Ads

Showing posts with label The Festival of Colors. Show all posts
Showing posts with label The Festival of Colors. Show all posts

25 March, 2021

నల్లనయ్య ఆడిన రంగుల కేళి 'హోళీ' విశిష్ఠత! Historical facts about Holi – The Festival of Colors

 

నల్లనయ్య ఆడిన రంగుల కేళి 'హోళీ' విశిష్ఠత!

చిన్నా పెద్దా, పేద ధనికా, అనే తేడా లేకుండా, అంతా కలిసి, "రంగేళీ హోళీ.. హంగామా కేళీ" అంటూ, అత్యంత ఆనంద సంబరాల మధ్య జరుపుకునే పండుగ, హోళి. ఆది కాలం నుంచీ, ఈ రంగుల పండుగను అఖండ భారతావని మొత్తం, ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటోంది. ప్రపంచ దేశాలలో, ఏ పండుగకూ లేనంత విశిష్ఠతా, ప్రాముఖ్యతా, హోళీకి ఉండడంతో, నేడు పాశ్చాత్యులు సైతం, పెద్ద ఎత్తున ఈ పండుగను వేడుకలా జరుపుకుంటున్నారు. మన భారత దేశంలో పుట్టి, నేడు ప్రపంచ మొత్తం ఆచరించే స్థాయికి చేరుకున్న హోళీ పండుగను, ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుకవున్న చారిత్రక గాథలేంటి? ఏ ఏ ప్రాంతాల వారు, ఎన్ని విధాలుగా జరుపుకుంటారు? హోళీ పర్వదినాన ఏం చేస్తే మంచిది? ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే విషయాల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/X7RDDA-ApRw ]

హోళీ పండుగ జరుపుకోవడం వెనుక, కొన్ని పురాణ గాధలు, అనాదిగా ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం దక్షయజ్ఞ సమయంలో, అగ్నికి ఆహుతైన సతీ దేవి, మళ్లీ హిమవంతుని కూతురిగా జన్మించగా, ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. ఆమె చిన్నతనం నుంచీ, సదాశివునికి ధర్మపత్ని కావాలనే ఆశతో, సదా ఆయన్నే పూజిస్తూ ఉండేది. అయితే, పరమేశ్వరుడు మాత్రం, సతీ వియోగంతో ధ్యాన సమాధిలోకి వెళ్లి పోయాడు.

భగ్న హృదయంతో ఉన్న శివునికి, ఆయనే సర్వస్వంగా బ్రతికే పార్వతినిచ్చి పెళ్లి జరిపించాలని, సకల దేవతలూ తలిచి, ఈ మహత్తర కార్యానికి మన్మధుడిని నియమించారు. అప్పుడు, పార్వతీ దేవి పరమేశ్వరునికి సపర్యలు చేయు సమయాన్ని తగు సమయంగా ఎంచుకుని, మన్మధుడు, పరమేశ్వరునిపై పూలబాణం వేశాడు. దాంతో, ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని మనస్సు కామవికారాలకు లోనవ్వడంతో, ఆయన ధ్యానానికి భంగం వాటిల్లింది. ఈ ఆటంకానికి కోపోద్రిక్తుడైన రుద్రుడు, ఆ పనికి కారణమైన మన్మధుడిని, తన మూడవ కన్ను తెరచి, భస్మం చేశాడు. అనంతరం, మన్మధుని భార్య అయిన రతీ దేవి, తనకి మాంగళ్యభిక్ష పెట్టమని ఆ పరమేశ్వరుని వేడుకోగా, అందుకాయన, మన్మధుడు నిరాకారుడిగా సజీవుడై ఉండేటట్లు, అనుగ్రహించాడు. ఆ సంఘటన జరిగిన రోజు, ఫాల్గుణ పూర్ణిమ కావున, దీనిని కాముని పున్నమిగా ఆచరిస్తారు. దక్షిణ భారత దేశంలో, ఆ ముందు రోజు రాత్రి భారీ మంటలుపెట్టి, దానిని కామదహనంగా జరుపుకుంటారు.

మరో గాథ ఆధారంగా, పూర్వం హిరణ్యకశిపుడనే అసుర రాజు, ఎన్నో ఏళ్లు ఘోర తపస్సు చేసి, బ్రహ్మచే, తనకు రాత్రిగానీ పగలుకానీ, ఇంటి లోపలకానీ బయటకానీ, భూమ్మీదగానీ అకాశంలోగానీ, దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషాదులచే కానీ, మానవులూ లేదా జంతువుల వల్ల కానీ, మరణం కలుగకూడదనే వరం పొందాడు. ఈ వర ప్రభావంతో, ముల్లోకాలనూ తన హస్తగతం చేసుకోవడమే కాకుండా, తనని తప్ప వేరే దేవుణ్ణి, ముఖ్యంగా విష్ణువుని కొలవరాదని, అజ్ఞాపించాడు. అయితే, హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదుడు, విష్ణువే భగవంతుడనీ, తాను ఆయన్ని తప్ప వేరొకరిని పూజించననీ, భీష్మించుకు కూర్చున్నాడు. పుత్రుడి స్వభావాన్ని వ్యతిరేకించిన హిరణ్యకశిపుడు, ముందు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా, అది ఫలించక పోవడంతో, ప్రహ్లాదుడిని పలు విధాలుగా చంపించడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ నారాయణుడి కరుణా, కృపా కటాక్షాలతో, ప్రతీసారి ప్రహ్లాదుడు చిన్న గాయం కూడా లేకుండా, ఆ ప్రమాదాల నుండి బయటపడేవాడు.

ఆ క్రమంలో ఒకసారి, హిరణ్యకశిపుడి చెల్లెలయిన హోళిక, తన చేతిలో కూర్చోమని చెప్పి, వారి చుట్టు భయంకరమైన అగ్నిని వెలిగించి, హోళికకి ఏమీ కాకుండా, కేవలం ప్రహ్లాదుడు మాత్రమే కాలి చనిపోయేలా, ఆమెపై, ఆమెను అగ్ని నుంచి రక్షించే వస్త్రం కప్పారు. అయితే, మంటలు మొదలవ్వగానే, హోళిక కప్పుకున్న వస్త్రం ఎగిరి ప్రహ్లాదుడిని చుట్టుకోవడంతో, అతడు సురక్షితంగా ఆ మంటల నుంచి బయటపడగా, హోళిక ఆ మంటలకు కాలి బూడిదయ్యింది. ఈ విధంగా హోళీ అనే పండుగ వచ్చిందని అంటారు. అందుకే, ఉత్తరాదిన హోళీ ముందు రోజు రాత్రి, పెద్ద పెద్ద మంటలు వేసి, చెడుపై మంచి విజయానికి గుర్తుగా, ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంఘటన తరువాత, శ్రీ మహా విష్ణువు నరసింహావతారమెత్తడం, హిరణ్యకశిపుడిని తన ఒడిలో పెట్టుకుని, తాను గుమ్మం మధ్యన కూర్చుని అతడిని సంహరించడం అనే వృత్తాంతం, అందరికీ విదితమే.

ఇక ద్వాపర యుగంలో చిన్ని కృష్ణయ్య తిరుగాడిన మధురలో, మొదటిసారి రంగులను వాడినట్లు, ఒక గాథ ద్వారా తెలుస్తోంది. కృష్ణుడి నల్లని శరీరాన్ని చూసి రాధ వెక్కిరించిందని, ఆ గోపన్న, తల్లి యశోదమ్మకు ఫిర్యాదు చేయగా, ఆమె చిన్ని కృష్ణుడి చేతికి రంగులిచ్చి, వాటిని రాధకు పూయమని చెప్పింది. కానీ, అల్లరి కృష్ణయ్య ఒక్క రాధనే కాకుండా, గోకులంలోని గోపికలందరినీ రంగుల్లో ముంచెత్తాడు. అప్పటి నుండీ మధుర, బృందావనాల్లో, ఈ పండుగను వసంతోత్సవంగా, హోళీగా, 16 రోజుల పాటు ఘనంగా జరుపుకున్నారు. ఇంతటి విశిష్ఠత గల హోళీ పండుగ, నేడు ప్రపంచం మొత్తం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోగా, ఈ పండుగను వివిధ ప్రాంతాల ప్రజలు, వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు.

ఉదాహరణకు, ఉత్తర ప్రదేశ్ లోని బర్సానా అనే ఊరిలో, హోళీ పండుగ రోజు, స్త్రీలందరూ కర్రలు చేత బూని ఉంటే, పురుషులంతా డాలు పట్టుకుని, స్త్రీలపై పాటలు పాడి, వారిని రెచ్చగొడతారు. దాంతో, ఆ స్త్రీలంతా కర్రలతో పురుషులను వెంబడిస్తారు. ఆ తరువాత అందరూ, సరదాగా రంగులుజల్లుకుంటారు. ఇక రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లోని గిరిపుత్రులు, హోళీ ముందు రోజు కామదహనం చేసి, ఆ మంట చుట్టూ తిరుగుతూ, బిగ్గరగా ఏడుస్తారు. అలా చేస్తే, తమ నుంచి చెడు దూరమై, ఇక అంతా శుభమే కలుగుతుందని వారి విశ్వాసం. 

బెంగాల్ లో హోళీని "బసంత్ ఉత్సవ్" పేరిట జరుపుకుంటారు. ఆకులురాలి మోడుగా మారిన చెట్లన్నీ, రంగుపువ్వులతో సరికొత్తగా కనిపించే కాలమే, వసంతం. అందుకే, వసంతాన్ని ఆహ్వానిస్తూ, ఈ వేడుకను వారు జరుపుకుంటారు. అయితే, బెంగాలీలు, రంగులు చల్లుకోరు. దానికి బదులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, బసంత్ ఉత్సవ్ ని జరుపుకుంటారు. ఈ పండుగ రోజు, రాధాకృష్ణుడి ప్రతిమలను ఉయ్యాలలో కూర్చోబెట్టి, వీధులలో ఊరేగిస్తూ, భక్తి పాటలు పాడుతూ, నాట్యం చేస్తారు. దీనిని వారు "డోల్ యాత్ర" అని పిలుస్తారు.

ఇక పంజాబీ వారు, ఈ రంగుల పండుగని "హోలా మొహల్లా" గా జరుపుకుంటారు. ఈ విధంగా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ప్రక్క దేశాలతో పాటు, భారతీయులు ఎక్కువగా ఉండే అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి అనేక దేశాలలో, హోళీ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఆ ప్రాంతాలలో, మన దేశం వారే కాకుండా, విదేశీయులు కూడా ఈ హోళీ సంబరాల్లో చాలా చురుకుగా పాల్గోంటారు.

ఇక హోళీ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవడానికి, పూలూ, పండ్లూ, కూరగాయలూ, ఆకుకూరలూ వంటి వాటితో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే వాడాలి. వీటిని ఉపయోగించడం వలన, మనకు ఎటువంటి హానీ జరుగకపోగా, మన చర్మానికి ఎంతో మంచి చేస్తాయి. అలా కాకుండా, నేడు మార్కెట్ లో రసాయనాలతో తయారు చేసిన రంగులను వాడడం వలన, అనేక రకాలైన చర్మవ్యాధులు రావడంతో పాటు, ఆ రసాయనాలు కళ్లలో పడి, అంధులుగా మారే ప్రమాదముంది. అందువల్ల, అందరూ స్వచ్ఛందంగా, రసాయనాలతో తయారుచేసే రంగులను నిషేధించి, సహజసిద్ధంగా తయారైన రంగులనే వాడండి.

హోళీ జరుపుకునే ముందు, అందరూ ఒంటికి నూనె రాసుకోవడం వల్ల, మనకి అంటుకున్న రంగులు త్వరగా తొలగిపోతాయి. హోళీ ఆడిన తరువాత, ఎట్టి పరిస్థితులలోనూ వేడి నీటి స్నానం చేయకూడదు. కేవలం చల్లటి నీటినే స్నానానికి వాడాలి. ఎందుకంటే, వేడినీటి వల్ల రంగులు తొందరగా వదలకపోగా, అవి మరింతగా మన చర్మంలోకి చొచ్చుకుపోతాయి. మీరు వాడిన రంగులు రసాయనాలతో తయారు చేసినవైతే, చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువ. మరి అందరూ సహజ రంగులను ఉపయోగించి, Social Distancing పాటిస్తూ, ఆనందంగా హోళీ పండుగను జరుపుకుందాం. Have a safe and Happy Holi.

Link: https://www.youtube.com/post/Ugwu1y5FReV-9BVzxoB4AaABCQ