Ads

27 December, 2020

చోళుల రాజధానిగా విరాజిల్లిన పూంపుహార్ చారిత్రక వైభవం! Kaveripattinam: The Ancient Port City of the Cholas Buried Under the Sea


చోళుల రాజధానిగా విరాజిల్లిన పూంపుహార్ చారిత్రక వైభవం!

ఈ సువిశాల విశ్వంలో, అద్వితీయమైన, అసామాన్యమైన సంపదా, నాగరికతా, సంస్కృతీ, జ్ఞాన, విజ్ఞాన ప్రతిభలతో తులతూగిన అతి ప్రాచీన దేశం, మన భారతదేశం. వాణిజ్య రంగంలో ప్రపంచానికే నాడీ కేంద్రంగా చెలామణి అయి, రారాజుగా వర్థిల్లింది. పాశ్చాత్య దేశాలు నాగరికతను అలవరుచుకోవడానికి, వేల సంవత్సరలకు మనుపే, మన భారతావని, ప్రపంచ వర్తక, వ్యాపారాలలో, ఆధిపత్యం చెలాయించింది. ఆ కాలంలో వాణిజ్యానికి అవసరమైన నావికా రంగంలో కూడా, ఏక ఛత్రాధిపత్యం వహించిన మేటి దేశం, మన భారతావని. ఆనాటి మన వాణిజ్య సామ్రాజ్యానికి కేంద్ర బిందువుగా నిలచిన చోళుల రాజధానీ, తమిళనాడులోని సముద్రతీర రేవు పట్టణమూ అయిన, "పూంపుహార్". నేటి తరానికి తెలియని అనేక ఆశ్చర్యకర రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ప్రాంతమిది. 2000 సంవత్సరాల క్రితం, కాల గర్భంలో కలిసిపోయిన మహత్తర చోళ సామ్రాజ్యం! అత్యంత సుందరమైన ఈ ప్రాంత నిర్మాణం వెనుక దాగిన రహస్యం, దేవతలు నడయాడిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ‘పూంపుహార్’ విశిష్ఠత ఏంటి? విశ్వకర్మ చేత నిర్మింపబడిన ఈ రాజ్యం, చోళ రాజుల రాజధానిగా ఎలా మారింది? అనేటటువంటి ఆశ్చర్యకర విషయాలను, ఈ రోజు తెలుసుకుందాం...

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి : https://youtu.be/HpVel8vLJQs ]

కవిరాజులుద్భవించిన కవనకృతి కీర్తింబడసిన క్షేత్రము, 

ఇదియే నవరస మధుర ఇతిహాస శివమోక్ష ముచుకుంద ఇంద్ర స్నేహ వైభవమ్!

"పూంపుహార్", ఋగ్వేద కాలంలో నిర్మింపబడిన ఒక ప్రాచీన రేవు పట్టణం. ఇది చరిత్రలో, చోళ రాజుల రాజధానిగా,  శోభాయమానంగా భాసిల్లింది. ఈ పట్టణం, కావేరీ నది, బంగాళాఖాతంలో సంగమించే ప్రదేశంలో ఉంది. అందుకే,  దీనికి పుహార్ అనే పేరు ఏర్పడింది. తమిళంలో పుహార్ అంటే, సంగమం అని అర్థం. కాల క్రమంలో, పుహార్ కాస్త  పూంపుహార్ గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ చేత ఇంద్రుడు నిర్మింపజేశాడు. అందుకొక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇంద్రుడు భయంకర రాక్షసులతో యుద్ధం చేస్తున్న సమయంలో, వారి నుండి తప్పించకుని, ఈ ప్రాంతానికి వచ్చి, తన సైన్యంతో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ప్రాంతాన్ని ముచుకుంద అనే మహారాజు పాలిస్తుండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు మాత్రమే కాదు, ఇంద్రునికి ఆప్తుడు కూడా. నిర్విరామంగా పోరాడి, అలసి, సేదతీరుతున్న ఇంద్రునిపై, రాక్షసులు దాడి చేయబోతుండగా, వారితో యుద్ధం చేసి, ఆ అసురులను హతమార్చాడు ముచుకుంద రాజు.

ఇంద్రుడు అమరావతి వెళ్లడానికి రహస్య మార్గాన్ని చూపించి, సహాయం చేశాడు. రాక్షసులు ఆ దారిలో అమరావతికి చేరుకోకూడదనే ఉద్దేశ్యంతో, ముచుకుంద రాజు, కొన్ని సంవత్సరాల పాటు అక్కడే నిద్రాహారాలు మాని  కాపలా కాశాడు. అతని మంచితనానికీ, చేసిన సహాయానికీ ముగ్ధుడైన ఇంద్రుడు, దేవతా నగరాల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి, ముచుకుందకు అత్యద్భుతమైన, రేవు పట్టణాన్ని నిర్మించి ఇమ్మన్నాడు. అంతేకాక, ఆ ప్రాంతం, లక్ష్మీ నివాస స్థానంగా, కొంగుబంగారంగా భాసిల్లుతుందని వరమిచ్చాడు. సర్వాంగ సుందరంగా నిర్మింపబడిన ఈ పుహార్ ప్రాంతాన్ని చూడడానికి, అనేక మంది దేవతలు వచ్చేవారంటే, దీని వైభోగం ఏంటో, అర్థం చేసుకోవచ్చు. చోళ సామ్రాజ్యం, ఈ ప్రాంతం నుండే పుట్టి, అఖండ భారతావనిని జయించింది. ఇంద్రుడు చెప్పినట్లుగానే, చోళ రాజుల రాజధానిగా మారిన పూంపుహార్, అత్యంత సంపదలతో తులతూగే రాజ్యంగా, కీర్తి గడించింది. చోళ రాజులు, ఇక్కడి నుండే, అఖండ సామ్రాజ్యాలైన రోమ్, గ్రీక్, చైనాలతో, వ్యాపార వాణిజ్యాలను సాగించేవారు. ఓడలు విరిగిపోతాయా? అనేంత సంపదనూ, వజ్ర వైఢూర్యాలనూ, ఈ రేవు ద్వారానే తీసుకొచ్చేవారట. వెలకట్టలేని సంపదలను, ఈ ప్రాంతంలోనే నిల్వ చేసేవారు. నాడు అత్యంత శోభాయమానంగా, చోళ రాజ్య సంపదకు నిలువెత్తు సాక్ష్యంగా వెలుగొందిన ఈ ప్రాంతం, 535 లో వచ్చిన ప్రకృతి విపత్తైన సునామీ కారణంగా, తన వైభవాన్ని కొల్పోయింది. ఈ  ప్రాంతం, చాలా వరకూ సముద్ర గర్భంలో కలిసిపోయింది. చోళ రాజుల సంపదను తనలో దాచుకున్న పూంపుహార్  సముద్ర తీరంలో, పరిశోధనలు ప్రారంభించారు అధికారులు. వెలకట్టలేని సంపద, సముద్రపు అడుగుభాగంలో నిక్షిప్తమై ఉందని, National Institute of Oceanography, Archaeologist లు అభిప్రాయపడుతున్నారు.

శ్రీకృష్ణుని రాజ్యం, ద్వారకకు సంబంధించిన అనేక ఆధారాలు సముద్ర గర్భాన బయల్పడినా, దానిని పరిశోధించడానికే నానా తంటాలూ పడుతున్న  ప్రభుత్వానికి, ఈ పూం పుహార్  మరో తలనొప్పిగా మారింది. లోపల దాగి ఉన్న అమూల్యమైన సంపదను దక్కించుకోవాలనే ఆశను వదులుకోలేక, మీమాంసలో పడ్డారు అధికారులు. కొంతమంది గజ ఈతగాళ్లూ, ప్రభుత్వ అధికారులూ కలిసి, పూంపుహార్ లో దాగిన రహస్యాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. నాటి వైభోవోపేత జాడలు కనుమరుగై, తన ప్రాశస్త్యాన్ని కొల్పోయిన ప్రస్తుత పూంపుహార్ లో, గత చరిత్రకు తార్కాణంగా నిలుస్తోంది, పురాతన పల్లవనేశ్వర ఆలయం. దీనిని మాసిలమని నాతార్ కోవిల్ అని కూడా అంటారు. సామాన్యశకం, 1305 లో, పాండ్య వంశానికి చెందిన మరవర్మ కులశేఖర పాండ్యుడనే రాజు నిర్మింపజేసిన ఈ ఆలయం, సముద్రపు ఆటుపోట్లను సైతం తట్టుకుని నిలబడి, చోళ రాజుల నిర్మాణ శైలికి అద్దం పడుతోంది. తమిళుల పంచకావ్యాలలో ఒకటైన ‘శిలప్పదిగారం’ పేరిట, పూం పుహార్ లో ‘ఆర్ట్ గ్యాలరీ’ స్థాపించబడింది. ఇది చాలా అరుదైన, విశిష్ఠ నిర్మాణాన్ని పోలి ఉంటుంది.

50 అడుగుల ఎత్తులో, 7 అంతస్తులుగా నిర్మింపబడిన ఈ కట్టడంలో, వివిధ రకాల శిల్పాలూ, పురాణ ఇతిహాస, ఇతి వృత్తాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. గ్యాలరీ ప్రవేశ ద్వారం మీద, 22 అడుగుల ఎత్తులో, మకర తోరణం అందంగా అలంకరించబడి ఉంటుంది. భవన ఆవరణలో, కడియం ఆకారంలో, ఒక నీటి కొలనూ, కొలనుకు అటు, ఇటు కణ్ణగీ, మాధవీ అనే స్త్రీల విగ్రహాలున్నాయి. పూం పుహార్ కు తలమానికంగా నిలచిన కణ్ణగి, అత్యంత శక్తివంతమైన స్త్రీ. తమిళ నాట దైవంగా పూజలందుకుంటున్న ఈ కణ్ణగి ఎవరు? తమిళ కావ్యమైన శిలప్పదిగారంలో వివరించబడిన కణ్ణగీ, మాధవీ అనే స్త్రీ ల గురించీ, వారి జీవిత గాథల గురించీ, వారివురి మధ్యా ఉన్న సంబంధం గురించీ, మన తదుపరి వీడియోలో పొందుపరుస్తాను. తప్పక చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

No comments: