కురుకుల నాశనానికి ‘దుర్యోధనుడు’ కారణమెలా అయ్యాడు?
పంచమ వేదంగా భాసిల్లే మహాభారత ఇతిహాసంలో, గాంధారీ ధృతరాష్ట్రుల నూర్గురు పుత్రులలో, ధుర్యోధనుడు ప్రథముడు. దుర్యోధనుడి భార్య భానుమతి. భానుమతీ దుర్యోధనులకు, ఇరువురు సంతానం. కూతురు లక్ష్మణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. మహాభారత యుద్ధంలో లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడి చేతిలో మరణించాడు. కూతురు లక్ష్మణని, కృష్ణుని కుమారుడు సాంబుడు ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు. ఇక మహాభారతంలో, ధూర్యోధనుడి జీవితం మానవాళికి ఏం నేర్పిస్తుందో, అంతరంగ శత్రువులైన అరిషడ్వర్గాలకు మనిషి లొంగిపోతే ఏం జరుగుతుందో, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9Vj_dddES_k ]
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।।
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।।
గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో, కుంతీదేవి, ధర్మరాజుని ప్రసవించిన విషయం విన్న తరువాత, 12 మాసముల తన గర్భాన్ని, తన చేతులతో గుద్దుకుని, బలవంతంగా మృత శిశువుని ప్రసవించింది. ఈ విషయం విన్న వ్యాసుడు హస్తినకు వచ్చి, కోడలిని మందలించి, ఆ పిండం వృధా కాకుండా, నూటొక్క ముక్కలుగాచేసి, నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని, వాటిలో పిండము వృద్ధిచెందిన తరువాత, నూరుగురు పుత్రులూ ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా, ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై, అందునుండి దుర్యోధనుడు జన్మించాడు. తరువాత క్రమంగా, తొంభై తొమ్మిదిమంది పుత్రులూ, ఒక పుత్రిక 'దుస్సల' జన్మించారు. ఈ విధంగా గాంధారీ ధృతరాష్ట్రులు, దుర్యోధనాదులను సంతానంగా పొందారు.
దుర్యోధనుని జననకాలంలో, రాక్షసులు మిక్కుటంగా అరచారు.. నక్కలు ఊళలు పెట్టాయి.. గాడిదలు ఓండ్ర పెట్టాయి.. భూమి కంపించింది.. ప్రకృతి ప్రకంపించి, మేఘాలు రక్త వర్షాన్ని కురిపించాయి.. ఇవేగాక, అనేక దుశ్శకునములు సంభవించినట్లు, భారతంలో వివరించబడింది. ఇవన్నీ గమనించిన భీష్ముడూ, విదురుడూ, ధృతరాష్ట్రునితో, 'రాజా! దుర్యోధనుడు వంశ నాశకుడు కాగలడని, శకునములు సూచిస్తున్నాయి. ఇతని వలన కులనాశనం సంభవించగలదు. ఈ పాపాత్ముని త్యజించి, కులమును రక్షింపుము' అని సూచించారు. ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో, వాటిని పెడచెవిన పెట్టినట్లు ‘భారతంలో’ వర్ణించబడింది.
దుర్యోధనుడు అసూయకు మారుపేరు. అతడు పాండవులపై అకారణ శతృత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలం, అతనికి భయాన్ని కలిగించింది. అతణ్ణి ఎలాగైనా తుదముట్టించాలనుకున్నాడు. ఒకసారి భీముడు నిద్రిస్తుండగా, లతలతో కట్టించి, నదిలో పారవేయించాడు. సారధిచే ఒకసారి, విషనాగులతో కాటు వేయించాడు. మరి ఒకసారి, విషాన్నాన్ని తినిపించాడు. భీముడు వీటన్నిటినీ అధిగమించి, అధిక బలాన్ని సంపాదించాడు. అలా అంతఃపుర కుట్రలకు, చిన్నతనంలోనే పాల్పడ్డాడు.
జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః
జానామి అధర్మం న చ మే నివృత్తిః
‘నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నాకది చెయ్యాలనిపించదు. అధర్మం ఏమిటో కూడా తెలుసు, నాకు అదే చెయ్యాలనిపిస్తుంది. నాకు ఏది అనిపిస్తే, అదే చేస్తాను!’ శ్రీకృష్ణుడు రాయబారం నిమిత్తం హస్తినకు వెళ్ళినపుడు, దుర్యోధనుడు స్వయంగా పరమాత్ముడితో చెప్పిన ఈ మాటలు, అతడి ప్రకృతిని తెలియజేస్తాయి..
అర్జునునికి ప్రతిగా, తన పక్షంలో ధనుర్విద్యా యోధుడుండాలని, దుర్యోధనుడు భావించాడు. యుద్ధ విద్యా ప్రదర్శన సమయంలో ప్రవేశించిన కర్ణుని, అర్జునునికి ప్రతిగా, తనకు బలం చేకూర్చుకునే విధంగా, అతనికి అంగ రాజ్యం ఇచ్చి, అతడి మైత్రిని సంపాదించుకున్నాడు. ధర్మరాజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి సహించలేక, తండ్రిని ఒప్పించి, వారణావతానికి పాండవులను పంపించి, వారిని అక్కడే హతమార్చాలని పథకం వేశాడు. శకునితో కుట్ర జరిపి, పాండవులను వారణావతంలో లక్క గృహంలో ఉంచి, వారిని దహించి వేయాలని పధకం వేశాడు. కానీ, విదురుని సహాయంతో, అక్కడినుండి పాండవులు తప్పించుకున్నారు.
ద్రౌపది స్వయంవర సమయంలో హాజరైన రాజులలో, దుర్యోధనుడూ ఒకడు. ద్రౌపది అర్జునుని వరించినందుకు కోపించి, ద్రుపదునితో యుద్ధానికి దిగి, భీమార్జునుల చేతిలో పరాజితుడై, వెనుదిరిగాడు. ద్రుపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మధ్య పొరపొచ్చాలు సృష్టించి, పాండవులను తుదముట్టించాలని తలపెట్టి, కర్ణుని సలహాతో, వారిని తిరిగి హస్తినకు రప్పించాడు. భీష్ముని సలహా, కృష్ణుని ప్రోద్బలంతో, రాజ్య విభజన జరిగింది. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకుని, కృష్ణుని సహాయ సలహాలతో, రాజ్య విస్తరణచేసుకున్న పాండవుల వైభవాన్ని చూసి, ఓర్వలేక పోయాడు. మేనమామ శకుని కుతంత్రంతో, పాండవులను మాయా జూదంలో ఓడించి, వారిని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభకు ఈడ్పించి, ఆమె వలువలూడ్పించే ప్రయత్నంజేశాడు.
ధృతరాష్ట్రునినుండి, పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి వరంగా పొందారు. ఆ రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి, వారిని అరణ్యవాసానికీ, తరువాత అజ్ఞాతవాసానికీ పంపి, కష్టాలకు గురిజేశాడు. మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు, భీముని చేతిలో తొడ పగులగలదని, అతడి శాపానికి గురయ్యాడు. దుర్యోధనుని మరణం, భీముని చేతిలో ఉన్నదన్న విషయం, దానితో మరింత బలపడింది. సంజయుని ద్వారా, కిమ్మీరుని వధ వృత్తాంతం విని, భీముని పరాక్రమానికి వెరసి, అరణ్యవాస సమయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని, కొంతకాలం విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి, అవమాన పరచాలన్న దురుద్దేశంతో వచ్చి, గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో, సకుంటుంబంగా బంధీ అయ్యాడు. తుదకు ధర్మరాజు సౌజన్యంతో, భీముడి పరాక్రమంతో, ఆ గంధర్వుని నుండి విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్నికూడా అవమానంగా ఎంచి, ఆత్మహత్యకు పూనుకున్నాడు. కానీ, రాక్షసుల సలహామేరకు, ఆత్మహత్యాప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి, వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో, విరాట రాజ్యంపై దండెత్తి, అర్జునిని చేతిలో ఘోర పరాజయాన్ని చవిజూశాడు. యుద్ధకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించి, యుద్ధానికి కాలు దువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకుని, దైవ బలాన్ని జార విడుచుకున్నాడు. మాయోపాయంతో, శల్యుడు తనవైపు యుద్ధం చేసేలా చేసుకున్నాడు. తద్వారా కర్ణుని పరాజయానికి, పరోక్షంగా కారణమైనాడు. పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుని అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. యుద్ధాంతంలో, మరణ భయంతో, సరస్సులో జలస్థంభన చేసిన దుర్యోధనుడు, భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు. ఈ విధంగా కురుకుల నాశనానికి దుర్యోధనుడు, కారణమైనాడు. దుర్యోధనుని జీవితం, ప్రతివొక్కరికీ నేర్పే గుణపాఠం.. క్రోధం, దురహంకారం, ఓర్వలేనితనం, అసూయ, అధర్మం, ఎంతటివారినైనా దహించివేస్తాయి.. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే, ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే, ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. అట్టి క్రోధంవల్ల అవివేకం కలిగి, బుధ్ధి నశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. ఈ దుర్గుణాలు నశించాలంటే, ఆత్మజ్ఞానం కలగాలి. ధర్మో రక్షతి రక్షితః..
Link: https://www.youtube.com/post/Ugw0eoJq107qinYET7h4AaABCQ