Ads

01 January, 2022

ప్రతి భారతీయుడూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర!

 

ప్రతి భారతీయుడూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర!

జనవరి 1న ప్రపంచమంతా, కొత్త సంవత్సర వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ జనవరి ఒకటి కొత్త సంవత్సరానికి ఆరంభం అనే విషయం వెనుక, చరిత్రతో పాటు, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయనే విషయం, మనలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం వాడుతున్న ఈ Calendar ని ఎవరు కనిపెట్టారు? పూర్వం ఏ నెలలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు? మన దేశంలో, ఈ ఆంగ్ల Calendar ఎలా అమలులోకి వచ్చింది? అత్యంత పురాతన సంస్కృతి గల మన దేశంలో, జనవరి 1న కొత్త సంవత్సరాన్ని ఎప్పుటి నుండి జరుపుకుంటున్నారు? అనేటటువంటి విషయాల గురించి, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/TNSy3HA-kus ]

[ ఉగాది ఆవశ్యకతను తెలుసుకోవడానికి: https://youtu.be/PNwsSBE8SQc ]

జనవరి ఒకటి నుంచి, కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందనీ, ఆ రోజుని New Year గా సంబరాలు జరుపుకోవడం వెనుక, చాలా పెద్ద చరిత్రే ఉందనీ చెప్పాలి. హిందూ, Babylonia, Zoroastrianism, Hebrew, Roman వంటి ప్రాచీన నాగరికతలకు చెందిన ప్రజలు, కొన్ని వేల ఏళ్ల క్రితం, వారి వారి క్యాలెండర్లను రూపొందించుకున్నారు. ఈ Calendars అన్నీ, సూర్యమానం, లేదా చంద్రమానం ఆధారంగా రూపొందినవే. అయితే, నేడు మనం ఉపయోగిస్తున్న ఆంగ్ల Calendar పుట్టుక, Roman calendar నుంచి వచ్చింది. సామాన్య శక పూర్వం, 7000 సంవత్సరాల ముందు వరకూ, రోమన్స్ తమ కొత్త సంవత్సరాన్ని మార్చి నెలలో జరుపుకునే వారు. అప్పట్లో వారి Roman calendar లో, కేవలం పది నెలలు మాత్రమే ఉండేవి. ఈ calendar ని సంస్కరించాలనే ఉద్దేశ్యంతో, సామాన్య శక పూర్వం, 7వేల వ సంవత్సరంలో, ఆనాడు రోమ్ ను పాలించిన (న్యూమా పాంటీలియస్), జనవరి, ఫిబ్రవరి అనే రెండు నెలలను ప్రవేశపెట్టాడు.

రోమన్లు ఎదైనా నూతన పని ప్రారంభించాలంటే, మొదటి పూజ, జానూస్ అనే దేవతకు చేసేవారు. ఆమె పేరు ఆధారంగా, జనవరి అనే నెలని రూపొందించడం వలన, ఆ నెలనే కొత్త సంవత్సరానికి ఆదిగా చెయ్యాలని నిర్ణయించాడు. అయితే, ఈ Calendar లో ఎన్నో తప్పులుండడం వలన, సామాన్య శక పూర్వం, 45వ సంవత్సరంలో, ఆనాటి రోమ్ చక్రవర్తి Julius Caesar, పాత రోమన్ Calendar ని సమూలంగా మార్చి, కొత్త కాలెండర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనినే Julius Calendar అని పిలిచేవారు. అంతేకాదు, ఇదే తొలి సౌరమాన Calendar గా, పేరుగాంచింది. అయితే, ఈ Calendar రూపకల్పన తరువాత కూడా, పాశ్చాత్య దేశాలు చాలా సంవత్సరాల పాటు, తమ కొత్త సంవత్సరాన్ని, మార్చి 25 న జరుపుకునేవి. కాలగమనంలో, అది ఏప్రిల్ కి మారింది. సామాన్యశకం మధ్యకాలంలో, డిసెంబర్ 25 ని క్రీస్తు జన్మదినంగా జరుపుకోవడం ఆరంభమవ్వడంతో, కొన్ని దేశాల వారు, క్రీస్తు పుట్టిన రోజునే, తమ కొత్త సంవత్సరంగా జరుపుకునే వారు. అయితే, ఈ భిన్న సంవత్సరాదులు పోయి, అందరూ ఒక రోజునే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో, 1580 లలో, అప్పటి క్రైస్తవ మత గురువు Pope Gregory-13, Julius Calendar ని మరింత మెరుగుపరచడం మొదలుపెట్టి, 1582, అక్టోబర్ లో కొత్త Calendar ని ప్రవేశపెట్టాడు.

దానినే, Gregorian calendar గా పిలుస్తున్నారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది, ఈ Gregorian calendar నే. ఈ calendar అమలులోకి వచ్చిన తరువాత, జనవరి 1 నే, నూతన సంవత్సరం ఆరంభంగా జరుపుకోవాలని, Pope Gregory గట్టిగా ప్రతిపాదించాడు. pope ప్రతిపాదనను అంగీకరించి, ముందుగా France, Italy, Portuguese, Spain దేశాల వారు అమలులోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్యశకం, 1699 లో జర్మనీ, 1752 లో ఇంగ్లాడు, 1873 లో జపాన్, 1912 లో చైనా, 1916 లో బల్గెరియా, ఆఖరిగా 1918 లో రష్యా దేశాల వారు, ఈ Gregorian calendar ని అమలులోకి తెచ్చారు. ఇక బ్రిటీషు వారు, 17, 18 వ శతాబ్దాలలో, తమ ఆధీనంలో ఉన్నఅన్ని దేశాలలో, ఈ calendar ని అమలులొకి తీసుకురావడం జరిగింది. ఆ కాలంలో, మన భారతదేశం కూడా వారి పాలనలో ఉండడం వలన, ఈ ఆంగ్ల calendar అమలులోకి రావడం, వారి కొత్త సంవత్సరాన్ని మనం కూడా జరుపుకోవడం మొదలైంది. అయితే, ఈ Gregorian calendar లో, ఎన్నో తప్పులున్నట్లు, ‘మన దేశ’ పండితులే కాకుండా, పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఈ calendar లో ఉన్న తప్పులను సరిచేయడానికి, అప్పట్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఆ కమిటీ, ఈ Gregorian calendar ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఉన్న చాలా లోపాలను చూపిస్తూ, సామాన్య శకం 1926 లో, ఒక రిపోర్టు ఇచ్చింది. అయితే, ఆ నివేదికను, క్రైస్తవ సమాజం పూర్తిగా పక్కన పెట్టేసింది. అందువల్ల, ఈ calendar లో తప్పులున్నా, ప్రపంచీకరణ నేపద్యంలో, అన్ని దేశాల వారూ, జనవరి 1 ని,  సంవత్సరాది ప్రారంభంగా జరుపుకుంటున్నారు. అయితే, జనవరి 1 తో పాటు, ప్రపంచంలో అనేక దేశాల వారు, ఇప్పటికీ వారికి సాంప్రదాయంగా వస్తున్న నూతన సంవత్సర వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా, ఈ ఆంగ్ల సంవత్సరాదిని వేడుకగా జరుపుకున్నా, మన ప్రాచీన నాగరికతను విడువలేదు. అందువల్ల, పంటలు చేతికి వచ్చే సమయంలో కానీ, ఋతువులూ, పుణ్యదినాలను పురస్కరించుకుని కానీ, నూతన సంవత్సర పండుగను, చాలా వైభవోపేతంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా మన దేశంలో ప్రాంతాల వారీగా, 8 విధాలుగా, నూతన సంవత్సర పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాతో పాటు, కర్ణాటక వారూ, చైత్ర మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి నాడు, ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరాదిగా, తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు. ఇక తమిళనాడులో, ప్రతీ సంవత్సరం ఏప్రిల్ మధ్యలో, తమిళ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఆ పర్వదినాన్ని, వారు పుత్తండు లేదా వరుష అనే పేర్లతో పిలుచుకుంటారు.

కేరళ వారు, తమ ప్రాచీన పంచాగాన్ని అనుసరించి, ప్రతీ సంవత్సరం medam అనే నెల మొదటి రోజున, నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు. ఆ పండుగనే, వారు విషు అని పిలుచుకుంటారు. కేరళ వారి శాస్త్రాల ఆధారంగా వచ్చే ఈ medam అనే నెల, ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యన ఆరంభమై, మే నెల మధ్యలో ముగుస్తుంది. గుజరాత్ వారు, ప్రతీ ఏడూ వచ్చే దీపావళి మరుసటి రోజుని, తమ నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు. దానినే వారు బెస్తు వారాస్ అని పిలుస్తారు. ఆ రోజున గుజరాత్ వారు, శ్రీ కృష్ణుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. పంజాబ్ వారు, బైసాఖి అనే పండుగను తమ కొత్త సంవత్సరాదిగా పేర్కొంటారు. సిక్కుల 10 వ మతగురువైన గురు గోబింద్ సింగ్ కలశ స్థాపన చేసిన రోజునే, బైసాఖిగా జరుపుకుంటారు. మహారాష్ట్ర వారైతే, గుడి పడ్వా అనే రోజుని, తమ నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఈ పండుగను, అనాదిగా, వారి రాష్ట్రంలో మామిడి పంట చేతికి వచ్చిన రోజున, జరుపుకుంటారు.

అస్సాం వారు, ఏప్రిల్ మధ్య నుంచి, వ్యవసాయం చేయడానికి అనువుగా, సంవత్సరాదిగా జరుపుకుంటారు. దానిని వారు రొంగాలి బిహు లేదా బొహగ్ అని పిలుస్తారు. ఇక బెంగాల్ వారికి ఏప్రిల్ మధ్యలో, తమ కొత్త సంవత్సరాది వస్తుంది. దానిని వారు pahela baisaakh అని పిలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని, బెంగాలీయులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే, మన భారతదేశమే కాకుండా, చాలా దేశాల వారు తమ నూతన సంవత్సరాదిని, జనవరి ఒకటిని కాకుండా, వేరు వేరు సమయాల్లో, చాలా ఘనంగా చేసుకుంటారు. జపాన్ వారు, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీల మధ్య, నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. దానిని వారు యాబురీ అని అంటారు. అయితే, ప్రస్తుతానికి జపాన్ వారు, జనవరి 3 న, ఆ పండుగను జరుపుకుంటున్నారు. థాయ్ లాండ్, మయన్మార్ లలో, నూతన సంవత్సరాన్ని, ఏప్రిల్ 13 నుంచి 15 వరకు జరుపుకుంటారు. దీనిని వారు తిజాన్ అని పిలుస్తారు. ఇరాన్ ప్రజలు, సూర్యుడు మేషరాశిలో అడుగుపెట్టిన రోజుని, తమ కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

31 December, 2021

బ్రాహ్మీ ముహూర్తం! | Brahmi Muhurta – The Time to Create Yourself

 


బ్రాహ్మీ ముహూర్తం!

సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని, మన పెద్దవాళ్లు పదేపదే చెప్పేవారు! తరాలు మారుతున్న కొద్దీ, జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. ఇప్పటికే పని చేయడానికీ, నిద్రపోవడానికీ, రాత్రీ పగలుతో సంబంధమే లేకుండా పోయింది. కానీ, ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం అన్న మాట, అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది? ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనాలేంటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bqar6jXtHjc ]

సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని, బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే, రుతువుని బట్టి, సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, తెల్లవారుజామున 4:00 నుంచి 4:30 సమయాన్ని, బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే, ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి? అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులున్నాయి.

ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కొద్దికొద్దిగా తాకుతూ ఉంటుంది కానీ, వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే, రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో, మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారని చెబుతారు. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని, వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే, ఆరోగ్యానికి చాలా మంచిది.

మనలో, జీవ గడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇవన్నీ సమయానుకూలంగా చేస్తేనే, ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే, తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలనుకునేవాడు, బ్రాహ్మీముహూర్తంలో లేవాలని చెబుతోంది. పైగా, ఆయుర్వేదం ప్రకారం, ఈ సమయం, `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలోని కదలికలనీ, ఆలోచనలనీ, రక్త ప్రసరణనీ ప్రభావితం చేసేది, ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు, మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివిన దానిని ఆకళించుకుని, దీర్ఘకాలం జ్ఞాపకం ఉంచుకోగలం.

అలాగే, ఉదయం వేళ, మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్, మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే, పిల్లలు బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే, చక్కగా గుర్తుంటుంది. ముఖ్యంగా ముందు రోజు భరించిన ఒత్తిడులన్నీ నిద్రలో మరచిపోతాం కాబట్టి, మెదడు ఉత్తేజంతో ఉంటుంది. ధ్యానం చేయాలనుకునేవారికి కూడా, ఈ సమయం చాలా అనుకూలమని, యోగశాస్త్రం చెబుతుంది. మన శరీరంలో, ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయని, యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో, సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి, ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందని చెబుతారు.

ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల, యోగా, ధ్యానం, చదువూ, చాలా తేలికగా, ప్రభావవంతంగా సాగుతాయి. ఉద్యోగం, స్కూలు, కాలేజీ, వంటావార్పూ వంటి రోజువారీ చేయాల్సిన విధులకు ముందు, తగిన సమయం కూడా చిక్కుతుంది. అలా కాకుండా, ఆలస్యంగా లేచి, ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల, మన మనస్సూ, శరీరం, విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.

గుండె జబ్బులున్నవారికి, తెల్లవారు జామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ, వైద్య గణాంకాలు సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య, ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి, ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు, వైద్యులు. పైగా, ఇదే సమయంలో, మనం హడావుడిగా లేచి, విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో, మనలోని రక్తపోటు మరింత ఎక్కువై, అది గుండెపోటుకు దారితీసే అవకాశాలు, ఎక్కువగా ఉంటాయి. అయితే, బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని, స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే, మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిన తరువాత కూడా, బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని వాదించేవారు మూర్ఖులే!

🚩 శ్రీ మాత్రే నమః 🙏

29 December, 2021

ఆత్మ సమర్పణ..! Bhagavadgita

 

ఆత్మ సమర్పణ..!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (25 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 25 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/fbmO2fBQxpI ]

శ్రీ కృష్ణుడు వివ‌రించిన‌ వివిధ రకాల యజ్ఞాల వివరణ..

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ।। 25 ।।

కొంతమంది యోగులు, భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ, దేవతలను పూజిస్తారు. మరికొంతమంది, పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ, సంపూర్ణంగా ఆరాధిస్తారు.

యజ్ఞ ప్రక్రియ అనేది, భగవత్ దృక్పథంలో, భగవంతునికి నివేదనగా చేయాలి. కానీ, కొంతమంది యజ్ఞాన్ని భిన్నమైన దృక్పథాలతో చేస్తుంటారు. జ్ఞానం లేనివారు, భౌతిక ప్రయోజనాల కోసం, దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు.

యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన కొంతమంది, వారినే భగవంతునికి సమర్పించుకుంటారు. దీనినే ఆత్మ-సమర్పణ, లేదా ఆత్మాహుతి, లేదా తమ ఆత్మను భగవదర్పితం చేయటం, అంటారు.

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।

మరికొందరు, శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను, ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు, శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను, ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.

అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని, అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో, అగ్ని అనేది, సంకేతాత్మకమైనది. ఆత్మ- నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, రెండు పూర్తి విరుద్ధమైన మార్గాలున్నాయి. మొదటిది, ఇంద్రియములను తిరస్కరించటం. ఈ పద్ధతిని, హఠ యోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర పోషణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలనూ, ఆపివేస్తారు. సంకల్ప బలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి , అంతర్ముఖంగా ఉంచుతారు. దీనికి వ్యతిరేకమైనది, భక్తి యోగాభ్యాసం. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి, వాడతారు.

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ।
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ।। 27 ।।

కొందరు, జ్ఞానముచే ప్రేరణ నొంది, తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ, మరియు తమ ప్రాణ శక్తిని కూడా, నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో, సమర్పిస్తారు.

హఠ యోగులు, ఇంద్రియములను సంకల్ప శక్తితో బలవంతంగా నిగ్రహిస్తే, జ్ఞానయోగులు, ఇదే లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన వివేకవంతమైన విచక్షణ అభ్యాసం ద్వారా, సాధిస్తారు. ఈ ప్రపంచం యొక్క మిథ్యా స్వభావం, ఈ శరీరమూ, మనస్సూ, బుద్ధీ, అహంకారం కన్నా వేరైన అస్థిత్వమని, తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమయి ఉంటారు. ఇంద్రియములు, బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించబడతాయి. మనస్సు, ఆత్మ యందు ధ్యానంలోనే, నిమగ్నం చేయబడుతుంది. ఆత్మ మరియు పరమాత్మ, అబేధమనే ప్రతిపాదనలో, ఆత్మ-జ్ఞానం యందే స్థితులై ఉండటమే, వారి లక్ష్యం. జ్ఞాన యోగ మార్గం చాలా కష్టమైనది. దీనికి చాలా నిష్ఠ, మరియు సుశిక్షితమైన బుద్ధి అవసరం.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ।। 28 ।।

కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు, కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ, వేద శాస్త్రాలని చదువుతూ, జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.

మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తిలో, ఆశయాలలో మరియు సంస్కారాలలో, వేరువేరుగా ఉంటారు. యజ్ఞములనేవి, కొన్ని వందల రకాలుగా ఉంటాయి. అవి భగవంతునికి అర్పించినప్పుడు, అంతఃకరణ శుద్ధికీ, ఆత్మోద్ధరణకీ ఉపయోగపడతాయి.

ద్రవ్య యజ్ఞం: కొందరు ధనం సంపాదించి, దానిని ధర్మ కార్యాల కోసం దానం చేయటం వైపు, మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా, తాము సంపాదించే ధనంతో, భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు.

యోగ యజ్ఞం: భారత తత్త్వశాస్త్రములో, యోగ దర్శనమనేది, ఆరు తత్వ సిద్ధాంతాలలో ఒకటి. ఆధ్యాత్మిక పురోగతి కోసం, శరీర ప్రక్రియలతో మొదలుపెట్టి, మనస్సుని జయించటం వరకూ, 'అష్టాంగ యోగము' అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై, దీనిని ఒక యజ్ఞం లాగా ఆచరిస్తారు.

జ్ఞాన యజ్ఞం: కొంతమంది మనుష్యులు, జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ, జ్ఞానాన్నీ మరియు భగవంతునిపై ప్రేమనీ పెంపొందించుకుంటారు.

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।।

అపరే నియతేహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।

మరికొందరు, లోనికి వచ్చే శ్వాస యందు, బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు, బయటకు వెళ్ళే శ్వాస యందు, లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ, లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. ఇటువంటి యజ్ఞం తెలిసినవారంతా, ఇటువంటి పరిక్రియల ద్వారా, తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు.

కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు. ప్రాణాయామం అంటే, "శ్వాస యొక్క నియంత్రణ" అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో, పూరకము అంటే, శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకునే ప్రక్రియ, రేచకము అంటే, ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ, అంతర కుంభకము అంటే, గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. ఈ సమయంలో, లోనికి వెళ్ళే శ్వాసలో బయటకు వచ్చే శ్వాస, తాత్కాలికంగా నిరోధించబడుతుంది.

బాహ్య కుంభకము -- ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. ఈ సమయంలో, బయటకు వెళ్ళే శ్వాసలో, లోనికి వచ్చే శ్వాస తాత్కాలికంగా నిరోధించబడుతుంది.

ఈ రెండు కుంభకములూ క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి, బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణలోనే, వీటిని అభ్యాసం చేయాలి. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికీ, మనస్సుని కేంద్రీకరించటానికీ, ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని, యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.

ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక బంధనాల చిక్కుముడిని ఖండించే జ్ఞానం గురించి, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!