నేటి నుండీ వసంత నవరాత్రులు ప్రారంభం! - 13/04/2021
చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి.. అంటే, ‘ఉగాది’ నుంచి, మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే, ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది. ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత, నవ పల్లవాలతో చిగిర్చి, పూల సోయగాలతో కనువిందులు చేస్తూ, సుగంథాల సేవలతో, ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే, గుణ రహితుడైన ఆ పరమాత్మకు కూడా ఇష్టమే. అందుకే, ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో, కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత?
[ 'ఉగాది పండుగ' వెనుక అసలు చరిత్ర! = https://youtu.be/PNwsSBE8SQc ]
ఈ వసంత ఋతువులోనే, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలూ, శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించిన వాడు శ్రీరాముడు. అందుకే, సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి, శ్రీరామనవమి వరకూ, ‘వసంత నవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే, తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి? పది రాత్రులు జరుపుకోకూడదా? ఏమిటీ లెక్క? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవ’ అంటే ‘తొమ్మిది’ అనీ, ‘కొత్త’ అనీ, రెండు అర్థాలు ఉన్నాయి. ‘కొత్త’ అంటే, అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి, 'ఆనందమయ నవరాత్రులు వచ్చాయి' అని అర్థం. ఇక తొమ్మి రాత్రులు ఎందుకు చేయాలంటే..
భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు..
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం |
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం ||
శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు, ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని, పరమాత్ముని సన్నిధి చేరుకున్నవారే..
నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని, అలా తొమ్మిది రోజులూ తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి, తరించడానికే.. ఈ నవరాత్రులను ఏర్పాటుజేశారు మన ఋషులు..
వసంత నవరాత్రి మహిమ:
ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ |
శరద్వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్ ||
సంవత్సర చక్రంలో, వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికటాట్టాహాసం చేస్తూ, ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యు ముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు, పరమేశ్వరిని సేవించి, ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై, సర్వ ఆపదల నివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు, ఆ యా ఋతువుల్లో రోగభాధలనూ, మృత్యుభయాన్నీ జయించగలుగుతారనీ, ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలనీ, వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.
సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి, నవమి వరకూ గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అనీ, అర్థ సంవత్సరం గడచిన తర్వాత, శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి, నవమి వరకూగల తొమ్మిది రోజులూ, శరన్నవరాత్రులు అనీ వ్యవహరింప బడతాయి. వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని, సాధకుల విశ్వాసం. 'శ్రీరామో లలితాంబికా' అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో, రామలీలా మహోత్సవాలు అనే పేరుతో, వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం, అనూచారంగా వస్తున్న ఆచారం.
మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికీ, తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికీ, ప్రశాంత స్థితిని అనుభవించడానికీ, నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని, వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని, సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాస మహర్షి..
నవరాత్రులకు ముందు రోజే, కుంకుమ, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలూ సిద్ధం చేసుకుని, మరునాడు (పాడ్యమినాడు) ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ 'సంకల్పం' చెప్పాలి. తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులూ దేవిని పూజింపదలచినట్లు, ఆమెకు విన్నవించు కోవడమే 'సంకల్పం'.
తొలినాడు ముందుగా గణపతి పూజ, తరువాత పుణ్యాహవాచనం, అనంతరం అష్టదిక్పాలక ఆవాహనంచేసి, పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి. విఘ్ననివారణ కోసం, గణపతిని ప్రార్థించడం, గణపతి పూజ. పూజ జరుగుతున్న ప్రదేశము, సమయము, పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు, పూజను తిలకించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ మనస్సు, పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం.
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgyC7PePkE7HkESux9B4AaABCQ