దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం, అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని, మొట్టమొదట వశిష్ట మహర్షి, జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.
'న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః ||'
అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజూ పుణ్య ప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకుందాం.
కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకుని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి: నాగుల చవితి సందర్భంగా, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి: దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి: ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే, సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి: ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే, ఆయుః వృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి: ఈ రోజున చేసే గోపూజ, మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి: నేటి నుంచి మూడు రోజుల పాటు, విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి: నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి: దీన్నే బోధనైకాదశి అంటారు. ఈ రోజున విష్ణుపూజ చేస్తే, సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి: సాలగ్రామ దానం చేస్తే, కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి: పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
కార్తీక బహుళ పాడ్యమి: ఆకు కూర దానం చేస్తే మంచిది.
విదియ: వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ: పండితులు, గురువులకు తులసి మాలను సమర్పిస్తే, తెలివి తేటలు పెరుగుతాయి.
చవితి: రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే, పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి: గ్రామ దేవతలకు పూజ చేయాలి.
సప్తమి: జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి: కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే, ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి: వెండి, లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే, పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి: అన్నదానం చేస్తే విష్ణువు అనుగ్రహంతో కోరికలు తీరుతాయి.
ఏకాదశి: విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే, మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి: ఈ రోజున నవగ్రహారాధన చేస్తే, గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి: ఈ రోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : ఆంజనేయ స్వామి దర్శనం, పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే, పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.
కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి, బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుఝామునే లేచి, బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మ గీచి, పూజ చేయవచ్చు. పూజ సమయంలో..
'బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో,
భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం'
అని ప్రార్ధించాలనీ, గోవర్ధనపూజ చేయాలనీ, ఆవులను అలంకరించి, స్వేచ్చగా తిరగనివ్వాలనీ, శక్తి కొలది దానం చెయాలనీ చెప్తారు.
ఇది బలచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు 'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి, తన సర్వస్వాన్నీ దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.
అప్పుడు బలిచక్రవర్తి 'దేవా! నా సర్వస్వాన్నీ నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై, అంతటా ఆక్రమించావు. కనుక, నీ మూడు అడుగులకు సంకేతంగా, ఆశ్వయుజబహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుధ్హపాడ్యమి (3 రోజులు).. భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో, నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో, వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి' అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.
బలిచక్రావర్తి కార్తీకశుద్ధపాడ్యమి నాడు, తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతని వెంట గదా ధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ, భక్త రక్షకుడైన భవంతుడూ, ఇద్దరూ వస్తారు కనుక, వీధులు శుభ్రంగా ఉండి, ప్రతి ఇంటి ముంగిటా దీపాలూ, మామిడి తోరణాలూ, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో, హాయిగా ఉన్నారని, బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల, దీపావళి మరుసటి రోజు, 'బలి పాడ్యమి' అయ్యింది.