హరిద్వార్ - కుంభమేళా '2021' స్నానపు తేదీలు, వివరాలు..
ఈ సంవత్సరం జనవరి 14 నుండి, 2021 ఏప్రిల్ 27 వరకు, హరిద్వార్ లో కుంభమేళా జరుగుతుంది. (ప్రస్తుత కరోనా పరిస్తితులను బట్టి అక్కడ కుంభస్నాన తేదిలు మారవచ్చు).. కుంభమేళా, ప్రపంచంలో అత్యధికులు హాజరయ్యే ఒక ఉత్సవం. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేకులు వీక్షిస్తూ ఉంటారు. దీనికోసం భక్తులకు ఎటువంటి ప్రకటనలూ, ఆహ్వానాలూ ఉండవు. అయినా అక్కడకు ఇసుకేస్తే రాలనంత మంది జనాలు వస్తారు. ఇలాంటి ప్రత్యేకమైన ఉత్సవం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.
[ కుంభమేళాల్లో సూక్ష్మ శరీర యానం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/wwE-4g6kgC8 ]
ఇక్కడ ఎన్నో ధార్మిక కార్యక్రమాలూ, పురాణ ప్రవచనాలూ, ప్రార్థనలూ, మంత్రపఠనాలూ, దివ్యోపదేశాలూ, నిరాటంకంగా సాగిపోతుంటాయి. అక్కడ నదుల్లో స్నానమాచరించడం, పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ ఉత్సవం కనీసం, సా.శ ఏడవ శతాబ్దం నుంచి జరుగుతున్నట్లు, చారిత్రక ఆధారాలున్నాయి. అప్పటి నుంచీ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.
హరిద్వార్ కుంభమేళా 2021 స్నాన తేదీలు:
జనవరి 14 గురువారం 2021 : మకర సంక్రాంతి
ఫిబ్రవరి 16 మంగళవారం 2021 : వసంత పంచమి
ఫిబ్రవరి 27 శనివారం 2021 : మాఘ పౌర్ణమి
మార్చి 11 గురువారం 2021 : మహా శివరాత్రి
మార్చి 28 ఆదివారం 2021 : ఫాల్గుణ పౌర్ణమి (హోలీ)
ఏప్రిల్ 12 సోమవారం 2021 : సోమవతీ అమావాస్య
ఏప్రిల్ 13 మంగళవారం 2021 : నూతన హిందూ సంవత్సరం
ఏప్రిల్ 14 బుధవారం 2021 : మేష సంక్రాంతి స్నానం
ఏప్రిల్ 21 బుధవారం 2021 : శ్రీరామ నవమి
ఏప్రిల్ 27 మంగళవారం 2021 : చైత్ర పౌర్ణమి
మే 11 మంగళవారం 2021 : (వైశాఖ) అమావాస్య
మే 26 బుధవారం 2021 : వైశాఖ పౌర్ణమి
పై తేదీలలో షాహీ స్నాన తేదీలు:
మార్చి 11 గురువారం శివ రాత్రి
ఏప్రిల్ 12 శుక్రవారం సోమవతీ అమావాస్య
ఏప్రిల్ 14 ఆదివారం మేష సంక్రాంతి
ఏప్రిల్ 27 మంగళవారం చైత్ర పౌర్ణిమ
హరిద్వార్ వెళ్లే భక్తులందరూ పై తేదీలకు అనుగుణంగా మీమీ తీర్థయాత్రకై ప్రణాళిక వేసుకొనగలరు..
ఈ కుంభమేళా గురించి హిందూ పురాణాల్లో ఒక ఆసక్తి కరమైన కథ ఉంది.
ఒకసారి దుర్వాస మహాముని, ఇంద్రుడి రాజధానియైన అమరావతీ నగరాన్ని సందర్శించి, ఇంద్రుడికి ఎప్పటికీ వాడిపోని పూలతో తయారు చేసిన మాల ఒకటి బహూకరించాడు. అయితే, ఇంద్రుడు దాన్ని తేలిగ్గా తీసుకుని, తన వాహనమైన ఐరావతానికి ఇచ్చివేశాడు. అదేమో ఆ పూలమాలను కాలికింద వేసి తొక్కేసింది. ఇంద్రుడి అలసత్వాన్నీ, పొగరునూ చూసి దుర్వాస ముని అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇంద్రుడు తన సంపద, సుఖాలను కోల్పోయేలాగా శపించాడు. సరిగ్గా అప్పుడే, అసుర రాజైన బలి ఇంద్రుడి మీదకు దండెత్తి, అమరావతిని వశపరచుకున్నాడు.
పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు, ఇంద్రుణ్ణి అమృతం సంపాదించాల్సిందిగా విష్ణువు సలహా ఇచ్చాడు. దీని కోసమే క్షీర సాగర మథనం జరిగింది. ఈ మథనంలో మొదట ఉద్భవించిన హాలాహలాన్ని, శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. తర్వాత కామధేనువు, కల్పవృక్షం లాంటివి కూడా ఉద్భవించాయి. వీటన్నింటి తరువాత, దేవ వైద్యుడైన ధన్వంతరి సాక్షాత్కరించి, ఒక కుండ (కుంభం)లో అమృతాన్ని అనుగ్రహించాడు. దీని కోసం సురాసురుల మధ్య భీకర పోరు జరిగింది.
ఈ పోరాటంలో, ఆ కుంభం నుంచి నాలుగు అమృత బిందువులు ఒలికి, అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినీ ప్రాంతాల్లో పడ్డాయనీ, దాని వల్ల అవి పవిత్రమైన స్థలాలుగా భావించడం జరుగుతోంది. మరొక కథనం ప్రకారం, మోహిని అవతారంలోని విష్ణువు, ఆ అమృత భాండాన్ని తన వాహనమైన గరుడునికిచ్చి, భద్రమైన చోటికి తీసుకెళ్ళమన్నాడు. అలా తీసుకు వెళూతూ, గరుత్మంతుడు ఈ నాలుగు చోట్ల ఆగాడని ప్రతీతి.
ప్రతి మూడేళ్ళకు ఒక్కో స్థలంలో కుంభమేళా జరుగుతుంది. ఈ నాలుగు చోట్లా, ప్రతి పన్నెండేళ్ళకొకసారి, మహాకుంభమేళా జరుగుతుంది. పన్నెండేళ్ళు అంటే, రాశి చక్రంలో బృహస్పతి ఒక ఆవృతం పూర్తి చేసినట్లన్నమాట. ఈ మహా కుంభమేళాకు, ఎక్కడో సభ్యసమాజానికి దూరంగా తపస్సు నాచరించే యోగులు కూడా వస్తారంటే, దీనికున్న ప్రాశస్త్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
హరిద్వార్ వెళ్లే భక్తులందరికీ విన్నపము: ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి, అక్కడి కుంభస్నాన తేదిలు మారవచ్చు.. వెళ్ళేవారు వివరాలు తెలుసుకుని, ఈ యాత్రను చేయగలరని మనవి..
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/Ugzocc6y6P979k_gGOl4AaABCQ
No comments:
Post a Comment