Ads

Showing posts with label Vamana Ekadashi. Show all posts
Showing posts with label Vamana Ekadashi. Show all posts

16 September, 2021

'రేపు పరివర్తన ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, వామన ఏకాదశి'! Vamana Ekadashi

  

'రేపు పరివర్తన ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, వామన ఏకాదశి'!

భాద్రపద శుక్ల ఏకాదశిని, 'పరివర్తన ఏకాదశి' అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశిని, మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబధించినదిగా పరిగణిస్తారు. కావున, ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చిందని అంటారు. ఈ రోజునే, శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి, మహా బలిని పాతాళ లోకానికి పంపించాడు. పరివర్తన ఏకాదశి రోజున, వామనావతరాన్ని పూజించడం వలన, బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లభిస్తుందని, మన పురాణాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే, వామన జయంతి.

[ ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? = https://youtu.be/Lcy2ZkxYfYY ]

ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన, తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయనీ, కోరిన కోరికలు ఫలిస్తాయనీ, నమ్మకం.

శ్రీ మహా విష్ణువు అది శేషుడి పైన శయనించి, (దక్షిణాయనంలో) విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. భాద్రపద శుక్ల ఏకాదశి నాడు, తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు. అందుకే ఈ ఏకాదశిని, పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే, 'మార్పు' అని కూడా అర్థం వస్తుంది. 

పూర్వం యుద్ధంలో, దైత్యరాజైన బలిచక్రవర్తి, ఇంద్రుని వలన పరాజయము పొంది, గురువైన శుక్రాచార్యుడిని శరణువేడాడు. కొంతకాలము గడిచిన తర్వాత, గురుకృప వలన, 'బలి' స్వర్గముపై అధికారము సంపాదించాడు. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు, అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితినిజూసిన అదితి దేవి దుఃఖించి, పయో వ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున ప్రత్యక్షమైన భగవానుడు అదితితో, 'దేవీ.. చింతించవద్దు.. నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్ముడిగా ఉండి, వానికి శుభము చేకూర్చెదను' అని పలికి అదృశ్యమయ్యాడు.

ఇలా అదితి గర్భమున భగవానుడు, వామన రూపమున జన్మించాడు. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడైన బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులూ, దేవతలూ ఎంతో ఆనందించారు. వామన మూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి, 'భృగుకచ్ఛమనే చోట' అశ్వమేధ యజ్ఞము చేస్తున్నాడని వామన భగవానుడు విని, అక్కడికి వెళ్లాడు. ఒక విధమైన రెల్లు గడ్డితో మొలత్రాడునూ, యజ్ఞోపవీతమునూ ధరించి, శరీరముపై మృగచర్మమునూ, శిరస్సున జడలనూ ధరించిన వామనుడు, బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు.

అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై, వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి, పూజించాడు. ఆ తర్వాత బలి, వామనుని ఏదైనా కోరమని అడుగగా, 'వామనుడు మూడు పాదముల భూమి'ని అడిగాడు. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము ఇవ్వ వద్దని బలిని ఎంత వారించినా, బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా, దానమివ్వడానికి సంకల్పము చేసేందుకు, జలపాత్రను ఎత్తాడు.

శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి, జలపాత్రలోకి ప్రవేశించి, జలము వచ్చే దారికి అడ్డుగా నిలిచాడు. కానీ, వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని, పాత్రలో నీరు వచ్చే దారిని చేధించాడు. దీంతో, శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. సంకల్పము పూర్తి అయిన వెంటనే, వామన భగవానుడు ఒక పాదముతో పృథ్వినీ, రెండవ పాదముతో స్వర్గలోకమునూ కొలిచాడు. మూడవ పాదమునకు, బలి తనకు తానే సమర్పితుడయ్యాడు.

ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, ఉపవాస దీక్షను చేపట్టి, జాగరణకు సిద్ధపడి, శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది.

'ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ.. పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ' అంటూ, అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆ స్వామిని యధాశక్తి పూజించడం వలన, అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయని, చెప్పబడుతోంది..

ఉపవాసము ప్రారంభము: 17-9-2021 శుక్రవారం మొదలుపెట్టవలెను. 

ద్వాదశ పారణము: 18-9-2021 శనివారం ఉదయం 5.51 నుండి 6.56 మధ్యలో ఉపవాసము విడువవలెను.

ద్వాదశ పారణము సమయము, కేవలం గంట వ్యవధి మాత్రమే ఉన్నదని గమనించగలరు..

హరినామ స్మరణం.. సమస్తపాప హరణం..!