Ads

31 December, 2020

తిరుప్పావై గోదాదేవి 16వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

పదహారవ రోజు అనగా 31.12.2020 గురువారము..

16 వ రోజు - భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే..

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము:

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ

కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ

వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్

ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై

మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్

తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా

నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్

మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి.  ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే  మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది. ఆ భవనంకు ఒక తోరణం ఒక ద్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాల్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.

"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే  "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు,  అసలు నీవే మా నాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో  ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చేరల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ద్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్ " మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే  శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు.  అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడి యందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నంద గోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా  అని నమస్కరించారు. "మణిక్కదవం" మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళ్ళం తీయవయ్యా.

ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు  అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్ల పిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, " నెన్నలే  వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయన చుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి,  మరి వదిలేద్దామా అయనని అంటె "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.

"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు,  ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

సంక్షిప్త భావం:

మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.

అవతారిక:

ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి, అందరను వ్రత గోష్ఠిలోనికి ఆహ్వానించి, వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి, అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు.

పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో, శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా!

భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.

దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి, మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో).

(ఖరహరప్రియ - ఏకతాళము)

ప.. మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ!

      సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ!

      ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!

      సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

చ.. గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న

      అల్లన మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.

      చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ!

      నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ

      ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!

      సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/UgxKCAjxgGs32t6oVcV4AaABCQ

No comments: