Ads

Showing posts with label తుంగభద్రా నది పుష్కరాలు!. Show all posts
Showing posts with label తుంగభద్రా నది పుష్కరాలు!. Show all posts

20 November, 2020

తుంగభద్రా నది పుష్కరాలు! Tungabhadra Pushkaralu

 

ఈ రోజు నుంచి '20-11-2020' నుండి '01-12-2020' వరకు,

తుంగభద్రా నది పుష్కరాలు.. తప్పక చదివి తెలుసుకోండి..

మన దేశంలో ముఖ్యమైన నదులకు పుష్కరాల సంప్రదాయం అనేది, అనాదిగా వస్తున్నది. పుష్కరాల గురించి విక్రమార్క భేతాళుని కథలలో ఇలా ఉంది..

చెట్టుపై నున్న బేతాళుని బంధించి, భుజాన వేసుకుని, మౌనంగా నడవసాగాడు విక్రమార్కుడు.. విక్రమార్కుని భుజం పై ఉన్న శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు.. 'మహీపాలా! నీవు పట్టుదలకు మారు పేరు. అహింస, సత్యం, అస్తేయం, అసగం, అసంచయం, ఆస్తీక్యం, బ్రహ్మచర్యం, మౌనం, స్థైర్యం, క్షమ, అభయం, అనే నియమాలు తెలిసిన నీవు, నా సందేహం తీర్చాలి.. నాకు చాలా కాలంగా తెలియని ఒక విషయం నిన్ను అడుగుతున్నాను.. మానవాళికి పుణ్య ప్రదమైన పుష్కర స్నానం ఎలా వచ్చింది.. తెలియజేయి.. తెలిసి చెప్పక పోయావో, నీతల పగిలి మరణిస్తావు..

'బేతాళా! పుష్కర స్నానం అమోఘ ఫలం. నర్మదా నది తీరంలో తపస్సు, గంగానదిలో నిత్యం ప్రాత:కాల స్నానఫలం, గంగా యమున ల సంగమ స్ధలంలో, ప్రతిదినం పుణ్యస్నాన ఫలం, కురుక్షేత్ర ప్రాంతంలో దానం, వారణాశి (కాశి) మరణం వలన ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో, పుష్కర నదీ స్నానం కూడా, అదే ఫలితాలు ఇస్తుందని, శాస్త్రాలు చెపుతున్నాయి.. 

పుష్కరస్నానం వేకువన ఉత్తమమనీ, మద్యాహ్నవేళ మధ్యమం అనీ, సాయంకాలం వేళ అధమం అనీ అంటారు.. ఇంటి వద్ద స్నానం చేసాకే పుష్కర నది స్నానం చేయాలి.. నదిలో దిగేముందు..

'పిప్పలాద సముత్పన్నే కృత్య లోక భయంకరీ బేమృత్తికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ..!

అని చెప్పుకుని గట్టున ఉన్న మట్టినీ కొద్దిగా నదిలో మూడు సార్లు వేసి, పుష్కర స్నానం చేయాలి.. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదని పెద్దలు చెపుతారు.. ఈ శ్లోకం చెప్పుకునే సమయంలో మహిళలైతే 'మృత్తికాం' అన్నచోట 'హరిద్ర' అని పలకాలి.. వారు మట్టికి బదులు పసుపు కుంకుమ లు సమర్పించాలి.. దీని వెనుక ఒక కథ ఉంది..

పిప్పిలాదుడు అనే మహర్షి యాగంచేస్తుండగా యజ్ఞకుండం లోనుండి కృత్య అనే వాడు ఉద్బవించాడు.. వాడు పుట్టుక తోనే ఆకలి అంటూ దేవతలను కబళించ చూసాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై 'నిన్ను తలచుకుని నదీ స్నానం చేసేవారి పుణ్యఫలం తిందువులే' అని వరం ఇచ్చాడు..

పుష్కరుని పుట్టుక..

పూర్వం ముద్గలుడు అనే తపస్వి శివుని తన తపస్సు తో మెప్పించి తనని శివునిలో ఐక్యం చేసుకోమని, జల రూపంలో సకల ప్రాణులకు దాహార్తి తీరుస్తూ, వారి దుష్కర్మలను తీర్చేలా వరం కోరాడు.. అనుగ్రహించిన శివుడు అష్ట రూపాలలో ఒకటైన జల రూపంలో ముద్గలుని తనలో కలుపుకుని 'పుష్కరుడు' అనే పేరు పెట్టి, బ్రహ్మ దేవుని కమండలంలో నివాసం కలిగించాడు.. అహల్య పట్ల అనుచితంగా ప్రవర్తించి, గౌతమ ముని శాపం పొందిన ఇంద్రుడు బ్రహ్మను శరణు వేడగా, తన కమండలం లోని నీటితో అనుగ్రహించాడు.. అలా పుష్కరుని మహత్తు సర్వ లోకాలకూ తెలిసింది..

పుష్కరుని మహత్తు సమస్త సృష్టికి అందించాలని దేవతల గురువు 'బృహస్పతి' బ్రహ్మను వేడుకున్నాడు.. బృహస్పతి విన్నపాన్ని మన్నించిన బ్రహ్మ సకల శుభాలను కలిగించే ఈ పుష్కరాలు గురుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి వస్తుంటాయి..అలా ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం శార్వరి నామ సంవత్సరం లో క్రిష్ణానదికి ఉపనది అయిన పవిత్రమైన తుంగభద్రా నదికి పుష్కరాలు వచ్చాయి..

పుష్కర కాలం (పన్నెండు సంవత్సరాల) తర్వాత వచ్చే ఈ పుష్కరాలు, నవంబర్ 20వ తేదీ అంటే నేటి నుండి డిసెంబర్ 1వ తేదీ వరకూ జరగనున్నాయి..

తుంగభద్రమ్మ నడక ఇలా:

కర్నాటక ఎగువ భాగాన తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది.. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది.. నదీ తీరంలో కొలువు దీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది... 2008 లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి.. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది..

కౌతాళం, కొసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగళ్, గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతం ఉంది..

ప్రత్యేకత గల ఆలయాలు:

కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తాకి వస్తుంది.. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట, అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం, మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది.. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ, గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా అలంపూర్ జోగులాంబ దేవాలయం  చేరుకుంటుంది..

తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు... సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి..

శ్లోకం:

కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ

భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

తుంగభద్రా జలం స్వాదు, స్నిగ్ధం, ప్రోక్తం తధా గురు,

కండూ పిత్తా ప్రదం ప్రాయ: సాత్మం మేధాకరం మృతం..!

తుంగభద్ర నీరు తీయనిది.. కనుకనే, 'గంగా స్నానం, తుంగా పానం ' అన్నారు పెద్దలు.. దురదలు, పిత్తదోషాలు, రక్తస్రావాది దోషాలు తుంగభద్ర జలపానం వల్ల తగ్గుతాయట! ఒంటికీ మేధకూ కూడా హితమైన యీ జలాన్ని త్రాగే మహా పండితులూ, మహా కవులెందరో ఈ తీరంలో పుట్టారు.. విద్యారణ్యులు, ఏకంగా వేద భాష్యమే వ్రాశారిక్కడి జల పానం వల్ల, అంటే, అతిశయోక్తి కాదేమో..

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||

మంచిని చేద్దాం. మంచిగా ఉందాం. మంచిని పంచుదాం - పెంచుదాం. తరతరాలకూ మంచిని అందచేద్దాం.. 

నవ్య భారతాన్ని యువతరంతో తయారు చేయిద్దాం.. సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి, పాటించండి..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgyI51CER8fk02uhWHZ4AaABCQ