Ads

Showing posts with label Lord Dattatreya. Show all posts
Showing posts with label Lord Dattatreya. Show all posts

13 September, 2021

సహస్ర బాహువుల 'కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడిచ్చిన వరం'! Kartavirya Arjuna - Lord Dattatreya

 

సహస్ర బాహువుల 'కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడిచ్చిన వరం'!

మన పురాణాలలో, ఎన్నో శక్తివంతమైన పాత్రలున్నాయి. కఠోర దీక్షతో భగవంతుడిని మెప్పించి, ప్రత్యేక వరాలను పొందిన వారు, చాలా మంది ఉన్నారు. అలా పొందిన వరాలతో, మంచి కార్యాలను చేస్తూ, అందరి మన్ననలూ పొందినవారు కొందరైతే, అహంకారంతో విర్రవీగుతూ, అసురులుగా మారి, అంతమైనవారు మరికొందరు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/joWK5icUMrI ​]

తన తపస్సుతో శివుడిని మెప్పించి, పది తలలను పొందిన దశకంఠుడు, ముల్లోకాలలో మహావీరుడిగా పేరుగడించాడు. అటువంటి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఓడించిన వారు, చాలా తక్కువమంది మాత్రమే. వారిలో ఒకరు వాలి కాగా, మరొకరు కార్తవీర్యార్జునుడు. నారాయణాంశ సంభూతుడైన దత్తాత్రేయుడి వరప్రసాదంతో, కార్తవీర్యుడు వేయి చేతులను సంపాదించి, మహా బలవంతుడయ్యాడు. అవధూత దత్తాత్రేయుడి జననం ఎలా జరిగింది? సతీ అనసూయ త్రిమూర్తులను పుత్రులుగా కావాలని ఎందుకు కోరుకుంది? మహారాజైన కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయుడిని ఎందుకు కలిశాడు? దత్తాత్రేయుడు కార్తవీర్యుడికి పెట్టిన పరీక్ష ఏంటి, ఇచ్చిన వరాలేంటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

పూర్వం ప్రతిష్ఠానం అనే ఊరిలో, కౌశికుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పూర్వజన్మలలో చేసిన పాపం కారణంగా, కుష్టువ్యాధి సంక్రమించింది. ఆయన భార్య అయిన సుమతి, పతిని ఎంతో శ్రద్ధగా సేవిస్తూ, సకల సపర్యలూ చేస్తూ ఉండేది. ఎన్ని రకాల సేవలు చేసినా, కౌశికుడు దుర్మార్గబుద్ధితో, భార్యని మాటలతో, చేతలతో హింసించేవాడు. అయినా, సుమతి ఎలాంటి కోపాన్నీ పెంచుకోకుండా, పతినే దైవంగా భావించి, అతనిని పూజించేది. ఒకనాడు రాజమార్గంలో పోతున్న ఒక వేశ్యను చూసి, మనస్సు పారేసుకున్నాడు, కౌశికుడు. వెంటనే తన భార్యను పిలిచి, ఈ రాత్రికి నన్ను ఆవిడ దగ్గరకు తీసుకువెళ్లు. ఆమె లేకపోతే, నేను జీవించలేను. అని తన కోరికను భార్యకు తెలియజేశాడు. తన పతి కోరిక ఘోరమైనదైనా, తప్పక నేరవేర్చాలని భావించి, కౌశికుడిని బుట్టలో పెట్టుకుని, తలపై మోసుకుంటూ, ఆ వేశ్యాగృహం వైపుగా బయలుదేరింది.

ఆ దారిలో, మాండవ్య మహాముని, కర్మ ప్రారబ్ధంతో ఒక శూలానికి గుచ్చబడి, వ్రేలాడుతూ, శిక్షని అనుభవిస్తున్నాడు. సుమతి తన భర్తను తీసుకువెళుతుండగా, అనుకోకుండా ఆ మాండవ్య మునికి తగిలాడు. దాంతో, శూలం మరింతగా గుచ్చుకుని, ఆయనను బాధించింది. వెంటనే మాండవ్యముని, "సూర్యోదయం అయ్యేసరికి, నీవు ప్రాణాలు విడుతువు గాక" అని శపించాడు. సుమతి మాండవ్య ముని శాపాన్ని విని బాధతో, సూర్యోదయాన్నే ఆపివేసింది. ఆ మహాపతివ్రత శాపంతో, సూర్యుడు ఉదయించలేదు. యజ్ఞ యాగాది క్రతువులన్నీ ఆగిపోయాయి. దాంతో కలవరపడ్డ దేవతలందరూ, బ్రహ్మదేవుడి సలహామేరకు, అత్రిమహాముని భార్య అయిన అనసూయా దేవి దగ్గరకువెళ్ళి, జరిగిన విషయాన్ని తెలియజేశారు. తన శరణు కోరి వచ్చిన వారికి అభయమిచ్చి, కౌశికుడి భార్య సుమతిని సముదాయించడానికి, బయలుదేరింది.

సుమతి గృహానికి వెళ్లిన అనసూయ, సూర్యోదయం కాకపోవడం వలన కలుగుతున్న అనర్థాలను వివరించి, శాపవిమోచనం చేయమని అడిగింది. అందుకు సుమతి తన పతి ప్రాణాలను రక్షించమని వేడుకోగా, అందుకు సరేనని అనసూయ మాట ఇవ్వడంతో, తన శాపాన్ని ఉపసంహరించుకుంది. అనసూయాదేవి ఇచ్చిన మాట ప్రకారం, ప్రాణాలు కోల్పోతున్న కౌశికుడిని బ్రతికించింది. సూర్యోదయం అయిన ఆనందంతో, దేవతలందరూ అనసూయను స్తుతించి, వరం కోరుకోమన్నారు. అందుకు అనసూయాదేవి, త్రిమూర్తులైన బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ, తనకు పుత్రులుగా జన్మించే వరాన్ని ప్రసాదించమని, వేడుకుంది. దేవతలు తథాస్తు పలికారు. కొంతకాలానికి అత్రి మహార్షి ద్వారా, బ్రహ్మాంశతో చంద్రుడు, విష్ణుభగవానుడి అంశతో ద్విజోత్తముడైన దత్తాత్రేయుడు, రుద్రుడి అంశతో దుర్వాస మహర్షీ, అనసూయా దేవికి సంతానంగా కలిగారు.

విష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయుడు, యోగనిష్ఠా గరిష్టుడు. ఎన్నో సిద్ధ శక్తుల్ని సాధించి, లౌకిక విషయాల మీద వ్యామోహాన్ని వదిలి, అవధూతగా మారాడు. యోగిగా మారిన దత్తాత్రేయుణ్ణి, ముని కుమారులందరూ, నిత్యం సేవించేవారు, ఆయననే అనుసరించేవారు. ఇదిలా ఉండగా,  హైహయ వంశానికి చెందిన రాజు కృతవీర్యుడు, మరణించాడు. దాంతో మంత్రులూ, పురోహితులూ, అతని కుమారుడైన కార్తవీర్యార్జునుడిని రాజుగా చేయాలని తలచారు. కానీ, కార్తవీర్యుడు రాజ్యాన్ని పాలించే అస్త్రశాస్త్ర సామర్థ్యాలు తనకు లేవనీ, రాజ్యాన్ని వదిలి తపస్సు చేయడానికి వెళుతున్నాననీ చెప్పి, పట్టాభిషేకానికి నిరాకరించాడు. రాజ పురోహితుడైన గర్గ మహర్షి, కార్తవీర్యుడికి ఒక సలహా ఇచ్చాడు. సహ్యాద్రి పర్వతంలోని ఆశ్రమంలో నివసిస్తున్న, మహా యోగీశ్వరుడైన దత్తాత్రేయుడిని ఆరాధించమని చెప్పాడు. గర్గముని మాటలు విన్న కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయుల ఆశ్రమానికి వెళ్లి, అనేక సపర్యలు చేయసాగాడు. రాజు చేసిన సేవలకు సంతోషించిన దత్తాత్రేయుడు, ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు.

ఒకనాడు దత్తాత్రేయుడు ఒక అందమైన స్త్రీతో ప్రత్యక్షమయ్యాడు. ఆమెతో పాటు మద్యాన్ని సేవిస్తూ, సుఖించాడు. అలా చేయడం వలన, కార్తవీర్యార్జునుడికి తనపై విరక్తి కలిగి, వదిలి వెళతాడేమో అని భావించాడు, దత్తాత్రేయుడు. కానీ, కార్తవీర్యుడు ఏమాత్రం చలించక, ఆయనను మరింత భక్తితో ఆరాధించాడు. కార్తవీర్యుడి నిశ్చలభక్తికి ఆనందించిన దత్తాత్రేయుడు, ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు కార్తవీర్యుడు, "ఉత్తమమైన బుద్ధినీ, ఐశ్వర్యాన్నీ నాకు ప్రసాదించండి. నేను ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించేటట్లుగా, యుద్ధ రంగంలో నాతో సమానమైనవాడు మరొకడు లేనట్లుగా, వరాన్ని ప్రసాదించండి. శక్తివంతమైన వేయి చేతుల్ని అనుగ్రహించండి. ఆకాశం, నీరు, భూమి, పర్వతాలూ, ఇలా అన్ని ప్రదేశాలలో యధేచ్ఛగా సంచరించే ఉత్తముడైన మానవుడి చేతిలోనే వధించబడేలా, దీవించండి" అని కోరుకున్నాడు. అందుకు దత్తాత్రేయుడు తథాస్తు పలికాడు. అలా అవధూత దత్తాత్రేయుడి దగ్గర వరాలు పొందిన కార్తవీర్యుడు, రాజ్యాన్ని చేరుకుని, ఘనంగా పట్టాభిషేకం జరుపుకున్నాడు.

తన రాజ్యంలో ఎవరూ ఆయుధాలు ధరించకూడదని చాటింపు వేయించాడు. మహావీరుడైన కార్తవీర్య చక్రవర్తి, చోర, సర్ప, అగ్ని, శస్త్ర, శత్రు, భయంకర సముద్రజలాలూ, ఇలా ఎటువంటి ఆపదనుండైనా ప్రజలను రక్షించేవాడు. కార్తవీర్యుడు ఎన్నో యాగాలు చేసి, విరివిగా దానధర్మాలు చేశాడు. తన రాజ్యంలో ప్రజలందరి చేతా, దత్తయాగాలు చేయించాడు. పదితలల రావణుడిని సైతం ఓడించిన కార్తవీర్యుడు, తపస్వి అయిన పరశురాముడి చేతిలో మరణించాడు. అందుకు కారణం, పరశురాముడి తండ్రి జమదగ్ని మరణమా? కార్తవీర్యార్జునుడి సంహారం వెనుక దాగిన మరో గాధేంటి? యుద్ధరంగంలో పరాక్రమవంతులైన క్షత్రియ సంహారానికి, పరశురాముడు పొందిన ఆయుధం ఏంటి? పరశురాముడి శపథాన్ని దేవతలు ఎందుకు ఆపలేకపోయారు - అనేటటువంటి విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..