ఉదంక మేఘాలంటే ఏంటి? కోపంతో శ్రీ కృష్ణుడిని శపించబోయిన మహర్షి ఎవరు?
మన పురాణ ఇతిహాసాలలో ఎందరో మహర్షులు లోక కల్యాణార్థం, ఎన్నో త్యాగాలు చేశారు. త్రిమూర్తులను సైతం తమ తపో బలంతో వణికించిన బ్రహ్మర్షులెందరో ఉన్నారు. అటువంటి మహా తపో ధనులలో ఒకరు, కోపంతో శ్రీ కృష్ణ భగవానుడిని శపించడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఆయనకు, శ్రీ కృష్ణ భగవానుడిచ్చిన వరాలేంటి? దేవేంద్రుడిచ్చిన అమృతాన్ని ఆయన ఎలా చేజార్చుకున్నాడు - వంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9pgoEziMXEg ]
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత, అర్జునుడికి జ్ఞాన బోధ చేసి, తన తల్లి దండ్రులను చూసి చాలా కాలం కావడంతో, శ్రీ కృష్ణుడు ద్వారకకు పయనమయ్యాడు. రథము ముందుకు పోతుందే కానీ, శ్రీకృష్ణుడి మనసు మాత్రము, అర్జునుడి మీద నుండి మరల లేదు. రథము ముందుకు పోతుంటే, శ్రీకృష్ణుడు, అర్జునుడు కనిపించినంత సేపు, వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడూ, సాత్యకీ ఒక రథము మీద ఉంటే, సుభద్ర వేరొక రథము మీద ప్రయాణం చేస్తోంది. అలా ద్వారకకు వెళుతున్న శ్రీకృష్ణుడు, ఉదంకుడి ఆశ్రమము చూసి, అయన వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు శ్రీకృష్ణుడిని చూసి, "కృష్ణా! పాండవులూ, కౌరవుల నడుమ సయోధ్యను కుదిర్చావా? కౌరవులూ, పాండవులూ, ఎవరి రాజ్యములు వారు పాలిస్తూ, క్షేమంగా ఉన్నారా?" అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు. శ్రీకృష్ణుడు కూడా ఏమీ ఎరుగని వాడిలా, "మహర్షీ! నేను కురు పాండవుల సంధి ప్రయత్నం చేస్తూ, వారితో అనేక విధముల వాదించి, నయానా భయానా చెప్పాను. కొంచెం గద్దించి కూడా చెప్పాను. నాతోచేరి మహర్షులూ, మునులూ, భీష్ముడూ, ద్రోణుడి వంటి వారు కూడా, సంధి చేసుకోవడమే మేలని, పలు విధముల చెప్పజూశారు. అయినా, సుయోధనుడూ, అతడి తమ్ములూ, పెడచెవిన పెట్టారు. కురుపాండవులకు జరిగిన యుద్ధములో, కౌరవులు సమూలంగా నాశనమయ్యారు. పాండవులు ఐదుగురు తప్ప, ఇరువర్గాలలో ఎవరూ మిగల లేదు. కాల నిర్ణయమును ఎవరు తప్పించగలరు?" అని అన్నాడు.
ఆ మాటలకు ఉదంకుడు కోపంతో ఊగిపోతూ, "కృష్ణా! దీనికంతటికీ నువ్వే కారణం. నువ్వు తలచుకుంటే, సంధి కుదిరేది. నీకు శక్తి ఉండి కూడా ప్రయత్నించక, నీ మోసంతో కౌరవులను సమూలంగా నాశనం చేశావు. ఇంత ఘోరము, నీ వలననే జరిగింది కనుక, నేను నిన్ను శపిస్తున్నాను" అంటూ ఆవేశంతో పలికాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు, ‘మహర్షీ! నేను చెప్పబోవు మాటలు విని, తరువాత మీ ఇష్టం వచ్చిన విధముగా చెయ్యండి. మీ వంటి తపోధనులకు కోపము తగదు. కనుక శాంతము వహించి, ప్రశాంత చిత్తముతో నేను చెప్పేది వినండి. ముందు నేనెవరో తెలియజెబుతాను. సత్వ రజో తమో గుణములు నా యందే ఉండి, నా ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. మరుత్తులూ, వసువులూ మొదలైన దేవతాగణములన్నీ, నా యందే ఉద్భవించాయి. ఈ విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను. ఈ సృష్టి అంతా, నా యందే వ్యాపించి ఉన్నది. పర, అపర తత్వములు నేనే. ఓంకారమూ, వేదములూ, నాలుగు వర్ణములూ, నాలుగు విధములైన ఆశ్రమాలూ, వాటికి సంబంధించిన సమస్త కర్మలూ, స్వర్గమూ, మోక్షమూ, అన్నీ నేనే, నా రూపాలే. యజ్ఞయాగాదులలో నన్ను స్తుతించి, యజ్ఞఫలమును పొందుతుంటారు. పాపములు చేసిన వారు కూడా, నన్ను భజించి, వారి పాపములకు ప్రాయశ్చితము చేసుకుంటారు. ఈ లోకములో అధర్మము పెచ్చుమీరి పోయనప్పుడు, నేను అవతరించి, అధర్మమును రూపుమాపి, ధర్మమును రక్షిస్తాను. ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మవర్తనులను రూపు మాపి, ధార్మికులను రక్షించి లోకోపకారము చేస్తాను. ఉదంకా.. నేను సర్వసమర్ధుడనయినా, అధర్మవర్తనులైన కౌరవులతో, ధర్మవర్తనులైన పాండవులను కలపడానికి, ఎంతో ప్రయత్నము చేశాను. నేను చేసిన ప్రయత్నమును వ్యాసుడు, మొదలైన మహా మునులు కూడా ప్రశంసించారు. కానీ, దుర్మదాంధులైన కౌరవులకు, నా మాటలు రుచించలేదు. అందువలన, యుద్ధమే శరణ్యమయినది. అధర్మవర్తనులైన కౌరవులు సమూలంగా నాశనమయ్యారు. ఇదంతా లోక కల్యాణార్థమే జరిగింది’. అని సావధానంగా తెలియజేశాడు, శ్రీ కృష్ణుడు.
అప్పుడు ఉదంకుడు, "శ్రీకృష్ణా! నీవెవరో, నీ మహిమలేమిటో, నాకు ముందే తెలుసు. కానీ, నేను తాత్కాలిక కోపానికి గురి అయ్యాను. అందుకే నిన్ను నిందించాను. నీ అమృతతుల్యమైన వాక్కులతో, నా మనస్సులోని మాలిన్యాలను కడిగివేశావు. నాకు ఒక కోరిక ఉంది. మహోన్నతమైన నీ విశ్వరూపము చూడాలని ఆశగా ఉంది. నేను అందుకు అర్హుడిననుకుంటే, నాకు నీ విశ్వరూపము చూపించు" అని ప్రార్థించాడు. ఉదంకుడి మాటలు మన్నించిన శ్రీకృష్ణుడు, నాడు యుద్ధభూమిలో అర్జునుడికీ, భీష్ముడికీ చూపించిన విశ్వరూపమును, ఉదంకుడికి చూపించాడు. అనిర్వచనీయమూ, అద్భుతమూ అయిన ఆ విశ్వరూపమును చూసిన ఉదంకుడు, ఏకకాలమున భయము, ఆనందము, ఆశ్చర్యానికీ లోనై, చేతులు జోడించి, శ్రీకృష్ణుడిని పరి పరి విధాలా స్తుతించాడు. దాంతో సంతోషభరితుడైన వాసుదేవుడు ఉదంకుడితో, ఏదైనా వరము కోరుకోమన్నాడు. అందుకు ఉదంకుడు, "మహాత్మా! సామాన్యులకు దుర్లభమైన నీ విశ్వరూపమును కనులారా చూశాను. నాకు ఇంత కంటే ఏమి కావాలి? ఈ భాగ్యము నాకు చాలు" అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, "ఉదంకా! నా విశ్వరూపమును దర్శించిన నీకు, శుభములు కలుగుతాయి. కానీ, నీకు ఒక వరము ఇవ్వాలని నేననుకుంటున్నాను. అడుగు" అని అనగా, అందుకు ఉదంకుడు, "కృష్ణా! ఇదంతా కరవు ప్రాంతం. వర్షపు జలము కానీ, భూగర్భజలములు కానీ దొరకవు. కనుక, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు, నాకు జలము లభించే వరమును ప్రసాదించు" అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, "ఉదంకా! నీకు నీరు కావాలని అనిపించినప్పుడు నన్ను స్మరించినట్లయితే, నీకు తప్పక నీరు లభిస్తుంది" అని వరాన్నిచ్చి, శ్రీ కృష్ణుడు ద్వారకకు ప్రయాణమయ్యాడు.
ఒకరోజు ఉదంకుడికి దాహము వేయగా, ఆ శ్రీ కృష్ణ భగవానుడిని తలచుకున్నాడు. వెంటనే ఉదంకుడి ఎదుట ఒక కడజాతి వాడు కనిపించాడు. అతడి ఒంటి మీద బట్టలు లేవు. చాలా మురికిగా ఉన్నాడు. అతడి చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. కానీ, అతడి ఒంటి మీద నిర్మలమైన జలము స్రవిస్తోంది. అతడు ఉదంకుడిని పిలిచి, "ఉదంకా! నీకు దాహము వేస్తుంది కదా? నా శరీరము నుండి స్రవించే నిర్మలమైన జలము త్రాగు" అని అన్నాడు. ఆ మాటలు విన్న ఉదంకుడు ఆగ్రహించి, అతడి అవతారాన్ని చూసి అసహ్యించుకుని, అతడిని అక్కడి నుండి వెళ్ళి పొమ్మని అరిచాడు. ఆ మరుక్షణమే కడజాతివాడు, కుక్కలతో సహా మాయం అయ్యాడు. ఈ సంఘటనతో మరొక సారి, శ్రీ కృష్ణుడిని స్మరించుకున్నాడు ఉదంకుడు. వెంటనే శ్రీ కృష్ణుడక్కడ సాక్షాత్కరించాడు. అప్పుడు ఉదంకుడు ఆవేదనతో, "కృష్ణా! నిన్ను తలచుకుంటే జలము లభిస్తుందని అన్నావు కదా! నీవేమో నన్ను ఈ కడజాతి వాడి శరీరము నుండి లభించే జలము త్రాగమని అంటున్నావు. ఇదేనా నీవు నాకు ఇచ్చే వరము?" అని అడిగాడు.
అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, "నీకు నేనిచ్చిన మంచి అవకాశమును జారవిడిచావు. నేను నీకు అమృతమును ప్రసాదించమని, దేవేంద్రుడికి చెప్పాను. మానవులు అమృతము త్రాగడానికి అర్హులు కాదని దేవేంద్రుడు నాతో అని, నా మాట కాదననలేక, "దేవా! నీవు కోరిన విధంగా నేను ఉదంకుడికి అమృతమును ఇస్తాను. కానీ, నేనతడి వద్దకు కడజాతివాడి రూపములో వెళతాను. అతడు నేనిచ్చే అమృతమును ఇష్టపడకపోతే, నేను చేయగలిగింది ఏమీ లేదు" అని దేవేంద్రుడే, మారు రూపంలో నీ వద్దకు కడజాతివాడిగా వచ్చి, అమృతము త్రాగమని చెప్పాడు. దానిని నీవు తిరస్కరించావు. ఇక నేనేమి చేయగలను? కానీ ఉదంకా, నీకు నేను ఇంకొక వరమును ఇస్తాను. నీకు సంవత్సరం పొడవునా, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీరు లభించే వరమును ప్రసాదిస్తున్నాను. నీవు కోరుకున్న వెంటనే, మేఘములు నీ వద్దకు వచ్చి, వర్షము కురిపిస్తాయి. అలా వర్షాన్ని కురిపించే మేఘాలను, జనులు ఇక నుండి ఉదంక మేఘాలని పిలుస్తారు. నీ కోరిక ఈ విధముగా నెరవేరగలదు" అని పలికి, అదృశ్యమయ్యాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు.
శ్రీ కృష్ణ భగవానుడినే శపించాలనుకున్న ఉదంకుడు, అంత శక్తివంతుడా? ఉదంకుడికి అమృతాన్ని అందించమని దేవేంద్రుడిని, స్వయానా శ్రీ కృష్ణుడే అడిగాడంటే, ఆయన తపోశ్శక్తి అంత గొప్పదా? అసలు ఈ ఉదంకుడెవరు? ఆయన చరిత్ర ఏంటి - వంటి విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!