Ads

16 November, 2020

కార్తీక పురాణం! (మొదటి అధ్యాయము - మొదటి రోజు పారాయణము)


కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిశారణ్య ములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.

ఒకనాడు శౌనికాది మునులు గురుతుల్యుడగు సుతునిగాంచి 'ఆర్యా! తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహాస్యములు సంగ్రహముగ గ్రహించినాము. కార్తీకమాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును వివరించవలసినది' అని కోరిరి. అంత నా సూతమహర్షి 'ఓ మునిపుంగవు లారా! ఒకప్పుడు యీదే కోరికను నారదుడు సృష్టి కర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి- విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సా౦బశివుడు పార్వతీదేవికి తెలియ చేసిన విదముగా నా గాథను వివరించెను.అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగుటయే గాక, యీహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రదగానాలకింపు'డని యిట్లు చెప్పెను.

పూర్వ మొకానొక దిన౦బున పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి 'ప్రాణేశ్వర సక లైశ్వర్యములు కలుగ చేయునట్టిది , సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు నాచరింపబడేడిది యగు వ్రతమును వివరింపు'డని కోరెను. అంతట మహేశుడు మందహాసమొనరించి 'దేవి! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు. చూడు, మా మిథిలా నగరమువైపు' అని మిథిలానగరపు దిశగా చూపించెను.

అట, మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి! మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. తమరిచటికేల వచ్చితిరో సెలవొసంగు' డని వేడుకొనెను. అందులకు వశిష్టుడు - జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము, నిన్నడిగి క్రతువు ప్రారంభి౦చమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని-అని పలుకగా జనకుడు 'మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవ త్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసివున్నది' యని ప్రార్ధి౦చెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి 'రాజ! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నాన౦ద దాయకమైనది. అ౦తియే గాక వినినంత మాత్రముననే యెట్టి నరక బాధలును లేక యీహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్దగా ఆలకింపు'మని యిట్లు చెప్పసాగెను .

వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట..

ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనాను యే వయసువాడైనను 'ఉచ్చ- నీచ' అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతపూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి 'ఓ దామోదర నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము' అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను.

కార్తికస్థానవిదానము.. 

ఓ రాజ! యీ వ్రత మాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయీ స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ, పరమేశ్వరునకు, బైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యపాదన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను. ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధ ము తీసి భగవంతునికి సమర్పించి తను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ,దేవాలయములో, లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి , స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధముగా వత్త్రమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారలు వ్రతము చేసిన వారిని జూచి, వారికి నమస్కరించినచొ, వారికి కూడా తత్సమాన ఫలముదక్కును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి మొదటి అధ్యాయము - మొదటి రోజు పారాయణము సమాప్తం..

Link: https://www.youtube.com/post/UgxzVxC2Xx9dkGzMlhZ4AaABCQ

15 November, 2020

కార్తీకం మాసంలో, ఏ తిథి రోజున ఏం చేయాలి?


దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం, అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని, మొట్టమొదట వశిష్ట మహర్షి, జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

'న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ |

నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః ||'

అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజూ పుణ్య ప్రదమే.  ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకుందాం.

కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకుని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు.

తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

చవితి: నాగుల చవితి సందర్భంగా, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

పంచమి: దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

షష్ఠి: ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే, సంతాన ప్రాప్తి కలుగుతుంది.

సప్తమి: ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే, ఆయుః వృద్ధి ప్రాప్తిస్తుంది.

అష్టమి: ఈ రోజున చేసే గోపూజ, మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

నవమి: నేటి నుంచి మూడు రోజుల పాటు, విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

దశమి: నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

ఏకాదశి: దీన్నే బోధనైకాదశి అంటారు. ఈ రోజున విష్ణుపూజ చేస్తే, సద్గతులు కలుగుతాయి.

ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

త్రయోదశి: సాలగ్రామ దానం చేస్తే, కష్టాలు దూరమవుతాయి.

చతుర్దశి: పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

కార్తీక బహుళ పాడ్యమి: ఆకు కూర దానం చేస్తే మంచిది.

విదియ: వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

తదియ: పండితులు, గురువులకు తులసి మాలను సమర్పిస్తే, తెలివి తేటలు పెరుగుతాయి.

చవితి: రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే, పీడకలలు పోతాయి.

పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

షష్ఠి: గ్రామ దేవతలకు పూజ చేయాలి.

సప్తమి: జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

అష్టమి: కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే, ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి: వెండి, లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే, పితృదేవతలు సంతోషిస్తారు.

దశమి: అన్నదానం చేస్తే విష్ణువు అనుగ్రహంతో కోరికలు తీరుతాయి.

ఏకాదశి: విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే, మంచి ఫలితాలుంటాయి.

ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

త్రయోదశి: ఈ రోజున నవగ్రహారాధన చేస్తే, గ్రహదోషాలు తొలగిపోతాయి.

చతుర్దశి: ఈ రోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

అమావాస్య : ఆంజనేయ స్వామి దర్శనం, పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే, పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.

కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి, బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుఝామునే లేచి, బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మ గీచి, పూజ చేయవచ్చు. పూజ సమయంలో..

'బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో, 

భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం'

అని ప్రార్ధించాలనీ, గోవర్ధనపూజ చేయాలనీ, ఆవులను అలంకరించి, స్వేచ్చగా తిరగనివ్వాలనీ, శక్తి కొలది దానం చెయాలనీ చెప్తారు.

ఇది బలచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు 'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి, తన సర్వస్వాన్నీ దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.

అప్పుడు బలిచక్రవర్తి 'దేవా! నా సర్వస్వాన్నీ నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై, అంతటా ఆక్రమించావు. కనుక, నీ మూడు అడుగులకు సంకేతంగా, ఆశ్వయుజబహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుధ్హపాడ్యమి (3 రోజులు).. భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో, నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో, వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి' అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.

బలిచక్రావర్తి కార్తీకశుద్ధపాడ్యమి నాడు, తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతని వెంట గదా ధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ, భక్త రక్షకుడైన భవంతుడూ, ఇద్దరూ వస్తారు కనుక, వీధులు శుభ్రంగా ఉండి, ప్రతి ఇంటి ముంగిటా దీపాలూ, మామిడి తోరణాలూ, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో, హాయిగా ఉన్నారని, బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల, దీపావళి మరుసటి రోజు, 'బలి పాడ్యమి' అయ్యింది.

మహిమాన్విత 'కార్తీక మాసం' ప్రారంభం!

 

తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది.

నకార్తీకే సమో మాసం, న కృతేన సమం యుగం |

నవేద సద్రసం శాస్త్రమ్‌, నతీర్థ గంగాయ సమం‌ ||

అని స్కంద పురుణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.

ధార్మక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రం వేళల లొ దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థాలు లేవని పురాణంలో పేర్కొన్నారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైన మాసం. శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషరగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.

అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చు అని అంటారు. పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.

శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో  మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.

కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.

మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది. ఈ మాసంలో ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.

కార్తీక దీపంలో రెండు వత్తులు కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.

అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజచేయడం, తులసి కళ్యాణం విశేషంగా చెపుతారు. మాఘేవా, మాధవేమాసిం కార్తీకేవా శుభేదినే అని సత్యనారయణ వ్రతకథలో ఉంటుంది.

మాఘమాసంలో గానీ, చైత్ర మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతము ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాణ స్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తక దామోదర స్వరూపమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమినాడు సత్యనారాయణ వ్రతం ఆచరిండం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.

వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు.

సర్వేజనా శుఖినోభవంతు.