హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు.. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు.
[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]
సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
హనుమద్వ్రతము ఎక్కడ చేయాలి?
వాస్తవానికి పంపానదీ తీరమునందు కూర్చొని మాత్రమే హనుమద్వ్రతము చేయాలి. వేరొక చోట ఎక్కడ కూర్చొని కూడా హనుమద్వ్రతము చేయరాదు. శాస్త్రము దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది. నువ్వు పంపా నదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశం పెట్టి అందులో నీరు పోసి దానికి దారములు కడతారు. అది శాస్త్రము తెలిసిన వారు, ప్రక్రియను నిర్వహించగలిగిన వారు మాత్రమే కడతారు.
కలశం మీద కొబ్బ్బరి బొండాం పెట్టి అందులోకి పంపా జలం యొక్క ఆవాహన మంత్రం చెప్తారు. అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క. అప్పుడు హనుమద్వ్రతం చేస్తారు.
హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు?
పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒకరాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు.
చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. రాజు హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు , సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్క్రుష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశీ తిథినాడు హనుమద్వ్రతమును చేస్తారు. వ్రతము చేయడం ఎంతో వ్రతము యొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు.
ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారనుకోండి, హనుమత్ వ్రతాన్ని పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము వచ్చేస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి.. శ్రీ హనుమద్వ్రతం..
మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా || మృగశిరా నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది.
భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి, హనుమత్ ప్రసాదం తీసుకుని, వ్రతం పూర్తిచేసుకుంటారు. పద మూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేస్తే, హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం, వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని, శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి, ఈ వ్రతాన్ని పంపానదీ తీరంలోనే చేసుకోవాలి.
ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు, పంపా కలశం ఏర్పాటు చేసి, దాని పక్కనే శ్రీ హనుమద్వ్రతం ఆచరిస్తే, హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.
శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు.
వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి, లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి, భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందనీ చెప్పాడు.
అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి, సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని, దాన్ని ఆచరించి, మళ్ళీ రాజ్యాన్ని పొందమని, ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి వ్రతం చేయించాడనీ, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే, ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి, దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా, అతడికి గర్వం కలగటంతో, కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడించాడు.
తన జెండాపై కట్టబడ్డ వాడు, ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ, తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు.
అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ, ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేననీ వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే, పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా? అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు.
పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు.
అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాదిదేవతలు హనుమతో ''హనుమా! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు, నిన్ను ఎవరు భక్తీ శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో, వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు'' అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక, నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి, రావణ సంహారం చేసి, అయోధ్యాపతివి అవుతావు.. అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి ''హనుమ చెప్పినదంతా సత్యమైనదే'' అని పలికింది.
వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు, హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపా నదీతీరంలో శ్రీరాముడు, సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరాన్ని పూజించి, కట్టుకున్నాడు.
కాబట్టి, సందేహం లేకుండా, ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి, భక్తీ శ్రద్ధలతో అంతా తోరాలు కట్టుకున్నారు.
Link: https://www.youtube.com/post/UgyvrYBZNEInyS56Hjt4AaABCQ
No comments:
Post a Comment