేస్తారు.
4. అవధ నిరోధకం
ఎవరినైనా గదుల్లో బంధించి హింసించడం, నగదు కోసం, పగ కోసం కిడ్నాప్ లు చేయడం వంటి పనులు చేసేవారికి, ఈ శిక్ష విధిస్తారు. వారిని కూడా గదిలో బంధించి, విషపు పొగలు పెట్టి, ఉక్కిరిబిక్కిరి చేస్తారు.
5. మహాజ్వాల
ధర్మో రక్షతి రక్షితః అంటారు. ప్రజల జీవితాన్ని క్రమ పద్ధతిలో పెట్టే ధర్మాలను ధ్వంసం చేయడం, అత్యంత పాపకార్యం. ధర్మ ధిక్కారానికి విధించే శిక్ష ఇది. ఇందులో, పెద్దగా మండుతూ ఉన్న అగ్ని జ్వాలల్లో మనుషులను పడేస్తారు.
6. దండసూకర
ప్రాణులను హింసించే ఉగ్రస్వభావం కలిగినవారు, దండసూకర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ, పాములతో కరిపించి, ఎలుకలతో కొరికించి, హింసిస్తారు.
7. కుంభీపాకం
వేటను ఆటగా భావించి, సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారికీ, ఇతరులను అనవసరంగా హింసించి, రాక్షసానందం పొందే వారికీ, ఈ శిక్ష అమలు చేస్తారు. కణకణలాడే రాగిపాత్రలో వారిని పడవేసి, క్రింద మంట పెడతారు.
8. క్రిమి భోజనం
ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, ఎదుటి వాళ్ళను సొంత పనులకూ, స్వార్థ ప్రయోజనాలకూ వాడుకుని, అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను, ఈ శిక్షలో, క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.
9. కాలసూత్ర
వేదాల్ని ధిక్కరించిన వారికి, కాలసూత్ర అనే శిక్ష ఉంటుంది. ఇందులో జీవుడి సూక్ష్మ శరీరాన్ని, కత్తులతో కోయడం, కొరడాలతో బాదడం వంటివి చేస్తారు.
10. రౌరవం
శరీరం శాశ్వతమనీ, తనకోసం, తన వారి కోసం, ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని, అక్రమంగా అనుభవించే వాళ్ళకు, ఈ శిక్ష విధించబడుతుంది. ఇందులో విష నాగులతో కరిపిస్తారు.
11. సారమేయోదనం
ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీసేవారూ, అమాయకపు ప్రజలను ఊచకోత కోసే వారూ, గ్రామానికీ, దేశానికీ కీడు చేసేవారూ, ఈ శిక్షను అనుభవిస్తారు. ఇందులో మానవుని సూక్ష్మ శరీరాన్ని, వజ్రాల వంటి కోరలున్న జాగిలాల చేత కరిపిస్తారు.
12. సూచిముఖి
గర్వం, పిసినారితనం ఉన్న వారూ, అహంకారంతో అందరినీ చిన్నచూపు చూసినవారూ, ఈ శిక్షను అనుభవిస్తారు. ఇందులో పాపులను సూదులతో గుచ్చి, హింసిస్తారు.
13. శీతస్నిగ్ధపత్ర
ఇతరులను మాటలతో హింసించేవారికీ, అనవసరంగా దుర్భాషలాడేవారికీ, శీతమనే శిక్ష విధిస్తారు. అంటే, అత్యంత చల్లగా ఉండే చీకటి కూపంలోకి, వారిని విసిరేస్తారు.
14. వింభుజ
ఇతరులను నమ్మించి మోసం చేసి బాధపెట్టేవారికి, ఈ శిక్ష అమలు చేస్తారు. ఇక్కడ మనుషులను తల్లక్రిందులుగా వ్రేలాడదీసి, క్రూర జంతువులకు వదిలేస్తారు.
15. పూయాదన
శుచీ, ఆచారం పాటించని వారికీ, వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకుండా, ఆడవారిని మోసం చేసి అనుభవించే పురుషులకూ, ఈ శిక్ష ఉంటుంది. అలాంటి పాపులను మలమూత్రాలు నిండిన బావిలో పడేస్తారు.
16. తప్తకుంభ
ఆవేశం, కోపం వంటి గుణాలు, మనిషిలోని విచక్షణను నశింపజేస్తాయి. ఆలోచనలు రాకుండా చేస్తాయి. అలాంటి ఆవేశమే, హత్యలూ, ఆత్మహత్యలకూ కారణమవుతుంది. విచక్షణారాహిత్యం వల్లనే, బ్రహ్మహత్యా, గోహత్యా, శిశుహత్యా, స్త్రీ హత్యా వంటి అత్యంత పాపకార్యాలు చేస్తుంటారు. ఈ విధంగా హత్యలు చేసిన వారికి, తప్తకుంభ అనే శిక్ష విధిస్తారు. పెద్ద బానల్లో నూనె, ఇనుప రజను వేసి, అవి సలసలా కాగుతున్నప్పుడు, వారిని అందులో వేయిస్తారు.
17. తమిశ్రం
మనిషి ఆశాజీవి. హద్దుల్లేని ఆశ, అనర్ధాలకు కారణమవుతుంది. తప్పుడు మార్గాల్లో నడిపిస్తుంది. అత్యాశతో, ఇతరుల ఆస్తినీ, సొమ్మునూ కాజేసిన వారికి, తమిశ్రం అనే శిక్ష ఉంటుంది. వారిని కాలపాశంతో కట్టేసి, జీవుడి సూక్ష్మ శరీరం నుంచి, రక్తం కారేలా, యమ భటులు హింసిస్తారు.
18. తప్తసూర్మి
బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారికి, ఈ శిక్ష అమలు చేస్తారు. వారిని పెను మంటల్లో పడేసి, సజీవదహనం చేస్తారు.
19. అసిపత్రవనం
విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి, ఇతరుల పనులలో వేలుపెట్టి, వాళ్ళను కూడా చెడగొట్టే వ్యక్తులు, ఈ శిక్షను అనుభవిస్తారు.
20. అంధతమిశ్రం
స్వార్థ చింతనతో, ఎదుటి వారిని మోసం చేసేవారినీ, అవసరాలు తీరే వరకూ భార్యను వాడుకుని, ఆ తరువాత వదిలేసే భర్తలనూ, ఇందులో శిక్షిస్తారు.
21. అంధకూపం
అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళనూ, అమాయకులనూ, బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్లూ, కాపాడమని ప్రాథేయపడే వారిని, అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్లూ, ఈ శిక్షను అనుభవిస్తారు.
22. మహా రౌరవం
న్యాయమైన వారసత్వాన్ని కాదని, ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారికీ, ఇతరుల భార్యనూ, ప్రేమికురాలినీ అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారికీ విధించే శిక్ష, మహారౌరవం.
23. దండసూకర
తనతోటి మానవులను జంతువుల్లా భావించి, హీనంగా చూడడం, వారి హక్కులను హరించి వేయడం లాంటివి చేసే వారికి, ఈ శిక్ష అమలు చేస్తారు.
24. సూకరముఖం
అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలూ, అన్యాయాలలో దిగబడి, విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులూ, అధికారులూ అనుభవించే శిక్ష ఇది.
25. శూలప్రోతం
ఎదుటి వారు ఏ అపకారం చేయకపోయినా, నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళకూ, నమ్మకద్రోహం చేసే వాళ్ళకూ, శూలప్రోతం శిక్షను వేస్తారు.
26. వజ్రకంటకశాల్మలి
జంతువులతో శృంగారం చేసే వారికి విధించే శిక్ష, వజ్రకంటకశాల్మలి.
27. వైశానం
పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే, తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి, విందులూ వినోదాలూ చేసుకుంటూ, అవతలి వారి బాధను చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళకు, ఈ శిక్ష విధించబడుతుంది.
28. ప్రాణరోధ
కుక్కలూ, ఇతర జంతువులనూ ఉసిగొల్పి, సాధు జీవులనుగానీ, సాధు జంతువులనుగానీ హింసించే వారికి, ఈ శిక్షను అమలుజేస్తారు.
29. పర్యావర్తనం
ఆకలితో అలమటించిపోయే వాడు, ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే, పెట్టకపోగా, నానా దుర్భాషలాడేవాడికి, ఈ శిక్ష పడుతుంది.
30. లాలాభక్షణం
అతి కాముకులకూ, భార్యను కట్టుబానిసగా, నీచంగా చూసే వాళ్ళకూ, తమ ఆధిక్యతను చాటుకోవడానికి, ఆడవారిని హీనంగా చూసే వారికీ, ఈ శిక్షను విధిస్తారు.
31. క్షారకర్దమం
మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి, వారిని దబాయించి బ్రతికే వాళ్ళకు, ఈ శిక్ష విధిస్తారు.
32. రక్షోభక్ష
జంతుబలినీ, నరబలినీ విచ్చలవిడిగాజేసి, మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారికి విధించే శిక్ష రక్షోభక్ష.
33. అగ్నిజ్వాల
అడవుల్లో ఉంటూ, ఎవ్వరి జోలికీ రాని జంతువులనూ, పక్షులూ, పిట్టలనూ పట్టి పల్లార్చే వారికి అమలుజేసే శిక్ష, అగ్నిజ్వాల.
గరుడ పురాణంలో వివరించబడిన ఈ శిక్షలు, మనలను భయపెట్టడానికి కాదు.. మనలోని క్రూరత్వాన్ని తరిమేసి, సమాజానికి హానికారకమైన పనులు చేయకుండా, ఆనందమైన జీవితం గడపడానికి, చెప్పబడినవి. సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgwGLfOt2uUZbiZxZoJ4AaABCQ
No comments:
Post a Comment