Ads

Showing posts with label Vighneshwari. Show all posts
Showing posts with label Vighneshwari. Show all posts

08 September, 2022

సౌభాగ్యాన్నిచ్చే విఘ్నేశ్వరి! Vighneshwari

 

సౌభాగ్యాన్నిచ్చే విఘ్నేశ్వరి!

గజముఖి, గణనాయకి, విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని, వినాయకి.. ఈ పేర్లను పొరపాటుగా అనడం లేదు! స్త్రీ రూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపూర్, భువనేశ్వర్ లలో స్త్రీలు సర్వ సంపదలనిమ్మని వినాయకి వ్రతం చేస్తుంటారు..

పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు. తనకంటూ నాయకుడు లేని, తానే లోక నాయకుడైన వినాయకుడు, సర్వ స్వతంత్రుడు. 106 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ, 8 రూపాలతో నిత్యపూజలందుకుంటున్నాడు. అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి. వినాయకుడు తన అంశయేననీ, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనంది ఆదిపరాశక్తి. అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మి గణపతి, గాయత్రీ గణపతిగా పూజిస్తున్నాం. ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలూ ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పార్వతీ మాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు, హంపిలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..' తరహాలో, తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి.

తల్లి మాట మేరకు తండ్రినెదిరించి ప్రాణాలు కోల్పోయాడు చిన్ని గణపతి. పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి, తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, భగళ, ఛిన్నమస్త, ధూమవతి, మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి, లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి. అంతే! ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు. తట్టుకోలేక విష్ణ్వాది దేవుళ్లందరూ పార్వతిని స్తుతించి, ప్రసన్నం చేసుకుని, ఏనుగు తలను తెచ్చ బాలునికి అతికించి, మళ్లీ బ్రతికించారు. అదీ స్త్రీ శక్తి, అదీ మాతృ శక్తి, పురుషులంతా కలిసినా, ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక, దాసోహమన్నారు. ఆ తల్లిని సంతోష పెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి, గణాధిపత్యాన్ని కట్టబెట్టాడు. తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుంది. అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి..

తల్లిదండ్రుల పదోదకము బోలంగ వే దాకాశ గంగా మహాజలంబు
మాతా పితలతో సమానత గనజాలరఖిల గీర్వాణ చూడాగ్రమణులు..

అంటూ, వారి విలువను లోకానికి తెలియచేశాడు. 'అమ్మ కడ సౌభాగ్యమడిగి మాకీయవా దేవాదిదేవా' అని స్త్రీలు వినాయకుని వేడుకుంటున్నారు. పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్నీ, సంపదనీ, విద్యనూ, మంత్ర విద్యనూ, జవసత్వాలనూ అందిస్తున్నాడు. గణపతి స్త్రీ పక్షపాతి. అందుకే స్త్రీ దేవతా మూర్తులతో కూడి, స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు.

వినాయకునిది పృధ్వీతత్త్వం. భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు. అందుకే గణపతిని మట్టిరూపంలో పూజించమని, అటు పంట ఫలం, ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది శాస్త్రం. వినాయకుడు పంచముఖుడు. పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచ మహాభూతాలూ, పంచ కోశాలూ, పంచ తన్మాత్రలే, ఆ పంచ ముఖాలు.

ఓంకార మాద్యం ప్రవదంతి సంతో వాచః శ్రుతీనామపి యం గృణంతి
గజాననం దేవ గణానతాంఘ్రి భజే హ మర్దేందు కృతావతంసం..

విఘ్నాలను కలిగించేదీ, తొలగించేదీ వినాయకుడే. త్రిమూర్తుల, త్రిమాతల, సకల దేవతల, అష్ట దిక్పాలకుల,నవగ్రహాల పూజలందుకునే ఆది పూజ్యుడు గణపతి..

ఓం మహాగణాధిపతయే నమః