Ads

Showing posts with label Manthara. Show all posts
Showing posts with label Manthara. Show all posts

08 October, 2021

రామాయణంలోని మంథర జన్మ రహస్యం! Manthara

  

రామాయణంలోని మంథర జన్మ రహస్యం!

మంథర చెప్పుడు మాటలకు, రాముడిని 14 ఏళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటో తెలుసా?


రామాయణంలో మంథర పాత్ర అతి కీలకమైనది. ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా, వెంటనే వారిని మంథరతో పోలుస్తారు. శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి, వనవాసానికి పంపి, రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి, మంథర. ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎవరికీ తెలియదు.. కానీ, కైకేయి పుట్టింటి నుంచి ఆమెతో పాటు, దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగు పెట్టింది.

నిజానికి రామాయణంలో, మంధర ఒక చిన్న పాత్ర. కానీ, రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా, మిక్కిలి ప్రసిద్ధి పొందింది. నిజానికి రాముడికి పట్టాభిషేకం జరిగితే, రామాయణం ఎంతో కాలం సాగకపోయి ఉండవచ్చు. అలా జరగకుండా చేయటానికి, ఈశ్వర సంకల్పంగా వచ్చిన పాత్ర, మంథర. మంథర గురించిన పూర్తి వివరాలు, వాల్మీకి మహర్షి చెప్పలేదు. అయితే, మహాభారతంలో మంథర గత జన్మ తాలుకు కొంత సమాచారం దొరుకుతుంది.

మంథర దుందుభి అనే గంధర్వ కన్య. రావణుడి చేత బాధింపబడిన అనేక మందిలో, దుందుభి కూడా ఒకరు. దుందుభి బ్రహ్మని ప్రార్ధించింది. దీంతో బ్రహ్మ, దుందుభికి వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో నీ మాటల కారణంగా రావణుడు, రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది. ఇది, మంథర గత జన్మ.. ఇంతకు మించి ఆమె గురించి, పెద్దగా ప్రస్థావన ఎక్కడా లేదు.

మంథర కైకేయికి, పుట్టిన సమయంనుండి దాసిగా ఉందని, రామాయణంలో చెప్పడం జరిగింది. అందుకే, కైకేయి వివాహం జరిగిన తర్వాత కూడా, మంథర కైకేయితో, దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది. రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని తెలుసుకున్న మంథర, స్వాభావికమైన అసూయతో, తన యజమానురాలు కైకేయిపై ఉన్న అభిమానంతో, కైక మనసులో లేని ఆలోచన చొప్పించి, రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది. శ్రీరాముడిని అడవుల పాలు చేసి, చివరకి రావణుడి వధకు, పరోక్షంగా కారణం అయింది.

కైకతో మిక్కిలి చనువుగా మెలగుతూ, కైకకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. రాముడిని పద్నాలుగేళ్లపాటు అవరణ్యవాసానికి పంపడం, మంధర మనోవాంఛితమేమీ కాదు. తలచుకుంటే, ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు. కానీ, అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటే ఉండేలా చూడమని, కైకకు ఎందుకని సలహా ఇచ్చిందంటే.. త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం, పద్నాలుగు సంవత్సరాలు.. ద్వాపరయుగంలో పదమూడు సంవత్సరాలు, కలియుగంలో పది సంవత్సరాలూ అని చెబుతారు. అంటే, నియమిత కాలం పాటు అస్తి, లేదా అధికారానికి ఎవరైనా దూరమయితే, ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట. బహుశా ఈ కారణం చేతనే, మంథర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇలా మంధర, శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి, రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది..

🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏