Ads

Showing posts with label Sitamarhi. Show all posts
Showing posts with label Sitamarhi. Show all posts

21 May, 2021

ఆనాడు ‘సీతమ్మ అవతారం చాలించిన ప్రదేశం’ నేడు ఎక్కడుందో తెలుసా? Sitamarhi in Telugu

  

ఆనాడు ‘సీతమ్మ అవతారం చాలించిన ప్రదేశం’ నేడు ఎక్కడుందో తెలుసా?

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/KQ-YqqcIM5o ​]

'రామాయణం' భారతీయ వాఙ్మయములో ఆదికావ్యంగానూ, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహర్షి, ఆదికవిగానూ సుప్రసిధ్ధము. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడి ఉంది. తండ్రీకొడుకులూ, భార్యాభర్తలూ, అన్నదమ్ములూ, యజమానీ-సేవకులూ, మిత్రులూ, రాజు-ప్రజలూ, భగవంతుడూ-భక్తుడూ, ఇలా వీరందరి మధ్యా గల సంబంధబాంధవ్యాలూ, ప్రవర్తనా విధానాల గురించి, రామాయణంలో చెప్పబడి ఉంది. సీతమ్మ తల్లి తన అవతారం చాలించినప్పుడు, తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం, అందరికీ తెలిసిందే.. అయితే, ఆ స్థలం ఎక్కడుందో తెలిసినవారు, చాలా కొద్ది మందే. చారిత్రాత్మకమైన ఆ ప్రాంత విశేషాలేంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

సీతమ్మ తల్లి తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు.. అలహబాద్, మరియు వారణాసిల జాతియ రహదారికి, సుమారు 4 కి.మీ. దూరంలో, దక్షిణ దిక్కుగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ‘సీతా సమాహిత్ స్థల్’ అనీ, ‘సీతా మడి’ అనీ, 'సీతా మరి' అని కూడా పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్ లో, చూడటానికి ఒకే ఒక గుడి ఉంది. ఇది చూడటానికి స్మారకంలా ఉంటుంది. ఈ గుడి స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే, వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమం లోనే, జానకీ దేవి అడవుల పాలైనప్పుడు, నివాసము ఉండేది. ఆశ్రమానికి ప్రక్కనే, లవ కుశులకు జన్మనిచ్చిన స్థలం అయిన సీతా వట వృక్షం కూడా ఉంటుంది.

కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్ |
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత: ||

ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో, సీతమ్మ వారి పాలరాతి విగ్రహం ఉంటుంది.

అలాగే, క్రింది భాగంలో, జీవకళ ఉట్టిపడే విధంగా, భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే, ఎంతటి వారికైనా బాధ కలిగించే విధంగా ఉంటుంది.

వెనుక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు, ఇక్కడ సీతమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా, కేశ వాటిక ఉండేదని, అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని, పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు, 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండా, అలాగే ఉంచారు.

స్మారక వివరాల్లోకి వెళితే.. దీన్ని స్వామీ జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు, ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన, ఋషికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా, సీతమ్మ వారి అనుగ్రహం మేరకు, 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలి నడకన బయలుదేరి చేరుకుని, ఇక్కడ స్మారకం నిర్మించాలని పరితపించి, దాతలందరినీ కలిశారట. చివరికి ప్రకాశ్ పువ్ గారి సహాయంతో, తన కలను నెరవేర్చుకున్నారు తీర్థులవారు. ఆలయం ప్రక్కనే, జీవకళ ఉట్టిపడే విధంగా, తీర్థులవారి సమాధి కూడా ఉంటుంది..

జై శ్రీరామ్!