Ads

Showing posts with label Vikram Betal Stories in Telugu. Show all posts
Showing posts with label Vikram Betal Stories in Telugu. Show all posts

31 May, 2021

‘రూపసేన – వీరవరుడు’ ఎవరు గొప్ప? విక్రమార్క – బేతాళ కథలు! Vikram Betal Stories in Telugu

 

‘రూపసేన – వీరవరుడు’ ఎవరు గొప్ప? విక్రమార్క – బేతాళ కథలు!

బేతాళుడు, విక్రమాదిత్యుడికి చెప్పిన మొదటి కథ, రూపసేన - వీరవరుడు. పూర్వం సకల సౌభాగ్యాలతో వర్థిల్లిన నగరం, వర్థమానపురి. దానికి రాజు రూపసేనుడు. ఆయన భార్య పేరు విద్వన్మాల. ఈమె గొప్ప పతివ్రత. అయితే, ఒకనాడు రూపసేనుడు కొలువుదీరిన సభకు, వీరవరుడనే క్షత్రియుడు, తన భార్యా, కుమారుడూ, కుమార్తెలతో కలసి వచ్చాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తగిన పని కల్పించమని, రాజుని ప్రాధేయపడ్డాడు. వీరవరుడి మాటల్లో ఉన్న వినయం, నీతీ, నిజాయితీకి మెచ్చిన రూపసేనుడు, తన సింహద్వారానికి రక్షకుడిగా, అతడిని నియమించాడు. ఆ పనికి గానూ, రోజుకు వెయ్యి సువర్ణ నాణాలను ప్రకటించాడు. ఉద్యోగం కల్పించింనందుకు, రాజు రూపసేనుడికి కృతజ్ఞతలు తెలిపి, తన విధిని తాను నిర్వర్తించసాగాడు, వీరవరుడు. అయితే, కొద్దిరోజుల తరువాత, రూపసేనుడు చారుల్ని పిలిచి, తాను ఇచ్చే సువర్ణ నాణాలని వీరవరుడు ఎలా ఖర్చుచేస్తున్నాడో గమనించమని చెప్పి పంపాడు.

[ ఈ కథను దృశ్యరూపకంగా చూడడానికి 'LINK CLICK' చెయ్యండి: https://youtu.be/c1EdYMXruf8 ]

చారులు, వీరవరుడి ఖర్చులను గమనించి, రాజుకు సవివరంగా తెలియజేశారు. వారి మాటలు విన్న రూపసేనుడికి, చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే, వేయి నాణాలలో జీవితావసరాలకు సరిపడా మాత్రమే ఉంచుకుని, మిగిలిన వాటిని, యజ్ఞయాగాది క్రతువులకూ, శివ విష్ణు మందిరాలలో పూజలూ, కైంకర్యాలూ చేయడానికీ, బ్రాహ్మణులకీ, అనాథలకీ, దానధర్మాలు చేయడానికీ వినియోగిస్తూ, సాధారణ జీవితం గడుపుతున్నాడు, వీరవరుడు. ఈ విషయం తెలుసుకున్న రూపసేన మహారాజు, వీరవరుడికి శాశ్వత కొలువు ఇచ్చాడు. ఒక రోజు అర్థరాత్రి భయంకరంగా వాన కురిసింది. అంత:పురంలో నిద్రిస్తున్న రాజుకి, దగ్గరలో ఉన్న శ్మశానం నుంచి, ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం వినిపించింది. దాంతో టక్కున లేచిన రూపసేనుడు, సింహద్వారం దగ్గరకు వచ్చి, విధి నిర్వహణలో ఉన్న వీరవరుడితో, ‘శ్మశానంలో ఎవరో స్త్రీ ఏడుస్తోంది. ఎందుకో, ఏమిటో? కనుక్కుని రమ్మ’ని పంపాడు.

వెంటనే వీరవరుడు బయలుదేరాడు. అతనిని అనుసరిస్తూ, రూపసేన మహారాజు కూడా, వెంట వెళ్ళాడు. శ్మశానానికి చేరుకున్న వీరవరుడికి, ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. ఆమెను సమీపించి, 'అమ్మా, ఎవరునీవు? ఎందుకిలా ఏడుస్తున్నావు?' అని ప్రశ్నించాడు. అందుకామె, 'నాయనా, నేను ఈ రాజ్యానికి లక్ష్మిని. ఈ రాజ్య వైభోగానికీ, ప్రజల సుఖాలకీ, ఆనందానికీ కారకురాలిని. ఈ మాసం చివరిలో, రూపసేన మహారాజుకి మరణగండం ఉంది. ఆయన లేకపోతే, నేను అనాథనైపోతాను. అందుకే, బాధతో విలపిస్తున్నాను' అని సమాధానమిచ్చింది. రాజ్యలక్ష్మి మాటలు విన్న వీరవరుడు, ఆందోళన చెందాడు. ఆమెతో, 'అమ్మా! భూత భవిష్యత్తులు తెలిసిన దానివి. మా మహారాజు ధర్మాత్ముడు. ఆయనని కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే తెలియజేయమ్మా' అని కోరాడు. అందుకు సమాధానంగా రాజ్యలక్ష్మి, 'నాయనా, నీ మహారాజు పూర్ణాయూష్కుడిగా జీవించి ఉండాలంటే, ఒక ఉపాయం ఉంది. అది, నీ కుమారుణ్ణి చండీదేవికి బలివ్వడమే. అలా చేస్తే, రూపసేనుడికి దీర్ఘాయువు లభిస్తుంది' అని చెప్పింది.

అందుకు అంగీకరించిన వీరవరుడు, సరాసరి ఇంటికి వచ్చి, భార్యకూ, కుమారుడికీ, జరిగిన విషయమంతా చెప్పాడు. తమ మహారాజుకు ఆయుర్దాయం కలగడం కన్నా సంతోషం ఏముందని, భార్యా, కుమారుడూ, రాజ్యలక్ష్మి చెప్పిన మాటలకు అంగీకరించారు. వెంటనే అందరూ కలిసి, చండికా దేవి ఆలయానికి వెళ్లారు. అయితే, రూపసేనుడు వీరవరుడిని వెంబడిస్తూనే ఉన్నాడు. సకుటుంబంగా చండీ ఆలయానికి వెళ్లిన వీరవరుడు, ఆలయంలోని దేవిని స్తుతించి, ‘జగజ్జననీ! ఇదిగో నా పుత్రుడు. ఈతడిని నీకు బలిగా అర్పిస్తున్నాను. బలిని స్వీకరించి, మా మహారాజుకు దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించు' అని కోరుకుని, తన పుత్రుడిని బలి ఇచ్చాడు. కళ్లెదుట తన సోదరుడి మరణాన్ని చూసిన వీరవరుడి కుమార్తె, గుండె ఆగి మరణించింది. తమ సంతానం, కళ్ళ ముందే విగతజీవులై పడిపోవడంతో, కొంతసేపటికి వీరవరుడి భార్య కూడా, అసువులు బాసింది. ఇదంతా చూసిన వీరవరుడు, గుండె దిటవు చేసుకుని, దేవి దగ్గరకు వచ్చి, ‘తన తలను’ కూడా నరుక్కుని, అమ్మవారికి సమర్పించుకున్నాడు.

ఈ సంఘటనలన్నింటినీ చూసిన మహారాజు రూపసేనుడి మనస్సు, చలించిపోయింది. వెంటనే ఆలయంలోకి వచ్చి, 'జగన్మాతా! ఇంతటి విశ్వాసపాత్రుడు నా కోసం ప్రాణాలర్పించాడు. సకుటుంబంగా, వీరందరి ప్రాణదానంతో పెరిగే ఆయుర్దాయం నాకెందుకు? నన్ను కూడా నీవే బలితీసుకో' అని తన తలను ఖండించుకోబోయాడు. వెంటనే చండీ దేవి ప్రత్యక్షమై, 'నాయనా ఆగు! నీకు వీరి ప్రాణదానం వలన దీర్ఘాయువు లభించింది. మరో వరం ఏమైనా కోరుకో' అని అన్నది. అప్పుడు రూపసేనుడు, 'నా కోసం ప్రాణాలర్పించిన ఈ వీరవరుడి కుటుంబాన్ని తిరిగి బ్రతికించు. అంతేకాదు, ఈ కోరిక నేను కోరానన్న విషయం, అతడికి తెలియకూడదు' అని చెప్పాడు. రూపసేనుడి కోరకకు, "తథాస్తు" అని ఆశీర్వదించి, చండీ దేవి అంతర్ధానమైంది. మహారాజు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చండీ దేవి వరంతో, వీరవరుడి కుటుంబం నిద్ర నుండి లేచినట్లుగా, ప్రాణాలతో తిరిగి లేచారు. ఇదంతా చండీదేవి అనుగ్రహంగా భావించి, అమ్మకు నమస్కారం చేసి, కుటుంబాన్ని ఇంటి దగ్గర విడిచి, తిరిగి తన బాధ్యతల్ని నిర్వర్తించడానికి, సింహద్వారం దగ్గరకు వెళ్లిపోయాడు, వీరవరుడు.

మరునాడుదయం, మహారాజు, వీరవరుణ్ణి పిలిచి, రాత్రి రోదించిన స్త్రీ విషయం ఏమైంది, కనుకున్నావా? అని అడిగాడు. అందుకు వీరవరుడు, 'ప్రభూ, అక్కడకు వెళ్లి చూశాను. అక్కడ ఒక ప్రేతాత్మ ఏడుస్తూ ఉంది. నన్ను చూడగానే మాయమై పోయింది. వెంటనే నేను తిరిగి వచ్చేశాను. మీరేం కంగారుపడాల్సిన అవసరం లేదు మహారాజా' అని సావధానంగా సమాధానం చెప్పాడు. రూపసేనుడికి ఆశ్చర్యం కలిగింది. మహారాజునైన నాకోసం ప్రాణత్యాగం చేసి కూడా, ఆ విషయాన్ని ఏమాత్రం ప్రచారం చేసుకోకుండా, వినయంగా, విశ్వాసాన్ని ప్రకటించిన అతడి ప్రభుభక్తికి ఎంతగానో సంతోషించాడు. ఆనాటి నుండి, వీరవరుణ్ణి ఒక సేవకుడిగా కాక, ప్రియమిత్రుడిగా భావించాడు. కొద్దిరోజుల తరువాత, తన కోసం ప్రాణత్యాగం చేసి, తనకు దీర్ఘాయువునిచ్చిన వీరవరుడి కుమారుడికి, తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు, రూపసేన మహారాజు.

ఈ కథంతా వివరించి, బేతాళుడు విక్రమార్క చక్రవర్తిని ఒక ప్రశ్న వేశాడు. ఈ కథలో రూపసేనుడూ, వీరవరుడూ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేశారు కదా! వీరద్దరిలో ఎవరు చేసిన త్యాగం గొప్పది? అని అడిగాడు.

అందుకు విక్రమార్కుడు, ‘వీరద్దరూ ఆదర్శవంతమైన త్యాగాలే చేశారు. అయితే, రూపసేనుడు చేసిన ప్రాణత్యాగమే, వీరవరుడి ప్రాణత్యాగం కన్నా గొప్పది. ఎందుకంటే, వీరవరుడు రాజుకి సేవకుడు. సేవకుడి ధర్మం, రాజును రక్షించడం. ఆ ధర్మాన్ని అతడు త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాడు. వీరవరుడి త్యాగం గొప్పదే కానీ, రూపసేన మహారాజు చేయబోయిన ప్రాణత్యాగం, ఇంకా గొప్పది. మహారాజు, ఒక సేవకుడి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అయినా, ఆయన ఆ పని చేయబోయాడు. కాబట్టి, ఆ రాజు చేసిన త్యాగమే గొప్పది’ అని బదులిచ్చాడు విక్రమాదిత్యుడు.

మరో కథతో, మరో భాగంలో కలుద్దాము..

శ్రీ మాత్రే నమః!

Link: https://www.youtube.com/post/UgzmkLVH0anMu7CD_654AaABCQ