Ads

14 January, 2021

కనుమ పండుగ విశిష్ఠత! Kanuma Festival

 

కనుమ పండుగ విశిష్ఠత!

మిత్రులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.. కాంతికరమైన ఈ కనుమ పండుగ, మీకు సకల సంతోషాలను కలుగుజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు వారింట సిరుల పంటను తెచ్చే సంక్రాంతి పండుగలో, మూడవ రోజు కనుమ. పచ్చని లోగిళ్లతో కళకళలాడే మన తెలుగు నాట వచ్చే కనుమకు, ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచీ, మన భారతీయులు, పంచభూతాలను ఆరాధించడంతో పాటు, సకల జీవులకు పరోపకారం చెయ్యాలనే సదుద్దేశంతో ఉన్నారు. అందులో తమ ఇంట సిరులు పండించడానికి కారణమైన పాడి పశువులపై, మరింత అప్యాయత కనబరుస్తారు. అందుకే, సంక్రాంతి పర్వదినాలలో, కనుమను పశువుల పండుగగా పిలుచుకుంటారు. అసలు కనుమ పండుగ రోజు, పశువులను ఎందుకు పూజిస్తారు? ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది? ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? అనే విషయాలు ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HEeD4ulBfK0 ]

కనుమ విశిష్ఠతను, వేదకాలంలోనే ప్రస్తావించడం జరిగింది. కనుమ పర్వదినం గురించి, అధర్వణ వేదంలో "అవడోత్సవం" అనే పేరుతో, కొంత వివరణ ఉంది. పంటలు పండి, ధాన్యం ఇంటికి తెచ్చుకున్న తరువాత, రైతులు చేసే విధాయ కృత్యమే అవడోత్సవం అని, శ్రౌత సూత్రంలో రాశారు. అందుకే, కనుమ పర్వదినాన, గో, పశు పూజలు చెయ్యడం, సంప్రదాయంగా జరుగుతోంది. సంవత్సరం మొత్తం, తమకై ఎంతగానో శ్రమించే పశువులను సత్కరించడమే, ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. అందుకని ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానాలు చేసి, తమ ఇళ్లలోని ఎద్దులకూ, ఆవులకూ స్నానాలు చేయించి, వాటి కొమ్ములకు పసుపు, లేదా ఎరుపు రంగులు పూసి, వాటిని భక్తితో పూజిస్తారు. ఆ తరువాత మేళతాళాలతో ఊరంతా తిప్పుతారు. కొన్ని చోట్ల ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. తెలుగు జిల్లాల్లో, ఇంటి చూరులకు వరికంకులను కడతారు. అలా చెయ్యడం ద్వారా, పక్షులు ఆ వరి గింజలను తిని అశీర్వచనాలు ఇస్తాయని పెద్దల నమ్మిక.

ఇలా చెయ్యడాన్ని, పక్షి పూజ అని అంటారు. కొన్ని ప్రాంతాలలో, ఔషధ గుణాలు గల చెట్ల వేర్లనూ, బెరడులనూ తీసుకువచ్చి, ఉప్పుతో కలిపి పొడి చేసి, తమ ఇళ్లలోని పశువులన్నింటికీ, కనీసం మూడు గుపిళ్లు తినిపిస్తారు. దీనినే "ఉప్పుచెక్క" అని అంటారు. దీనివల్ల పశువులకు ఎటువంటి అనారోగ్యం దరిచేరదని, వారి నమ్మిక. కొన్ని ప్రాంతాలలో, కొత్త బియ్యంతో పొంగలి వండి, దాన్ని ఇళ్లలోని పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన పొంగలిని, తమ పొలాల్లో చల్లి వస్తారు. దీనినే "పోలి వేయడం" అంటారు. ఈ విధంగా వెయ్యడం వల్ల, లక్ష్మీ దేవి తమ ఇంట కొలువై వుంటుందని, ఒక నమ్మిక. ఈ పద్ధతులను మన వారు యుగయుగాలుగా ఆచరిస్తున్నారు. ఇక కనుమ రోజు వేసే రథం ముగ్గుకి, ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొంతమంది, సకల సౌఖ్యాలను తెచ్చిన పండుగ మూడవరోజు ముగియడంతో, ఆ రోజు సంక్రాంతి పండుగను ఘనంగా సాగనంపడానికి, ఈ రథం ముగ్గుని వేసి, దానికి పిండితో తాడులాంటి గీతను, వీధి చివరి వరకు లాగుతారు. 

అయితే, మరొక కథనం ప్రకారం, పూర్వం విష్ణు మూర్తి వామనావతారంలో వచ్చి, బలి చక్రవర్తిని భోగినాడు, తన మూడవ అడుగుతో పాతాళానికి తొక్కినట్లు, మన పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఆ సమయంలో విష్ణు మూర్తి బలి చక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. ఆ ప్రకారం, ప్రతీ ఏడు సంక్రాంతి పర్వదినాలలో మొదటి రోజు, ప్రజలంతా వెలిగించే భోగి మంటలతో, తనకి ఆహ్వనం పలుకుతారనీ, కావున ఆ సమయంలో బలి చక్రవర్తి, పాతాళం నుంచి భూమిపైకి వచ్చి, ఆ మూడు రోజులూ, సకల జనులనూ ఆశీర్వదించి, కనుమ నాడు తిరిగి పాతాళానికి ప్రయాణమవుతాడు. అందుకు ప్రతీకగా, ఈ రథం ముగ్గులో బలి చక్రవర్తిని సాగనంపుతారని, కొన్ని ప్రాంతాల వారు భావిస్తారు. 

కనుమ రోజున గ్రామ దేవతనూ, కుల దేవతనూ కచ్చితంగా పూజించాలని, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని చోట్ల కనుమ తరువాత వచ్చే ముక్కనుమ రోజున, గ్రామదేవతలకు జంతు బలులిచ్చి, నైవేద్యాలు పెట్టడం, అనాదిగా వస్తోన్న ఆచారం. అయితే, శాస్త్రం ప్రకారం, కనుమరోజు మినపగారెలు వండి, వాటిని గ్రామ దేవతలకు నైవేద్యంగా పెట్టడంతో పాటు, ఇంటిల్లిపాదీ కచ్చితంగా తినాలి. ఈ గారెలతో పాటు, మినుములతో చేసే సున్నుండలూ, బూరెల వంటి వివిధ వంటకాలు చేసుకుని తింటారు. ఇక తెలుగు జిల్లాలలో, కనుమనాడు కాకి కూడా కదలదనే సామెత వాడుకలో ఉంది. అందువల్ల, ఆ రోజు కొంతమంది ప్రయాణాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలా చేస్తే, మళ్లీ సుదీర్ఘ కాలం పాటు, తమ సొంత ఊరికి తిరిగిరాలేమని, వారి నమ్మిక. కమ్మని అనుభూతులను పొందుతూ, కష్టాలు కనుచూపుమేర దాటిపోవాలని ఆశిస్తూ, మిత్రులందరికీ కనుమ శుభాకాంక్షలు..

Link: https://www.youtube.com/post/UgxzZ7o0UTqtjjYv0-N4AaABCQ

No comments: