మహీధర్స్ ప్లానేట్ లీఫ్ ని అభిమానించే వారందరికీ ఉగాది శుభాకాంక్షలు...
కాలగణనంలో ఒక శాస్త్రీయ పద్ధతిని ఏర్పరచుకున్న మన సంస్కృతి ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభమవ్వబోతోంది...
'ఉగం' అనేమాట 'జంట'ను సూచిస్తుంది. 'సంవత్సరం' అని ఈ పదానికి అర్థం. ఒక సంవత్సరంలో ఉండే ఉత్తరాయణ దక్షిణాయనాలను ఇది తెలియజేస్తుంది.
ఒక దినంలో పగలు, రాత్రి ఉన్నట్లే ఒక ఏడాదిలో ఉత్తరాయణ దక్షిణాయనాలున్నాయి. ఈ 'ఉగానికి' తొలిదినం ఉగాది.
అసలు-యుగానికి కూడా ఇదే తొలిరోజు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎక్కువగా మన తెలుగువారితోపాటు ఇతరులు, చాంద్రమానం ప్రకారం జరుపుకొనే సంవత్సరాది చైత్రశుద్ధ పాడ్యమి. ఇక్కడికి ఇంచుమించు సమీపంలోనే సౌరమానసంవత్సరాది కూడా జరుపుకుంటారు.
కాలంలో 'సంవత్సరం' ప్రధానం. ఒక ఋతుచక్రమే సంవత్సరం. దీని ఆకృతులే తరువాత వచ్చేవి. కనుక సంవత్సరాన్ని ప్రధానంగా గణించారు. కాలంలో జరిగే మార్పులు, వాటికనుగుణంగా ప్రకృతిలో సంభవించే గమనాలు... ఈ విభిన్నతలన్నీ దేనిలో సమగ్రంగా నివసిస్తాయో దానిని 'సంవత్సరం' అని నిర్వచించారు.
ఘటన, అనుభవం...ఇవన్నీ కాలాన్ని ఆధారం చేసుకొని నడుస్తాయి. అందుకే కాలాన్ని దైవశక్తిగా ఉపాసించడం మన సంప్రదాయం. కాలం అనుకూలించాలని అనుకోనివాడు ఉండడు కదా! అలా అనుకూలించేలా కాలంలోని అంతర్లీన దైవశక్తిని అనుసంచానించుకొనడమే ఈ ఉగాదుల వేడుకలు.
సంవత్సరం తిరిగే మలుపులో కాలపురషుని సంవత్సరావతారాన్ని స్మరించుకుంటాం. ఈ ప్రారంభ దినాన తిథి, వార, నక్షత్ర దేవతల్ని సంవత్సరంలో సంభవించే ప్రధాన ఖగోళ పరిణామాలనీ స్మరించుకొని ఆరాధిస్తాం.
ఒక మహాగ్నిలో ప్రతికణం కూడా పూర్ణ అగ్ని శక్తిని దాచుకొని ఉంటుంది.అలాగే అనంతకాలంలో ప్రతిక్షణంలోనూ కాలశక్తి నిక్షిప్తమై ఉంటుంది.
తిథి, హోర, నక్షత్ర, వార...మొదలైనవన్నీ దేవతా స్వరూపాలుగా సంభావించి నిత్యం సంకల్పంలో వాటిని తలంచుకొనడం కాలదేవతా శక్తిని ఆరాధించడమే.
ఈ భావన వల్లనే ఈ వత్సరాది ప్రాతర్వేళ శుచిగా శుభంగా భగవదారాధన చేసి వ్యక్తికీ, సమాజానికీ కాలస్వరూపుడైన దేవాధిదేవుని అనుగ్రహం లభించాలని ఆశిస్తూ అర్చనలు చేస్తాం.
శుచియైన శరీరంతో, శుభ్రమైన గృహంలో, మంగళకర వాతావణంలో - ఈకాలమ్ అందరికీ అనుకూలించాలని - పంచాంగ శ్రవణాదులను ఆచరించడం ఎంతో చక్కని పద్ధతి.
ఈ మంగళకర విధానంలో జరుపుకొనే వేడుక మన పర్వదినాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకత.
శుచిస్వరూపులైన దేవతాశక్తులు స్పందించాలంటే శుచిగలిగిన వాతావరణంలో, శుభస్వభావంతో చేసే భావనలే శుభాకాంక్షలై నిశ్చింతగా, సత్ఫలాలనిస్తాయి. మన శుభాకాంక్షలకు ఏర్పరచిన పవిత్ర నేపథ్యమిది. ఖగోళంలోని గ్రహాదుల ప్రసరణల ప్రభావం పృథివిపై ఉన్నా, ప్రధాన ప్రాణశక్తి మాత్రం సూర్యుని నుంచి పొందుతున్నాం. అందుకే ఈ అరవై సంవత్సరాల పేర్లన్నీ సూర్యశక్తి విశేషాలే.
ఈ ఉగాది ప్రారంభవేళ కాలంలో ఉన్న విభిన్నతల సమన్వయాన్నీ, షడ్రుతువుల సౌందర్యాన్ని షడృచుల నైవేద్యంగా కాల భగవంతునికి సమర్పించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం... కాలంలో మనం చవిచూసిన అనుభవాలు ప్రసాదాలుగా (ప్రసన్నతలుగా) పరిణమించాలనే ఆకాంక్ష దాగి ఉంది.
వసంతంతో వత్సరాన్ని ప్రారంభించడం, 'చిగురింత'తో కాలపు తొలిజాడను గుర్తించడం... ఎంత ఔచిత్యం! రాలిన పండుటాకులిచ్చిన అవకాశంలోంచే, కొత్త తలిరాకులు తలలెత్తుతాయి. అదే మన తొలి పండుగలోని కొత్త ఆశలకు ఆహ్వాన గీతికగా శుభాకాంక్షలు పలికిస్తుంది.
సంవత్సరం మార్పు ప్రకృతిలోనే గోచరించే శాస్త్రీయత ఈ పండుగలో ఉంది. మరోవైపు -శ్రీరామ నవరాత్రులకు, వసంత నవరాత్రులకు ఇది తొలిదినం. అంటే మనకొత్త సంవత్సరం శ్రీరామునితో ప్రారంభమౌతుందన్నమాట.
భారతీయులకు రాముడు, రామాయణం ప్రాణతుల్యం. భారతీయతకు శ్రీరాముడే ప్రతీక. ఆ రామారాధనతో ప్రారంభమవుతుంది మన కొత్త సంవత్సరం. కాలస్వరూపుడైన నారాయణుడే రాముడై ధర్మాన్ని ప్రతిష్టించి, అధర్మాన్ని శిక్షించాడు. అలాగే ఈ కాలం అద్భుతమైన ధర్మపాలనకు ఆలవాలం కావాలని, మంచికి అనుకూలంగా పరిణమించాలని, ప్రతి సంవత్సరం సార్థక నామంతో కష్టాల కడలి నుంచి మనలను దాటించాలని (తరింపజేయాలని) శుభాకాంక్షలను పలుకుతూ, సత్సంకల్పాలతో కాల విష్ణువును ప్రార్థిద్దాం.