Ads

20 November, 2020

తుంగభద్రా నది పుష్కరాలు! Tungabhadra Pushkaralu

 

ఈ రోజు నుంచి '20-11-2020' నుండి '01-12-2020' వరకు,

తుంగభద్రా నది పుష్కరాలు.. తప్పక చదివి తెలుసుకోండి..

మన దేశంలో ముఖ్యమైన నదులకు పుష్కరాల సంప్రదాయం అనేది, అనాదిగా వస్తున్నది. పుష్కరాల గురించి విక్రమార్క భేతాళుని కథలలో ఇలా ఉంది..

చెట్టుపై నున్న బేతాళుని బంధించి, భుజాన వేసుకుని, మౌనంగా నడవసాగాడు విక్రమార్కుడు.. విక్రమార్కుని భుజం పై ఉన్న శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు.. 'మహీపాలా! నీవు పట్టుదలకు మారు పేరు. అహింస, సత్యం, అస్తేయం, అసగం, అసంచయం, ఆస్తీక్యం, బ్రహ్మచర్యం, మౌనం, స్థైర్యం, క్షమ, అభయం, అనే నియమాలు తెలిసిన నీవు, నా సందేహం తీర్చాలి.. నాకు చాలా కాలంగా తెలియని ఒక విషయం నిన్ను అడుగుతున్నాను.. మానవాళికి పుణ్య ప్రదమైన పుష్కర స్నానం ఎలా వచ్చింది.. తెలియజేయి.. తెలిసి చెప్పక పోయావో, నీతల పగిలి మరణిస్తావు..

'బేతాళా! పుష్కర స్నానం అమోఘ ఫలం. నర్మదా నది తీరంలో తపస్సు, గంగానదిలో నిత్యం ప్రాత:కాల స్నానఫలం, గంగా యమున ల సంగమ స్ధలంలో, ప్రతిదినం పుణ్యస్నాన ఫలం, కురుక్షేత్ర ప్రాంతంలో దానం, వారణాశి (కాశి) మరణం వలన ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో, పుష్కర నదీ స్నానం కూడా, అదే ఫలితాలు ఇస్తుందని, శాస్త్రాలు చెపుతున్నాయి.. 

పుష్కరస్నానం వేకువన ఉత్తమమనీ, మద్యాహ్నవేళ మధ్యమం అనీ, సాయంకాలం వేళ అధమం అనీ అంటారు.. ఇంటి వద్ద స్నానం చేసాకే పుష్కర నది స్నానం చేయాలి.. నదిలో దిగేముందు..

'పిప్పలాద సముత్పన్నే కృత్య లోక భయంకరీ బేమృత్తికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ..!

అని చెప్పుకుని గట్టున ఉన్న మట్టినీ కొద్దిగా నదిలో మూడు సార్లు వేసి, పుష్కర స్నానం చేయాలి.. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదని పెద్దలు చెపుతారు.. ఈ శ్లోకం చెప్పుకునే సమయంలో మహిళలైతే 'మృత్తికాం' అన్నచోట 'హరిద్ర' అని పలకాలి.. వారు మట్టికి బదులు పసుపు కుంకుమ లు సమర్పించాలి.. దీని వెనుక ఒక కథ ఉంది..

పిప్పిలాదుడు అనే మహర్షి యాగంచేస్తుండగా యజ్ఞకుండం లోనుండి కృత్య అనే వాడు ఉద్బవించాడు.. వాడు పుట్టుక తోనే ఆకలి అంటూ దేవతలను కబళించ చూసాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై 'నిన్ను తలచుకుని నదీ స్నానం చేసేవారి పుణ్యఫలం తిందువులే' అని వరం ఇచ్చాడు..

పుష్కరుని పుట్టుక..

పూర్వం ముద్గలుడు అనే తపస్వి శివుని తన తపస్సు తో మెప్పించి తనని శివునిలో ఐక్యం చేసుకోమని, జల రూపంలో సకల ప్రాణులకు దాహార్తి తీరుస్తూ, వారి దుష్కర్మలను తీర్చేలా వరం కోరాడు.. అనుగ్రహించిన శివుడు అష్ట రూపాలలో ఒకటైన జల రూపంలో ముద్గలుని తనలో కలుపుకుని 'పుష్కరుడు' అనే పేరు పెట్టి, బ్రహ్మ దేవుని కమండలంలో నివాసం కలిగించాడు.. అహల్య పట్ల అనుచితంగా ప్రవర్తించి, గౌతమ ముని శాపం పొందిన ఇంద్రుడు బ్రహ్మను శరణు వేడగా, తన కమండలం లోని నీటితో అనుగ్రహించాడు.. అలా పుష్కరుని మహత్తు సర్వ లోకాలకూ తెలిసింది..

పుష్కరుని మహత్తు సమస్త సృష్టికి అందించాలని దేవతల గురువు 'బృహస్పతి' బ్రహ్మను వేడుకున్నాడు.. బృహస్పతి విన్నపాన్ని మన్నించిన బ్రహ్మ సకల శుభాలను కలిగించే ఈ పుష్కరాలు గురుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి వస్తుంటాయి..అలా ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం శార్వరి నామ సంవత్సరం లో క్రిష్ణానదికి ఉపనది అయిన పవిత్రమైన తుంగభద్రా నదికి పుష్కరాలు వచ్చాయి..

పుష్కర కాలం (పన్నెండు సంవత్సరాల) తర్వాత వచ్చే ఈ పుష్కరాలు, నవంబర్ 20వ తేదీ అంటే నేటి నుండి డిసెంబర్ 1వ తేదీ వరకూ జరగనున్నాయి..

తుంగభద్రమ్మ నడక ఇలా:

కర్నాటక ఎగువ భాగాన తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది.. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది.. నదీ తీరంలో కొలువు దీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది... 2008 లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి.. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది..

కౌతాళం, కొసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగళ్, గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతం ఉంది..

ప్రత్యేకత గల ఆలయాలు:

కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తాకి వస్తుంది.. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట, అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం, మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది.. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ, గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా అలంపూర్ జోగులాంబ దేవాలయం  చేరుకుంటుంది..

తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు... సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి..

శ్లోకం:

కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ

భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

తుంగభద్రా జలం స్వాదు, స్నిగ్ధం, ప్రోక్తం తధా గురు,

కండూ పిత్తా ప్రదం ప్రాయ: సాత్మం మేధాకరం మృతం..!

తుంగభద్ర నీరు తీయనిది.. కనుకనే, 'గంగా స్నానం, తుంగా పానం ' అన్నారు పెద్దలు.. దురదలు, పిత్తదోషాలు, రక్తస్రావాది దోషాలు తుంగభద్ర జలపానం వల్ల తగ్గుతాయట! ఒంటికీ మేధకూ కూడా హితమైన యీ జలాన్ని త్రాగే మహా పండితులూ, మహా కవులెందరో ఈ తీరంలో పుట్టారు.. విద్యారణ్యులు, ఏకంగా వేద భాష్యమే వ్రాశారిక్కడి జల పానం వల్ల, అంటే, అతిశయోక్తి కాదేమో..

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||

మంచిని చేద్దాం. మంచిగా ఉందాం. మంచిని పంచుదాం - పెంచుదాం. తరతరాలకూ మంచిని అందచేద్దాం.. 

నవ్య భారతాన్ని యువతరంతో తయారు చేయిద్దాం.. సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి, పాటించండి..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgyI51CER8fk02uhWHZ4AaABCQ

దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?

 


దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?

నిజమే! శపిస్తే పోతారు. కానీ, వారికి ఆ అధికారం లేదు కాబట్టి, శపించరు. ఎందుకు ఇలా? అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం ఈ విషయం తర్కించి చూద్దాం. కొన్ని ఉదాహరణలు తీసుకుని, ఈ తర్కం తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1UPRUEqFKdI ]

ముందుగా విశ్వామిత్రుడిని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మర్షి అయినాడు. ఆయన కోపం వలన, కామం వలన, ఎన్నో సార్లు తన తపః శక్తిని వృధా చేసుకుని, ప్రాయశ్చిత్తంగా, మరల కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి, పూర్వపు స్థితికి చేరుకోగలిగాడు. ఆయన క్రోధం వహించి, తాను చేస్తున్న యాగం సంపూర్ణం చెయ్యడానికి, ఆ రాక్షసులను ఒక్క హుంకారంతో చంపి వెయ్యగలడు.. కానీ, దాని వలన ఆయన చేస్తున్న యాగం, ఆ యాగసంకల్పం  సంపూర్ణం కాదని, ఆయనే స్వయంగా చెప్పారు.

ఆయనే తన వద్దనున్న బల-అతిబల విద్యలను, ఎన్నో దివ్యాస్త్రాలను సమంత్రకంగా రామునికి ఉపదేశించి, ఆయన నుండి రక్షణ కోరాడు. ఇందులో ఎన్నో దైవరహస్యాలు దాగి ఉన్నాయి.

1. పరమాత్ముడు శ్రీరాముని అవతారం తీసుకుని వస్తున్నారని ఆయనకు తెలుసు. ఆయనకు తన వద్దనున్న విద్యలన్నీ ధారబోసి, సర్వస్వ శరణాగతి కోరాడు
2. రామునికి విద్య నేర్పి దివ్యాస్త్రాలు ఇవ్వవలసిన గొప్ప బాధ్యతను ఆయనకు అప్పజెప్పారు. ఆయన తన కర్తవ్యం నిర్వర్తించారు. 
3. రావణుడు కేవలం మానవుల, వానరుల చేతిలో మరణించే అవకాశం మాత్రమే ఉంది. రావణుని అడ్డు పెట్టి, ధర్మవర్తన అందరికీ తెలుపవలసిన దివ్యనాటక రచనలో, ఆయన తన పాత్రను పోషించాలి.
4. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కూడా, అతడు చేస్తున్న దుందుడుకు కార్యాలకు చావమని శాపం ఇవ్వక, పడతి అనుమతి లేకుండా, వారిని మరోలా తాకితే, తల వెయ్యి ముక్కలు అయ్యే శాపం మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే, ఆయన పాత్ర కూడా, కేవలం అక్కడితో ఆగిపోతుంది. చెయ్యవలసిన కార్యం కోసం, రావణుడిని అడ్డుపెట్టుకుని, ఈ భూమి పై అడుగుపెట్టి, ధర్మాన్ని నిలుపవలసిన మహత్కార్యం ఉంది. 
5. ఆ మాటకు వస్తే, రావణుడు వాలి చేతిలోనూ, కార్తవీర్యార్జునుని చేతిలోనూ దారుణంగా నిహతుడు అయ్యే అవకాశం ఉన్నా, వారి పరిమితికి లోబడి, వారు కేవలం ఆ రాక్షసుని చెర మాత్రమే పట్టి, ఇతరుల ఆదేశం మేరకు వదిలేసారు.
6. ఒకవేళ రావణుడంతటి రాక్షసుని చంపవలసి వస్తే, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాల తపస్సు ధారబోసి, క్రోధం పూని, అతడిని చంపవచ్చు. కానీ, మరల ఆయనకు అంత ఆయుర్దాయం ఉండడం, అనుకున్న గొప్ప కార్యం నేరవేతుందన్న నమ్మకం ఉందా? కాబట్టి, మహర్షులు తమ క్రోధాన్ని అణగద్రొక్కుకుని, తమకూ, లోకానికీ, రక్షణ ఇచ్చే బాధ్యత ఉన్న ఆ ధరణీపతిని శరణు వేడి, ఆయన చేత రక్షణ పొందారు. 
7. అసలు విశ్వామిత్రునికి ఆ దివ్యాస్త్రాలు, పరబ్రహ్మ అనుమతి వలనా, ఆయన అనుగ్రహం వలనా వచ్చినవే. ఆయన ఇచ్చిన విద్యను ఆయనకే ఇచ్చి, నువ్వు తప్ప నాకు మరొక దిక్కులేదు, నన్ను బ్రోవుమా అనే గొప్ప శరణాగతి తత్త్వం, ఇందులో కనబడుతుంది.  ఎప్పుడూ 'నాదేమీ లేదు, నువ్వే దిక్కు' అని ఆయనను ఆశ్రయిస్తే, గజేంద్రమోక్ష వరదుడు, సంసార కూపం నుండి ఉద్ధరించి, ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాడు. 
8. ఎవరి పని వారు చెయ్యాలి. రక్షణ చెయ్యడం, క్షత్రియుని బాధ్యత. తపస్సు చేసి, అందరికీ మార్గదర్శనం చెయ్యడం, మహర్షుల కర్తవ్యం. వారికి అప్పజెప్పిన పనిని, అతిక్రమించరు వారు. 
9. ఎవరెవరి కర్మఫలం ఎలా వుందో, వారి విషయంలో, మహర్షులు మామూలుగా జోక్యం చేసుకోరు. ఎవరైతే, ఆ రాక్షసుల చేతిలో బాధలు అనుభవిస్తున్నారో, వారి కర్మఫలం అలా వున్నది. ఎప్పుడైతే వారందరూ స్వామికి శరణాగతి చేస్తారో, అప్పుడు వారిని కాపాడే బాధ్యత ఆయన తీసుకుని, వారిని రక్షిస్తాడు.

ఇంకా ఎన్నో దేవరహస్యాలు ముడిపడి ఉంటాయి. మనకు తార్కికంగా అర్ధం చేసుకోవడానికి ఈ కారణాలు చాలు. 

ఇలా మనం భారతంలోనూ, భాగవతంలోనూ చూస్తే, ఇటువంటి ఎన్నో తార్కాణాలు కనబడతాయి. అన్నింటికీ, పైన చెప్పుకున్న విషయాల కారణంగా, ఋషులు జోక్యం చేసుకోరు. ఒక్కోసారి మరీ అధర్మం పెచ్చరిల్లితే, వారికి అందిన ఆదేశం ప్రకారం, వారు అప్పుడప్పుడు దండిస్తూ ఉంటారు. ఒకసారి ఇక్ష్వాకు వంశంలో, వేనుడు అన్న వాడి ఆగడాలు మితిమీరిపోతే, వాడికి మంచి బుద్ధులు చెబుదామని వెళ్ళిన ఋషులూ, మునులను బంధించి, కేవలం తననే దైవంగా పూజించమని నిర్బంధించినప్పుడు, వారంతా చేసిన ఒక్క హుంకారానికి ఆ వేనుడు చావగా, అతడిని మధించి, వంశోద్ధారకుని పుట్టించారు. కానీ, ఇటువంటి ఉదాహరణలు చాలా తక్కువ. ఒకరి పాపం పండినప్పుడు, వారిని అంతం చెయ్యడానికి, దైవమే ఒక అవతారం తీసుకుని, భువికి వస్తారు. అప్పటివరకు, ఎవరి కర్మఫలాలనుబట్టి, అటువంటి నరకబాధలు ఎవరెవరు అనుభవించాలో, వారు వీరి బారిన పడి, బాధలు అనుభవిస్తూ ఉంటారు. 

ఈ ప్రపంచం అంతా, ఆ పరాత్పరుని నియమానికి లోబడి నడుస్తుంది. ఆయన ఆజ్ఞ లేనిదే, ఏదీ జరగదు. ఒకొక్కప్పుడు, దేవతలకు తమలో ఉన్న సత్త్వ గుణాన్ని తొక్కి, రజో, తమో గుణాలు ప్రకోపించినప్పుడు, వాటిని అదుపు చెయ్యడానికి, ఆ పరమాత్మ ప్రతినిధులైన ఆ మహర్షులు, వారిని శపించి, తగిన శాపవిమోచనం బోధించి, వారిని సరైన దారిలో పెడతారు. ఈ రాక్షసులు అలా శాపకారణంగా, వారిలో ఉన్న తమోగుణం పోగోట్టుకోకపోగా, మరింత పెచ్చరిల్లే అవకాశం ఉన్నందున, వారిని దునుమాడవలసిన అవసరం ఉన్నప్పుడు, ఆ పరమాత్ముడిని ఆశ్రయించక తప్పదు. కాబట్టి, వారు ఏం చేసినా, లోకకళ్యాణం కొరకేగనుక, వారికి అనుమతి ఉన్న కార్యాలు మాత్రమే చేస్తారు, ఆ మహర్షులు. వారి తపః ఫలితంగా, ఆ పరమాత్మ వారికి సశరీరంగా అనుగ్రహించి, వారిని భౌతికంగా రక్షించి, ఆధ్యాత్మికంగా వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. 

ఆ మాటకొస్తే, నేటికి కూడా, అంతటి గొప్ప మహర్షులు మన భారతదేశంలో ఉన్నారు. మన కంచి కామకోటి పీఠాధిపతులు, ఇలలో నడయాడిన పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి, సరైన దారిలో పెట్టారు తప్ప, శపించి వారి శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు. ఒక్కసారి మన భౌతిక స్థాయిని దాటి ధ్యానం చేస్తే, మన వాంగ్మయం మీద సంపూర్ణ నమ్మకంతో, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేస్తే, ఆ పరమాత్మే మనను అనుగ్రహించి ప్రచోదనం చేస్తారు.

ఓం నమో వేంకటేశాయ!

పరమ పవిత్రమైన 'స్కంద షష్ఠి' ఈ రోజే!

 

పరమ పవిత్రమైన 'స్కంద షష్ఠి' ఈ రోజే!

'స్కంద షష్టి' కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాం కానీ ఈ స్కంద షష్ఠి వేరు, 'సుబ్రహ్మణ్య షష్ఠి' వేరు అని గమనించాలి. ఆది దంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ 'స్కంద షష్టి'. అయితే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా, తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది. అంతే కాదు, ఏ మాసంలో అయినా, షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం, అత్యంత ఫలప్రదం.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.. 

తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.

ఈ తారకాసురుడు అమిత బలశాలి, తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత, మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి, ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ, వివాహం జరిపించిన, వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి, వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ, పార్వతీ పరమేశ్వర వివాహం సంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవిమ్పజేస్తాడు మహాశివుడు.

అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తెజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాశానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.

ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని, షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని, ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని, గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.

ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం, పార్వతీ దేవి శక్తి, మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.

ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన  బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.

తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.

స్కంద షష్ఠి పూజా విధానం :

స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు, పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు. 

పిండి దీపం అంటే వరి పిండి, బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి, నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని చరిత్ర, స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి, చిమ్మిలి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనాదేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.

బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.

ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార, పాలు, పెరుగు, పూలు, వెన్న, నెయ్యి, తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.

ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు, దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము. ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.

ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం!

ఓం శరవణభవ!

Link: https://www.youtube.com/post/Ugx-Cp3N5XLmdqFm2OR4AaABCQ