Ads

24 November, 2020

రేపు '25/11/2020' కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్ఠత!


కార్తీక శుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ - ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు, ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి, ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి, భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం, ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో, బీష్ముడు ఈ ఏకాదశినాడే, అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి, ఈరోజునే జన్మించారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే, విష్ణుపూజ చేసి, పారణ చేసి అనగా భోజనం చేసి, వ్రతాన్ని ముగించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి, బ్రహ్మదేవునికీ నారద మహర్షికీ మధ్య జరిగిన సంభాషణ, స్కంద పురాణంలో కనిపిస్తుంది. 'ఈ ఏకాదశి, పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలూ, 100 రాజసూయ యాగాలూ చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని, ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో, అలాగ ఒక జీవుడు, తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది, ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు మనం చిన్న మంచిపని - పుణ్యకార్యం చేసినా, అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్నిస్తుంది.

ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి, సాధించలేనివి ఏమీ ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి, ధాన్యం, సంపదలూ, ఉన్నతస్థానం కలగడంతో పాటు, పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలూ, యజ్ఞయాగాలూ, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి, కోటిరెట్ల పుణ్యం, ఒక్క సారైనా, ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది' అని బ్రహ్మదేవుడు, నారదునితో పలికాడు.

అలాగే, ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన, సూర్య గ్రహణ సమయంలో, పవిత్ర గంగాతీరాన, కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలనా, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలనా, ఈ లోకంలోనే గాక, మరణానంతరం, పరలోకంలో కూడా, సర్వ సుఖాలు లభిస్తాయి.

ఈ రోజున బ్రహ్మాది దేవతలూ, యక్షులూ, కిన్నెరులూ, కింపురుషులూ, మహర్షులూ, సిద్దులూ, యోగులూ, అందరూ విష్ణులోకం చేరి, కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ, శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల, ఉత్థాన ఏకాదశి రోజున, ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో, వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని, ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందుకే అందరూ విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే, దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి. వీలైతే, స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది.

అందరూ శ్రీ మహావిష్ణువుకు హారతి ఇచ్చి లబ్ది పొందుతారని ఆశిస్తున్నాను. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgxuGud5YP78jPBQIa14AaABCQ

No comments: