Ads

Showing posts with label Psychics. Show all posts
Showing posts with label Psychics. Show all posts

08 October, 2021

మనోనేత్రాలు! Psychics

 

మనోనేత్రాలు!

మన ఆలోచనలే, మన లోచనాలు. లోచనాలు అంటే, కళ్ళు. మన ఆలోచనలే, మన కళ్ళు. మనం ఎలా ఆలోచిస్తే, మన కళ్ళు అలా చూస్తాయి. మన ఆలోచనలు మంచివైతే, మనకళ్ళకి అన్నీ మంచిగానే కనబడతాయి. అలాగే, మన ఆలోచనలు చెడ్డవైతే, మనకు అన్నీ చెడ్డగానే కనబడతాయి. అవే మన మనోనేత్రాలు. అందుకే, ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి. అన్నింటిలోనూ, మంచినే చూడాలి.

[ దసరా నవరాత్రుల్లో ఈ విధంగా ఆరాధన చేయడం సర్వశుభకరం! = https://youtu.be/11tigSsk1w4 ]

ఇద్దరు వ్యక్తులు చంద్రునిపైనున్న మచ్చలను చూస్తున్నారు. అందులో ఒకాయన అన్నాడు.. 'ఆహా! ఆ మచ్చలను చూడండి. అచ్చం దేవాలయ గోపుర శిఖరాల్లా ఉన్నాయి' అని. దానికా రెండో ఆయన, 'అబ్బే.. అవేం కాదండీ.. అవి ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ముద్దాడుకుంటున్నట్లున్నాయి చూడండి..' అన్నాడు.

మొదటి ఆయన ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే, రెండో ఆయన శృంగార పరంగా చూశాడు. మచ్చలు అవే.. కానీ, చూడడంలో తేడా. మన మనస్సెలా ఉంటే, మన పరిసరాలు అలా అనిపిస్తాయి. మనం సంతోషంగా ఉంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా, ఆనందమయంగా కనిపిస్తుంది. అదే మనం విచారంగా ఉంటే, ప్రపంచం అంతా దుఃఖమయంగా కనిపిస్తుంది.

ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తూ, త్రోవలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసి, 'పీకల దాకా త్రాగి ఉంటాడు. అందుకే పడిపోయాడు' అనుకుంటూ వెళ్లిపోయాడు. అదే దారిన వెళ్తున్న మరొకతను చూసి, 'అయ్యో పాపం. స్పృహ తప్పి పడిపోయినట్లున్నాడు' అని చల్లని నీళ్ళు తెచ్చి, ఆ వ్యక్తి ముఖం మీద జల్లాడు. వెంటనే అతను తేరుకున్నాడు. మొదటి ఆయన ఆలోచనను బట్టి, అతనికి ఆ వ్యక్తి అలా కనిపించాడు. ఇక రెండో ఆయన విధానం వేరు. అందుచేత, ఆయనకు అదే వ్యక్తి మరోలా కనిపించాడు.

అలాగే, రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే, కథలాగే అనిపిస్తుంది. అలా కాకుండా, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అందులోని అంతరార్థం బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ. సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహం, లంకా నగరం. ఈ లంకాద్వీపమనే దేహంలో బంధింపబడిన సీతమ్మ అనే జీవాత్మ, శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతూ ఉంటుంది.

కానీ, రాక్షసులు దానిని జరుగనీయరు. రాక్షసులు అంటే, మానవునిలోని రజో, తమో గుణాలు. ఈ రజో, తమో గుణాలు, సీత అనే జీవాత్మను, శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా, దేహమనే లంకలో బంధించి ఉంచాయి. అలా బంధింపబడి, శ్రీరాముని కలుసుకోగోరే సీతమ్మ వద్దకు, హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపు మాపే బ్రహ్మజ్ఞానమే, ఆ అంగుళీయకం.

ఈ విధంగా, శ్రీరాముని చేరడానికి, సీతమ్మకు మార్గమేర్పడుతుంది. అంటే, గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే, జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది..

ఓం శ్రీమాత్రే నమః!