Ads

Showing posts with label Shri Radha Ashtami. Show all posts
Showing posts with label Shri Radha Ashtami. Show all posts

14 September, 2021

శ్రీ రాధాష్టమి సందర్భంగా.. Shri Radha Ashtami..

  

ఈ రోజు శ్రీ రాధాష్టమి సందర్భంగా..

భాగవతంలో పెద్దగా చర్చించని రాధాకృష్ణుల గురించి ఏ పురాణం వివరిస్తుంది!?

[ రాధా కృష్ణుల వియోగం వెనుక దాగిన దేవ రహస్యం! = https://youtu.be/xZvBKP2PoSI ]

శ్రీకృష్ణుని అష్టమహిషులు ఉండగా, ఎన్నో చోట్ల రాధాకృష్ణుల ఆలయాలు ఉండడం, వారి కీర్తనలు బహు ప్రచారంలో ఉండడం, ప్రేమైకస్వరూపంగా వారి గురించి చర్చించడం, చూశాము. వారి గురించి లోకంలో ఎన్నో దివ్యగాధలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, అనవసరమైన తప్పుడుకధలు కూడా చాలా ప్రచారం జరుగుతున్నాయి. ఎలాగైతే సూర్యుని గురించి, ఎవడో ఏదో తప్పుడు కూతలు కూసినా, ఆయన ప్రభావానికి లోటు లేదో, రాధాదేవి గురించి తెలియకపోయినా, తెలివి తక్కువ కధలకు విలువ ఇచ్చినా, ఆవిడకు వచ్చిన లోటేమీ లేదు.

శ్రీమద్భాగవతంలో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి, ఏ ఏ పురాణాలూ, ఇతిహాసాలూ వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. దేవీ భాగవతం: నవమ స్కంధంలో గోలోకం గురించి, రాధాకృష్ణులు ఎలా ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధికం. అలాగే, శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి, చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో, వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ, నవమస్కంధం వివరిస్తుంది. శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరు వేరు అని అనుకోవడం, వారి మాయకు లోను కావడం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని.

2. బ్రహ్మవైవర్త పురాణం: ఈ పురాణం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణ ఖండాలుగా ఉన్న ఈ పురాణంలో, సగభాగం కృష్ణ ఖండం. ఈ పురాణం అంతా, రాధాదేవి తత్త్వం గురించి, రాధామాధవులను అర్ధనారీశ్వర తత్త్వంలో వివరిస్తుంది. ఈ పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మమహిషి. దుర్గ, లక్ష్మి, సరస్వతి, ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా, రాధ నుండి ఉద్భవించినవే. స్త్రీ తత్త్వాన్ని ఎవరైనా అవమానిస్తే, రాధను అవమానించినట్టని చెబుతుంది, ఈ పురాణం. చైతన్యమహాప్రభు, ఇత్యాది భక్తి రస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది, ఈ బ్రహ్మవైవర్త పురాణం. శ్రీకృష్ణ లీలలూ, రాధాకృష్ణుల రాసలీలలూ, వ్రజభూమిలో వారి ఆటపాటల వంటి ఎన్నో శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ, విపులంగా వివరింపబడ్డాయి. అమ్మవారి చైతన్య తత్త్వం గురించి, ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది. 

3. బ్రహ్మాండ పురాణం: ఉపోద్ఘాత పర్వంలో, పరశు రాముడు గజాననుని దంతాన్ని తన పరశువుతో ఖండించినప్పుడు, పార్వతీ దేవిని శాంతపరచడానికి, రాధా సహిత కృష్ణుడు ప్రత్యక్షమై, తన సహోదరిని ఊరడింపజేశాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు, వారిని చేసిన స్తోత్రం, 'గృహేరాధే వనే రాధే' జగత్ప్రసిద్ధం.

4. స్కాంద పురాణం: వైష్ణవ ఖండంలో భాగవత మాహాత్మ్యం వర్ణనలోనూ, వాసుదేవ మాహాత్మ్యంలోనూ, శ్రీకృష్ణుని ఆత్మగా రాధమ్మను కీర్తిస్తారు. దీనిలోనే, గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శనభాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరింపబడి ఉన్నాయి.

5. నారద పురాణం: నారదుడు యుగళ సహస్రనామం చేసినప్పుడు, మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే, తదుపరి ఐదు వందల నామాలు, రాధా కీర్తన. అమ్మవారి తత్త్వం అర్ధం చేసుకోవడం కోసం, నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి, రాధమ్మ పార్శదునిగా, ఆత్మానందం అనుభవించాడు. 

6. పద్మ పురాణం: భూమిఖండంలో, రాధాష్టమి, రాధాదామోదర వ్రతం విశేషాలు, విస్తారంగా వివరింపబడి ఉంటాయి. పాతాళఖండంలో, రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలూ, నందవ్రజంలో వారు చేసిన అధ్బుత విన్యాసాలూ, అర్జునుని అభ్యర్ధన మేరకు అర్జునుని, అర్జుని అనే పేరు గల గోపికగా మార్చి, పరబ్రహ్మ, ప్రకృతీ పురుషుల దర్శనం ఇవ్వడం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. 

7. విష్ణు పురాణం: 13వ సర్గలో, రాసలీల వివరణ, రాధ యొక్క గొప్పదనం, వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.

8. గర్గ సంహిత: దీనిలో రాధాకృష్ణుల రాసలీలలూ, వారి దివ్యప్రబోధాలూ, బృందావనంలో వారి ఆటపాటలూ, అటుపై రాధ విరహవేదనా, మరల సిద్ధాశ్రమంలో వారి కలయిక, వంటి అద్భుత లీలలు వర్ణింపబడి ఉన్నాయి.

ఇవి కాక, మత్స్యపురాణంలో, బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, ఋగ్వేదంలో రాధా సంహితలోనూ, అథర్వణ వేదంలో, రాధాతపనీయ ఉపనిషత్తులో, రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. 

ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప, రాధాకృష్ణుల తత్త్వం తెలుసుకునే భాగ్యం కలగదనీ, అప్పటికి కానీ వారికి ఆ లీలలు అనుభవించి, శ్యామ సముద్రంలో (అంటే కృష్ణునిలో, అంటే మోక్షం) కలిసే అవకాశం ఉండదనీ, పురాణం చెబుతుంది. అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్త్వం, రాధ తత్త్వం. వారి పాప రాశిని దగ్ధం చేసే అవకాశం, వీరి చరితం తెలుసుకోవడం. అదే వారి పాపరాశి పోగుచేసుకునేవాళ్ళు, వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ, తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు.

కృష్ణం వందే జగద్గురుం!