దశ మహావిద్యలంటే ఏంటి?
1. కాళీ, 2. తార, 3. త్రిపుర సుందరి, 4. ధూమావతి, 5. భువనేశ్వరి, 6. భైరవి, 7. ఛిన్నమస్త, 8. మాతంగి, 9. బగళాముఖి, 10. కమలాత్మిక..
అనేక దశాబ్దాల పాటు ఈ పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలనీ, అర్ధాలనీ, అంతరార్ధాలనీ, తెలుగు వారికి అందించిన వారు, చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి, అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక, నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని.
[ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని జీవిత విశేషాలు! = https://youtu.be/tzr-chRsu2g ]
వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారట, 'అమ్మా! ఈ రచన నీకు నచ్చినట్లయితే, నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే, ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను' అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై, ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి, ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి? అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలూ, విగ్రహాలు కూడా, అన్నీ సౌమ్యంగా ఉండవు. ఉదాహరణకి, కాళీ విగ్రహం ఎప్పుడూ, ముండ మాలతో, ఖడ్గంతో, భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే, తెనాలి రామలింగడికి విద్యనీ, ఐశ్వర్యాన్నీ ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి, కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది, ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే, ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్నా, కొట్టుకున్నా, ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి..
కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము..
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము..
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము..
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి..
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు. అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిన శక్తి. ఇది అర్ధం కావాలంటే, శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే, కేవలం మాట కాదు. శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం, ఆ తత్వపు మూల స్వరూపంలో, ఆద్యా శక్తులుగా ఉపాసించడమే, దశ మహా విద్యల స్వరూపం. అందుకే, వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది.
1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.
2వ మహావిద్య శ్రీతారాదేవి
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.
3వ మహా విద్య శ్రీషోడశీదేవి
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతి పాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.
4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి
దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.
6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి
దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.
7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి
దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.
8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి
దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.
10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
సాధరణంగా వీటిని ఉపాసించే వారు, వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి, అని కాకుండా.. అంటే లేకపోతే కాదని కాదు సుమా.. ఇంకొంచెం విభిన్నంగా, బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్ధం కావాలంటే, ఇంకో ఉదాహరణ, హిమాలయాల్లో ఉండే యోగులను చూస్తే, వాళ్ళు రోజూ ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంభలగా టిబెట్లో పిలవబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే, శంభల గ్రామం అని భవిష్యపురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో, యోగులు ఎలా ఉంటారు? అక్కడ 'పవిత్రత' తాలూకు నిర్వచనం ఏమిటి? వాళ్ళ భోజనపు అలవాట్లేమిటి? వస్త్రధారణ ఏమిటి? అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకి కనిపిస్తే, వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు? ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ, బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం, ఆవగింజంత కూడా అర్ధం కాదు.
వేల పర్వతాలకన్నా ఎక్కువ వేదాలు. అవి అర్ధం కావేమోనని, వాటి సారం ఉపనిషత్తులు. వాటి సారం అనుభవేక సారం కావాలని, ఉపాసనలు. ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు. అప్పటికీ అర్ధం కావేమోనని, భజనలూ, ప్రార్ధనలు. అవీ రావేమో నని, పండుగలూ, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు?
దృశ్యం సర్వమనాత్మా స్యాద్ దృగేవాత్మా వివేకినః
ఆత్మా నాత్మా వివేకోయం కధితో గ్రంధ కోఠిభిః
(ఆత్మా నాత్మ వివేకము - శ్రీ ఆది శంకరులు)
ఈ విశ్వంలో మనకి కనిపించే ఈ సమస్త పదార్ధాలూ, అనాత్మయే! అంటే, ఆత్మ కానివే. వీటిని చూసే వాడు మాత్రమే ఆత్మ. అంటే, బ్రహ్మ అని అర్ధం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు, యోగ శాస్త్రాన్ని (పతంజలి) అవలంబించి, ఆ దివ్యశక్తిని అనుభవేక వేద్యం కావించుకున్నారు. అలా కాక, నిరాకారము సర్వాకార స్వరూపంగనుక, ఆ శక్తి యోగులకీ, ద్రష్టలకూ, దేవతామూర్తిగా - గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినపుడు, ఆమె రూపాన్నీ, మంత్ర స్వరూపాన్నీ వారు మనకు అందించారు. అందుకే, మంత్ర జపం చేసే ముందు, కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్ధం, తమలో ఆ మంత్రాన్నీ, దాని తత్వాన్నీ విలీనం చేసుకోవడమే! మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా, తమ చేతులలో (కర్మ పరికరములు కరములు కనుక), వేళ్ళలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము.
ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః
భర్గో దేవశ్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః
ధియోయోనః జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః
Link: https://www.youtube.com/post/UgxeSY-TYynIUFGDO8l4AaABCQ