Ads

Showing posts with label Maa Mundeshwari Temple Bihar. Show all posts
Showing posts with label Maa Mundeshwari Temple Bihar. Show all posts

31 January, 2021

ప్రపంచంలోనే తొలి దుర్గామాత అష్టభుజ దేవాలయం! Maa Mundeshwari Temple Bihar


ప్రపంచంలోనే తొలి దుర్గామాత అష్టభుజ దేవాలయం!

మన దేశంలో అనేక ఆలయాలూ, పురాతన కట్టడాలూ ఉన్నాయి. మహిమాన్వితమైన, అద్భుత శక్తి కేంద్రాలైన దేవాలయాలనూ, అచ్చెరువొందే శిల్ప కళా నైపుణ్యాలు కలిగిన అనేక నిర్మణాలనూ చూడడానికి, ప్రపంచ నలుమూలలనుండీ, అనేక మంది పర్యాటకులూ, భక్తులూ వస్తుంటారు. అత్యంత ప్రాచీన ధర్మంగా భాసిల్లుతోన్న మన సనాతన ధర్మం, అందరిచేత పూజింపబడుతోంది. మన భారతావనిలో ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నా, ప్రతీ దాని వెనుకా చారిత్రక గాధలు దాగివుంటాయి. భారతదేశంలో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఒకటిగా, ప్రపంచంలోని మొట్టమొదటి శక్తి మాత ఆలయంగా ప్రఖ్యాతి గాంచింది, ఈ ముండేశ్వరీ మాత ఆలయం. వేల సంవత్సరాల నాటి ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నా, ఈ ఆలయం మాత్రం, నేటికీ చెక్కుచెదరకుండా, తన ఉనికినీ, ప్రత్యేకతనూ చాటుకుంటోంది. ఈ రోజుటి మన వీడియోలో, అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెంది, తాంత్రిక శక్తుల ఆరాధకులకు ముఖ్యమైన ముండేశ్వరీ మాత ఆలయ విశిష్ఠతల గురించి తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/RjjV4M57Unk ]

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో, అతి పురాతనమైన ఈ ఆలయం, బీహార్‌ రాష్ట్రంలో ఉంది. కైమూర్ జిల్లా, కౌరా ప్రాంతంలోని ఈ ముండేశ్వరీ ఆలయం, ప్రపంచంలోనే, అతి ప్రాచీన శక్తి ఆలయమని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం, సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని మూడు, నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించి ఉండవచ్చని, పురాతత్వ శాఖ అధికారుల అభిప్రాయం. ఇది వారణాసికి సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. మన దేశంలో పూజాదికాలు నిర్వహించబడుతోన్న అత్యంత పురాతన ఆలయం, ఈ అమ్మవారి ఆలయం. సామాన్య శకం 105 లో నిర్మింపబడిన మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయంగా, ఇది ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి దేవాలయం, ముండేశ్వరీ అనే పర్వతంపై నెలకొని ఉంది. దుర్గాదేవి, వైష్ణవి రూపంలో, ముండేశ్వరీ మాతగా, ఈ ఆలయంలో దర్శనమిస్తోంది. ముండేశ్వరీ మాత ఆకారం, కొంత వరకూ వారాహి మాతగా గోచరిస్తుంటుంది.

సాధారణంగా, దుర్గామాతకు సంబంధించిన ఆలయాలలో, అమ్మవారి వాహనంగా సింహం ఉంటుంది. కానీ, ఈ ఆలయంలో అమ్మవారి వాహనం, మహిషి. ఈ ముండేశ్వరీ ఆలయం, అష్టభుజి దేవాలయం. అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం, దక్షిణ దిక్కుగా ఉండడం ప్రత్యేకం. ఆలయం, నగరి నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. అతి ప్రాచీన ఆలయమైన ఈ ముండేశ్వరీ ఆలయం, ప్రస్తుతం, పురాతత్వ శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ అమ్మవారు 10 చేతులతో, ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లుగా, మహిషాసుర మర్ధిని రూపంలో ఉంటుంది. స్థానిక జానపద కథల ఆధారంగా, ఈ ఆలయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని, రాక్షసుడైన మహిషాసురుడి ఆధీనంలో, చండా, ముండా అనే ఇద్దరు సొదరులు పాలించేవారు. ప్రజలను అనేక బాధలకు గురిచేస్తుండేవారు. రాక్షసుల దురాగతాలను తట్టుకోలేని ప్రజలు, దుష్ట సంహారిణి అయిన దుర్గామాతను వేడుకున్నారు. ఆమె తన 10 చేతులతో, ఉగ్ర రూపంతో, రాక్షసులతో యుద్ధానికి పూనుకుంది. ముండ అనే రాక్షసుడిని ఈ పర్వతంపై మట్టుబెట్టి, ముండేశ్వరిగా ఇక్కడ వెలసింది. 

తరువాత చండ అనే రాక్షసుడిని, చైన్పూర్ సమీపంలోని మదురానా కొండపై సంహరించి, చండేశ్వరిగా అక్కడ వెలిసింది. ఈ గాధ మన దుర్గా సప్తశతి పురాణంలో, వివరించబడి ఉంది. ముండ అనే రాక్షసుడిని సంహరించి, ముండేశ్వరిగా వెలిసిన ఈ మాత, తాంత్రిక శక్తుల ఆరాధికులకు ఆరాధ్య దైవంగా బాసిల్లుతోంది. ఈ ఆలయంలో, ఏడవ శతాబ్దంలో, శివుని విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు. ఇక్కడున్న పరమశివుడు, తత్పురుష, అఘోరా, వామదేవ, సద్యోజాత ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో కొలువైన శివుణ్ణి, మండలేశ్వర్ అని పిలుస్తారు. అంతేకాక, ఇక్కడ విష్ణు భగవానుడూ, సూర్యుడూ, వినాయకుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం నిర్మించబడినప్పటి నుండి, నేటి వరకూ, శతాబ్దాలు మారినా, పూజాదికాలు మాత్రం, నిత్యం కొనసాగుతూనేవున్నాయి. దాంతో, ఈ ఆలయం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 

సాధారణంగా అమ్మవారి ఆలయం అంటే, కోళ్లూ, మేకలూ, పొట్టేళ్లను బలి ఇస్తుంటారు. కానీ, ఈ ఆలయంలో మాత్రం, సాత్విక బలే ప్రధాన విశేషం. అంటే, మొదటగా బలి ఇవ్వాల్సిన మేకను, అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. ఆ తరువాత పూజారి, మంత్రించిన అక్షతలను మేకపై జల్లుతాడు. వెంటనే మేక కొన్ని క్షణాల పాటు సృహ తప్పి పడిపోతుంది. తరువాత పూజారి మరలా, అక్షతలను మేకపై వేస్తాడు. దాంతో, ఆ మేక తిరిగి యథా స్థితికి వచ్చి, అక్కడి నుండి వెళ్లిపోతుంది. అక్షతలు వేసిన వెంటనే మేక సృహ తప్పి పడిపోవడం, తిరిగి అక్షతలు వేయగానే లేచి వెళ్లిపోవడం అనేది, భక్తులకే కాదు, అపర మేధావులకు కూడా అంతు చిక్కని రహస్యం. ఇంతటి విశిష్ఠత కలిగిన ఈ ఆలయాన్ని దర్శించడానికి, అధిక సంఖ్యలో భక్తులూ, పర్యాటకులూ వస్తుంటారు. చైత్ర మాసంలో, భక్తుల సంఖ్య రెట్టింపవుతుంది. ఈ ఆలయం చుట్టు ప్రక్కల, సామాన్య శకం 625 వ సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి.

సామాన్య శక పూర్వం 101-77 సంవత్సరాల మధ్యకాలంలో, శ్రీలంకను పాలించిన చక్రవర్తి మహారాజా దత్తగామణి రాజ ముద్ర కూడా, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో లభ్యమైంది. శ్రీలంకకు చెందిన యాత్రికుల బృందం, బోధ్, గయ నుండి, సారనాధ్ వెళ్లే మార్గ మధ్యలో, ఈ ఆలయాన్ని దర్శించి ఉండవచ్చనీ, ఇక్కడ వారి రాజ ముద్రను పోగొట్టుకుని ఉండవచ్చనీ, చరిత్ర కారుల అభిప్రాయం. 

ఇక్కడున్న గణేశుని విగ్రహాంపై, ‘నాగ జనేయు’ అనబడే పవిత్ర దారం ఆధారాలూ, శివలింగంతో పాటు, ఆలయం చుట్టుప్రక్కల, ముక్కలై చెల్లాచెదురుగా పడిఉన్న మరికొన్ని విగ్రహాలపై కూడా, పాము ఆకారాలున్నట్లు, చరిత్రకారులు గుర్తించారు. దానిని బట్టి, సామన్యశకపూర్వం 110 నుండి సామాన్యశకం 315 వరకూ పాలించిన నాగరాజవంశం వారు, ఈ ఆలయ నిర్మాణంలో భాగమైనట్లు భావిస్తున్నారు. ఎందుకంటే, వారు పామును వారి రాజ చిహ్నంగా ఉపయోగించేవారు. అంతేకాదు, మహభారతంలో కూడా, ఈ ప్రాంతాన్ని నాగ రాజ వంశీయులు పాలించినట్లు చెప్పబడింది. కౌరవులూ, పాండవులకు గురువైన ద్రోణాచార్యునికి గురు దక్షిణగా, నాగజాతి వారు నివసించే, ప్రస్తుత నగరాలైన అహినౌరా, మీర్జాపూర్, సోన్‌భద్రా, కైమూర్ ప్రాంతాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయ శిలా శాసనాల్లో పేర్కోనబడిన ఉదయసేనకు, నాగ రాజవంశం పాలకులు నాగ సేన, వీర సేన మొదలైన వారితో పోలిక ఉంది.  నాగ వంశీయులు పాలించిన తరువాత, ఈ ప్రాంతం, గుప్త రాజుల వశమైంది. వారే ఈ ఆలయాన్ని నగర శైలిలో నిర్మింపజేసినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పురావస్తుశాఖ అధికారులు, భద్రతా కారణాల వల్ల, ఆలయానికి చెందిన 9 విగ్రహాలను, కొలకత్తా సంగ్రహాలయానికి తరలించారు. వేల సంవత్సరాల నాటి ఆ అత్యద్భుత విగ్రహాలను, ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. పవిత్రతకూ, ప్రాచీనతకూ ఈ ఆలయం నిలయంగా చెప్పవచ్చు.

Link: https://www.youtube.com/post/UgxRgOy5RR3W8OBWxoB4AaABCQ