Ads

Showing posts with label Lord Shani Jayanti. Show all posts
Showing posts with label Lord Shani Jayanti. Show all posts

08 July, 2021

శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే జ్యేష్ఠ అమావాస్యనాడు ఇలా చేయండి! Lord Shani Jayanti

 

శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే జ్యేష్ఠ అమావాస్యనాడు ఇలా చేయండి!

మన సనాతన ధర్మంలో వచ్చే ప్రతీ తిథికీ, ప్రతీ నక్షత్రానికీ, ప్రతీ రాశికీ, ప్రతీ లగ్నానికీ, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటిలో అమావాస్యా, పౌర్ణమీ, మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను, జ్యేష్ఠ అమావాస్య అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/FjCbyZL5Qfc ​]

ఈ జ్యేష్ఠ అమావాస్య రోజునే, శని జయంతిని జరుపుకుంటారు. యమధర్మరాజును సైతం మెప్పించి, తన భర్త ప్రాణాలను సంపాదించుకున్న సావిత్రి చేసిన వట సావిత్రి వ్రతాన్ని కూడా, ఈ జ్యేష్ఠ అమావాస్య నాడే ఆచరిస్తారు. శనీశ్వరుడు జన్మించిన ఈ తిథి ఎంతో మహిమాన్వితమైనది. ఈ రోజున పూజలూ, వ్రతాలూ ఆచరించడం, భక్తితో ఉపవాసం ఉండటం, పేదలకూ, పండితులకూ దానం చేయడం వంటివి, ఎంతో పుణ్యాన్ని చేకూర్చుతాయి. ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు పూజలాచరించడం ద్వారా, మోక్షం లభిస్తుందని, పురాణ విదితం. ఇంత గొప్ప, మహిమాన్వితమైన ఈ జ్యేష్ఠ అమావాస్య విశిష్ఠతలేంటి? ఈ పవిత్రమైన రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు, పొరపాటున కూడా చేయకూడని పనులేంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

మన పురాణాల ప్రకారం, శనీశ్వరుడు జ్యేష్ఠ అమావాస్య రోజున జన్మించాడు. శనీశ్వరుడు, జీవులలోని కోపం, మెదడు పనితీరు, మరియు మనశ్శాంతిని నియంత్రిస్తాడు. మనం చేసే కర్మల వలన ఏర్పడే దుష్ర్పభావాల నుండి విముక్తి పొందాలంటే, శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన కరుణను పొందాలంటే, శని జయంతి నాడు కొన్ని నియమాలను పాటించాలి. జ్యేష్ఠ అమావాస్య నాడు ఉదయాన్నే నిద్ర లేచి, నదిలో గానీ, ప్రవహించే నీటిలో గానీ, లేదా మనం స్నానం చేసే నీటిలో, సప్తగంగలనూ ఆహ్వానించి గానీ, స్నానమాచరించాలి. శని జయంతి నాడు తప్పకుండా, హనుమంతుడిని ఆరాధించాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజించడం, నవగ్రహాలను పూజించండం వంటివి చేయడం వలన, శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.

ఈ పర్వదినాన శనీశ్వరుడి ఆలయంలో నల్ల నువ్వులూ, నువ్వుల నూనె దానమివ్వడం వలన, ఆయన శాంతించి, మనపై చెడు దృష్టిని తొలగిస్తాడు. ఈ అమావాస్య నాడు మనం చేయాల్సిన మరో ముఖ్య విధి, సూర్యునికి ఆర్ఘ్యమివ్వడం. శనీశ్వరుడి తండ్రి అయిన సూర్య భగవానుడికి, రాగి కలశంలోని నీటిలో ఎర్రటి పువ్వులను వేసి సమర్పించడం వలన, ఆయన సంతోషిస్తాడు. తద్వారా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున మనం ఉపవాసం ఉండి, పేదలకు ఆన్నదానం చేయడం వలన, మరింత లబ్ది చేకూరుతుంది. మన కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అన్నదానం చేయలేని వారు, కనీసం గోమాత, శునకం, కాకికైనా ఆహారం పెట్టడం వలన, పుణ్యం లభిస్తుంది. ఈ శనీశ్వర జయంతి నాడు మన పూర్వీకులను పూజించడం వలన, వంశాభివృద్ధి కలుగుతుంది.

ఈ రోజున రావి చెట్టుకు దారాన్ని కట్టి, చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి, ఆవనూనె, నల్ల నువ్వులతో కలిపిన దీపాన్ని వెలిగించి, పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించడం వలన, దారిద్ర్యం దూరమై, సుఖాలనుభవిస్తారు. జ్యేష్ఠ అమావాస్య రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదు. ఈ రోజున ఎవ్వరి దగ్గరా అప్పు తీసుకోవడం, కొత్త వస్తువులు కొనడం, శ్రేయస్కరం కాదు. మనం ఏ పూజనైనా, ఏ వ్రతాన్నైనా, ఎంత గొప్పగా చేశామనే దానికన్నా, ఎంత భక్తితో చేశామనేది, దేవుని పరిగణనలో ఉంటుంది. ఆ రోజున మనం ఏమీ చేయలేకపోయినా, భక్తితో దేవునికి దీపం వెలిగించి నమస్కరించడం వలన, దేవుని కృపను పొందవచ్చు. శనీశ్వర జయంతి నాడు, ఆయన చరిత్రను తెలుసుకోవడం, శుభకరం. మన ఛానెల్ లోని శనీశ్వరుడి చరిత్ర, ఆయనకు భార్య వలన కలిగిన శాపం, శని జయంతి నాడు చేసే వట సావిత్రి వ్రతం యొక్క విశిష్ఠతల వీడియోల లింక్ లను, క్రింది డిస్క్రిప్షన్ లో, పొందుపరిచాను.

1. అద్భుతమైన శనీశ్వరుడి చరిత్ర! : https://youtu.be/qXPHHrAPYf8

2. శనీశ్వరుడికి భార్య ద్వారా కలిగిన శాప రహస్యం! : https://youtu.be/-gTD309WjDs

3. మహిమాన్విత ‘వట సావిత్రీ వ్రతం’ కథ! : https://youtu.be/iweHMvboCqQ

సర్వేజనా: సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgwP61vJ3ntamRlbTWR4AaABCQ