Ads

Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

30 June, 2022

జీవితం ఇంతేనా? Life


జీవితం ఇంతేనా?

నీ తోటి వయస్సు వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులు ఒక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు..

నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు..

బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు, ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు..

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి, నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు..

నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండ వచ్చు గాక.. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక.. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది..

నీ లాంటి వృద్ధుడెవరో నీకు అప్పుడప్పుడూ ఫోన్ చేసి మాట్లాడుతూ, ఇంట్లో తన అవస్థలను చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం, నిన్ను తబ్బిబ్బు చేస్తుంది..

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రా భంగం చేయాలా వద్దా! అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది..

పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకుని ఉండటం దిన చర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడీ, పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో, తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే, చిన్నప్పుడు ఆలనా పాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్లు సేవలు చేసే కోడలూ.

నీ అదృష్టం బాగా లేకపోతే, అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు..

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినక పోయినా, మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చ బడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ, నిన్ను మందలిస్తూ ఉంటారు..

ప్రొద్దున్న లేచే సరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌ రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ఏదో వ్యాధి అని చెప్పటం, మొదలైనవన్నీ, జీవితంలో భాగమైపోతాయి..

నీది మరీ మధ్య తరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బును నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా? అన్న ఆలోచనతో, నీ పక్క గదిలో నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు..

ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు! ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే, ఇక నీ అవసరం తీరింది కాబట్టి.. నీ అవసరం ఇక వుండదు కాబట్టి..

ఇక్కడ తరిగింది కృతజ్ఞత, ప్రేమ, అభిమానం..

పెరిగింది కృతఘ్నత, నిర్లజ్జ, అమానుషం..

మీ చుట్టు ప్రక్కల వున్న మీకు తెలిసిన పెద్ద వారి దగ్గరకు తరచుగా వెళ్తూండండి. వారి మాటలు విసుగు లేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండండి.


ॐ శ్రీ గురు రాఘవేంద్రాయ నమః