Ads

Showing posts with label Shivaji's historic escape from Agra. Show all posts
Showing posts with label Shivaji's historic escape from Agra. Show all posts

03 January, 2022

ది గ్రేట్ ఎస్కేప్ – ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి! Shivaji's historic escape from Agra

 

ది గ్రేట్ ఎస్కేప్ – ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి!

మన భారత దేశ చరిత్రలో ఎందరో రాజులున్నారు, చక్రవర్తలున్నారు. కానీ ఛత్రపతి మాత్రం ఒక్కరే.. ఆయనే, శివాజీ రాజే భోంస్లే. హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ చరిత్ర, ఎప్పటికీ చిరస్మరణీయం. ఉన్నతమైన వ్యక్తిత్వం, పర మత సహనం, అపారమైన దైవ భక్తి, స్త్రీల పట్ల గౌరవం, అయనలోని గొప్పతనాన్ని చాటే ముచ్చుతునకలు. మొఘలులపై, బీజాపూర్ సుల్తానులపై, ఎన్నో యుద్ధాలు చేసి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు, ఛత్రపతి శివాజీ. యుద్ధంలో చావో, రేవో అనేలా పోరాడడం మాత్రమే కాకుండా, చాకచక్యంగా, అవసరమైనప్పుడు వెనకడుగు వేసి తప్పించుకుని, తిరిగి తన పంజా విసిరి, శత్రువులను దెబ్బతీయడం, శివాజీ నైజం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ay2IFCn95Wo ]

[ ఛత్రపతి శివాజీ వీర గాధ!: https://youtu.be/it7JY1jp20A ]

అటువంటి ఘటనలెన్నో ఉన్నాయి. ఒకనాడు ఔరగంజేబు, శివాజీనీ, ఆయన కుమారుడు శంభాజీనీ మర్యాదపూర్వకంగా ఆగ్రాకు పిలిపించి, వారిని బంధీలుగా చేశాడు. అక్కడినుండి శివాజీ ఎలా తప్పించుకున్నారు? మొఘలుల మున్సబుగా సంధి చేసుకున్న శివాజీని, ఔరంగజేబు ఎందుకు బంధించాడు? భవనం చుట్టూ ఉన్న వందల మంది సైనికులను తప్పించుకుని, శివాజీ ఎలా బయటపడ్డారు? ఏడు నెలల పాటు ఆగ్రాలో ఏం జరిగింది? వంటి ఉత్సుకత రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో గుర్తుచేసుకుందాము..

1666 లో, ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా, శివాజీనీ, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీనీ ఆగ్రాకు అహ్వానించాడు. అక్కడకు వెళ్ళడం, శివాజీకీ ఇష్టంలేదు. ఎందుకంటే, ఔరంగజేబు మేక వన్నె పులి అనీ, ఎంతకైనా తెగిస్తాడనీ, శివాజీకి తెలుసు. కానీ, ఔరంగజేబు తరుపున వచ్చిన రాజా జై సింగ్ శివాజీతో, ‘మీరు ఔరంగజేబును కలిస్తే, ఆయన తర్వాత మిమ్మల్ని దక్కనుకు వైస్రాయ్‌గా చేస్తారేమో, బీజాపూర్, గోల్కొండను ఆక్రమించుకోవడానికి, తన నాయకత్వంలో ఒక దళాన్ని పంపిస్తారేమో’, అని ఆశ కల్పించాడు. అయితే, శివాజీ కోరిక ఏంటంటే, ఔరంగజేబును కలిస్తే, బీజాపూర్ నుంచి పన్ను వసూలు చేసుకోవడానికి అనుమతి దొరకవచ్చేమో అనుకున్నారు. ఆ నిర్ణయాన్ని మరాఠా దర్బార్‌లోని వారు కూడా, ఆమోదించారు. దాంతో, 1666 మార్చి 5న, తల్లి జిజియాబాయికి రాజ్య బాధ్యతలను అప్పజెప్పి, ఔరంగజేబును కలవడానికి, ఆగ్రా బయల్దేరారు శివాజీ. అయితే, శివాజీ భద్రత చూసుకునే బాధ్యతను రాజా జై సింగ్, ఆగ్రాలో ఉన్న తన కొడుకు కుమార్ రాం సింగ్‌కు అప్పగించాడు. శివాజీ ఆగ్రా రావడానికి ఖర్చుల నిమిత్తం, కొంత ధనం, ఒక లేఖ పంపించాడు, ఔరంగజేబు.

ఆ లేఖలో, "మీరు ఇక్కడకు ఎలాంటి సంకోచం లేకుండా రండి. మీ మనస్సులో ఎలాంటి ఆందోళనా ఉంచుకోకండి. నన్ను కలిశాక, మీకు రాచ మర్యాదలు జరుగుతాయి. మిమ్మల్ని తిరిగి గౌరవంగా ఇంటికి పంపిస్తాం. మీరు వేసుకోడానికి ఖిలాత్, అంటే, ఖరీదైన దుస్తులను కూడా పంపుతున్నాను" అని ఉంది. వారం తరువాత శివాజీ, ఆయన పరివారం, ఆగ్రా చేరుకున్నారు. ఔరంగజేబు దర్బారులో, 'శివాజీ రాజా' అని గట్టిగా పేరు పిలవగానే, శివాజీ, ఆయన కొడుకు శంభాజీ, పది మంది అనుచరులనూ సభలోకి తీసుకెళ్లాడు, కుమార్ రాం సింగ్. మరాఠా రాజ్యం తరపున, ఔరంగజేబ్‌కు 2 వేల బంగారు నాణాలు 'నజర్'గా, 6 వేల రూపాయలు 'నిసార్‌'గా అందించి, ఔరంగజేబు సింహాసనం దగ్గరికి వెళ్లి, ఆయనకు మూడుసార్లు సలాం చేశారు. ఔరంగజేబు తల ఊపి, శివాజీ బహుమతులు స్వీకరించాడు. శివాజీకి కనీస మర్యాద కూడా లభించలేదు. ఔరంగజేబు సహాయకుడు శివాజీనీ, ఆయన పరివారాన్నీ, మూడవ హోదాలో ఉండే మున్సబుదారులతో పాటు, దూరంగా ఉన్న వెనుక వరుసలో నిలబెట్టారు. తనకు అలాంటి స్వాగతం లభిస్తుందని శివాజీ ఊహించలేదు.

అంతేకాకుండా, ఆగ్రా బయట తనకు స్వాగతం పలకడానికి, రామ్‌ సింగ్, ముఖ్లిస్ ఖాన్ వంటి మామూలు అధికారులు రావడం కూడా, శివాజీకి నచ్చలేదు. సభలో తల వంచి, ఔరంగజేబుకు సలాం కొట్టిన తన గురించి, ఒక మంచి మాట చెప్పడం గానీ, ఆయనకు ఏదైనా బహుమతులు ఇవ్వడం గానీ చేయలేదు. దానికి తోడు, ఆయనను సాధారణ మున్సబుదారుల మధ్య, ఎన్నో వరుసల వెనక నిలబెట్టారు. ఔరంగజేబ్ కు కూడా, సరిగా కనిపించనంత దూరంగా ఉంచారు. ఈ సంఘటనలతో, శివాజీకి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో, ఆయన రామ్ సింగ్‌ ని పిలిచి, "నన్ను ఎవరి మధ్య తీసుకొచ్చి నిలబెట్టావ్" అని అడిగారు. అప్పుడు రాం సింగ్, ‘మీరు 5 వేల మంది సైనికులకు అధిపతి అయిన పాంచ్ హాజారీ మున్సబ్‌దారుల మధ్య ఉన్నారు’ అని విన్నవించాడు. దాంతో శివాజీ గట్టిగా, "నా ఏడేళ్ల కొడుకూ, నా నౌకర్ నేతాజీ కూడా, పాంచ్ హజారీలే. చక్రవర్తి అని గౌరవించి, అంత దూరం నుంచి ఆగ్రా వచ్చిన నన్ను, వీళ్లతో పోల్చుతారా" అంటూ మండిపడ్డారు. తనకు ఘోర అవమానం జరగడంతో రగిలిపోయిన శివాజీ, రాం సింగ్‌ తో గట్టిగా మాట్లాడుతున్నారు. దర్బార్‌లో అలా మాట్లాడుతుండడంతో, రాం సింగ్ కంగారు పడిపోయి, శివాజీ కోపం చల్లార్చే ప్రయత్నాలు చేశాడు. అయినా శివాజీ శాంతించలేదు. శివాజీ గట్టిగా అరవడం విన్న ఔరంగజేబు, ఆ అరుపులేంటని రాం సింగ్ ని అడుగగా, ఆయన ఎంతో చాకచక్యంగా, "సింహం అడవి జంతువు, అది ఇక్కడ ఉక్కపోతను భరించలేక, జబ్బు పడింది" అన్నాడు.

దాంతో శివాజీని పక్కనున్న గదిలోకి తీసుకెళ్లి, ఆయనపై పన్నీరు చల్లామన్నాడు ఔరంగజేబు. ఆయన కుదుటపడిన తర్వాత, దర్బారు ముగిసేవరకూ వేచిచూడకుండా, శివాజీని నేరుగా, ఆయన కోసం ఏర్పాటు చేసిన విడిది ప్రాంతానికి తీసుకెళ్లమని, సూచించాడు. ఆగ్రా నగరం బయట, జయ్‌పూర్ సరాయ్‌లో, శివాజీకి విడిది ఏర్పాటు చేశారు. శివాజీ జయ్‌పూర్ నివాసంలోకి వెళ్లగానే, ఒక అశ్విక దళం, ఆ ఇంటిని నాలుగు వైపుల నుంచీ చుట్టుముట్టింది. కాసేపటికే, మరికొందరు సైనికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లు తమ ఫిరంగులను, భవనానికి ఉన్న ప్రతి తలుపు వైపూ గురిపెట్టారు. శివాజీ తానున్న ఆ భవనం నుంచి బయటకు వెళ్లడానికి, అనుమతి లేదు. అయితే, వారి ఉద్దేశ్యం, శివాజీని చంపడం కాదు. అలా జరిగితే, మరాఠాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనీ, సరైన సమయం చూసుకుని, శివాజీని చంపాలనీ, ఔరంగజేబు భావించాడు. అందుకే, శివాజీని బంధీగా ఉన్న అతిథిలా గౌరవించాడు. ఔరంగజేబు ఆయనకు పండ్ల బుట్టలను కూడా పంపించేవాడు. ఇలా గడుస్తుండగా, శివాజీ కొంత కాలానికి, ఔరంగజేబు ప్రధాన వజీర్ ఉమ్‌దావుల్ ముల్క్‌ ద్వారా, "చక్రవర్తి నన్ను సురక్షితంగా తిరిగి పంపిస్తానని హామీ ఇచ్చారు. కానీ, అది జరిగేలా ఏమాత్రం కనిపించడం లేదు" అని ఔరంగజేబుకు సందేశం పంపించాడు. అయినా ఔరంగజేబు, ఏ మాత్రం స్పందించలేదు.

అతని నుండి ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో, తనను చంపడానికి తగిన సాకు కోసం ఔరంగజేబు వేచిచూస్తున్నాడనీ, మెల్లమెల్లగా రెచ్చగొట్టి, కోపొద్రిక్తుడిని చేయాలనుకుంటున్నాడనీ, శివాజీకి అర్థమైంది. దాంతో, ఒక మంచి ఆలోచన చేసి, తప్పించుకునే మార్గాన్ని వెదికాడు. ఆనాటి నుండి, ఆయన చాలా సంతోషంగా ఉన్నట్టు, తనకు కాపలాగా ఉన్న సైనికులతో నవ్వుతూ, సరదాగా మాట్లాడేవాడు. సైనికాధికారులకు ఎన్నో బహుమతులు పంపించేవాడు. ఆగ్రా వాతావరణం తనకు బాగా నచ్చిందని, చూట్టూ తిరుగుతూ సందడి చేసేవాడు. తన కోసం ఎన్నో తీపి వంటకాలూ, పండ్లూ పంపిస్తున్న చక్రవర్తికి ఎంతో రుణపడి ఉంటానని, శివాజీ అందరితో చెప్పేవాడు. పాలన కార్యకలాపాలకు దూరంగా, ఆగ్రా లాంటి సాంస్కృతిక నగరంలో ఉండడం చాలా హాయిగా ఉందంటూ, అందరినీ నమ్మించాడు. చక్రవర్తి గూఢచారులు మాత్రం, శివాజీపై రాత్రింబవళ్లు నిఘా ఉంచేవారు. దాంతో, ఔరంగజేబ్‌కు మరింత నమ్మకం కలిగేలా, తన తల్లి, భార్య కూడా తన దగ్గరకు వచ్చి ఉండడానికి అనుమతిస్తారా అని, శివాజీ చక్రవర్తికి ఒక సందేశం కూడా పంపించాడు. దానికి ఔరంగజేబు సరే అన్నాడు.

తమ ఇంటి ఆడవాళ్లను బందీలుగా చేసే వ్యక్తి, ఎప్పటికీ పారిపోయే సాహసం చేయడని, ఔరంగజేబు అనుకున్నాడు. కానీ, చక్రవర్తి అనుమతి లభించినా, శివాజీ కుటుంబంలోని మహిళలు ఆగ్రాకు రాలేదు. భారీ వర్షాల వల్ల, వాళ్లు అంత సుదీర్ఘ ప్రయాణం చేయలేకపోయారనీ, అందుకే ఆగ్రాకు రాలేదనీ, శివాజీ అందరికీ సాకు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత, తనతో పాటూ వచ్చిన మరాఠా అశ్వికులను తిరిగి తమ రాజ్యానికి పంపించాలని, ఔరంగజేబుకు సందేశం పంపించాడు శివాజీ. స్వయంగా శివాజీ తన  సైనికులను వదిలించుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి, చక్రవర్తి ఎంతో సంతోషపడ్డాడు. అలా శివాజీని నమ్మిన ఔరంగజేబు, అతని వర్గం, ఆయనపై నిఘాను కాస్త తగ్గించారు. తర్వాత అసలు ప్లాన్ ని అమలు చేశారు, శివాజీ. తనకు అనారోగ్యంగాఉందని చెప్పి, బయట కాపలా ఉన్న మొఘల్ సైనికులకు సైతం వినిపించేలా, మూలిగేవాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని, బ్రాహ్మణులకూ, సన్యాసులకూ, ప్రతీ సాయంత్రం బుట్టల్లో మిఠాయిలూ, పళ్లూ పంపించేవాడు శివాజీ. వాటిని సైనికులు తనిఖీ చేసి, బయటకు పంపించేవారు. అలా రోజులు గడిచే కొద్ది, ఆ బుట్టలను పట్టించుకోవడం మానేశారు కాపలాదారులు. ఒకరోజు, తన ఆరోగ్యం అస్సలు బాగోలేదనీ, మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నట్లుగా నటించాడు.

తన విశ్రాంతికి భంగం కలిగించవద్దనీ, ఎవరినీ లోపలికి పంపించవద్దనీ, సైనికులకు చెప్పాడు. అచ్చం తనలాగే కనిపించే తన సవతి సోదరుడు హీరాజీ ఫర్జాంద్‌కు, తన బట్టలూ, ముత్యాల హారం వేసి, మంచంపై పడుకోబెట్టాడు. కేవలం శివాజీ కడియం ఉన్న ఆయన చెయ్యి మాత్రమే కనిపించేలా, మిగతా శరీరం అంతా దుప్పటి కప్పేశాడు. రోజూ వెళ్లే పండ్ల బుట్టలలో, తన కొడుకును కూర్చోబెట్టుకుని, శివాజీ దాన్ని మోస్తున్న కూలీవేషంలో, ఆ భవనం నుండి బయటకు వచ్చేశాడు. శివాజీ, ఆయన కొడుకూ, ఆగ్రా నుంచి ఆరు మైళ్ల దూరంలోని ఒక గ్రామం చేరుకున్నాక, కూలీల గుంపునుండి వేరయ్యాడు. ఈలోపు హీరాజీ ఫర్జాంద్‌, ఆ రాత్రీ, మారునాటి మధ్యాహ్నం వరకూ, అలా పడుకునే ఉన్నాడు. గదిలోకి తొంగి చూసిన సైనికులకు, ఆయన చేతికున్న బంగారు కడియం, ఒక సహాయకుడు నేల మీద కూర్చుని, ఆయనకు మాలిష్ చేయడం కనిపించాయి. దాంతో, శివాజీ అక్కడే పడుకుని ఉన్నారనుకున్నారు, సైనికులు. సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, హీరాజీ ఒక నౌకరుతో కలసి, ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తూ వెళ్తూ, "గట్టిగా అరవకండి, శివాజీకి ఆరోగ్యం సరిగా లేదు, ఆయనకు వైద్యం జరుగుతోంది" అని చెప్పి, అక్కడి నుండి తప్పించుకున్నాడు. కాసేపటికి శివాజీ గది నుంచి ఎలాంటి శబ్దాలూ రాకపోవడంతో, సైనికులకు సందేహం వచ్చింది. లోపలికెళ్లి చూస్తే, అక్కడ ఎవరూ కనిపించలేదు.

దాంతో ఖంగుతిన్న సైనికులు, తమ నాయకుడైన ఫలాద్ ఖాన్‌కు చెప్పగా, అతను ఔరంగజేబు దగ్గరకు వెళ్లి, ఆయన కాళ్లపై పడి, "మాయ జరిగిపోయింది. శివాజీ అదృశ్యం అయ్యాడు. ఆయన గాల్లో ఎగిరెళ్లాడో, లేక ఆయన్ను భూమి మింగేసిందో, పొరపాటు ఎక్కడ జరిగిందో, నాకు తెలీయడం లేదు" అంటూ, జరిగిన సంగతిని వివరించాడు. అది వినగానే ఔరంగజేబుకు చెమటలు పట్టాయి. వెంటనే నలువైపులకూ తన సైనికులను పంపించి, శివాజీ కోసం వెతికించాడు. కానీ, ఎవ్వరూ శివాజీ జాడను కనిపెట్టలేకపోయారు. ఔరంగజేబు నుంచి తప్పించుకుని, ఆగ్రా నుండి, ఆరు గంటల్లోనే మధురకు చేరుకున్నారు, శివాజీ, శంభాజీ. అక్కడ శివాజీ తన జుట్టూ, గడ్డం, మీసాలు తీయించుకున్నారు. శివాజీ, ఆయన కుమారుడూ, ఒక సామాన్యుడి వేషంలో, కాషాయ బట్టలు ధరించారు. అలా శివాజీ, ఎవరూ ఊహించని దారిలో, మధుర, అలహాబాద్, వారణాసీ, పూరీ మీదుగా, ఒడిషా, గోల్కొండ దాటుకుని, రాజ్‌ఘడ్ చేరుకున్నారు. డిసెంబర్ నెలలో, అంటే, దాదాపు ఏడు నెలల తరువాత, శివాజీ తిరిగి తన రాజ్యానికి చేరుకున్నారు.

ఇక్కడ గమనించవలసిన నీతి ఏంటంటే, శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు, అతను చేసే నష్టం అంచనా వేయడం కష్టం కాబట్టి, మనమీద అనుమానం రాకుండా, మనకు నష్టం కలగకుండా మట్టుబెట్టే విధానం గురించి మనకు ముందు తెలిసి ఉండాలి. ఛత్రపతి శివాజీ కూడా 2 సంవత్సరాలు వేచి ఉండి, ఆ తరువాత చావు దెబ్బ కొట్టారు ఔరంగజేబును..

🚩 ఓం నమః శివాయ 🙏