Ads

Showing posts with label Karma. Show all posts
Showing posts with label Karma. Show all posts

02 October, 2021

కర్మ, ఫలితం, ఋణాను బంధము!

  

కర్మ, ఫలితం, ఋణాను బంధము!

తెలిసీ తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి..

[ మనిషికుండవలసిన లక్ష్యం! = https://youtu.be/laB5lI-sf2Q ]

ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే, ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు, ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు..

ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమైపోవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే, మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు..

ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయంటే..

మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనంగానీ, వస్తువులుగానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా, ఆ ఋణం తీర్చుకోవడానికి, ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గానూ తారసపడతారు.

ద్వేషం కూడా బంధమే.. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి, మనల్ని హింసించే యజమానిగా, లేదా సంతానంగా, ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు..

మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా, మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు..

మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి, ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో, ఎదురవుతారు..

[ నిజమైన సంపద! = https://youtu.be/sX5tx83D7Ww ]

ఉదాహరణకు, ఒక జరిగిన కథ..

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు, ఉదయం ఆరు నుంచి, రాత్రి పది గంటల దాకా, గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు.

కానీ, తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని, సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

తన సంపాదనతో, ఇద్దరు కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.

ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి, ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు, ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే, ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ, వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని..

అంతే కాక, మనకు తెలిసీ తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా, మనకు బంధాలవుతాయని నిరూపించే ఒక కథ..

ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్తకుండీలో, తిని పారేసిన విస్తరాకుల కోసం, అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు.

అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు.. 'స్వామీ, ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి? అని..

'ఈ పిల్లలంతా, వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు.. అందుకే వారు ఈ జన్మలో, ఆహారం కోసం పరితపిస్తున్నారు..' అని స్వామి జవాబు చెప్పారు..

'నీటిని దుర్వినియోగం చేస్తే, ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా, దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది' అన్నారు మహర్షి..

ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ, గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది? అని అడుగగా, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉందని చెప్పారు..

అప్పుడు మలయాళ స్వామి వారు, 'నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచీని మోయిస్తే, వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది' అని అన్నారు.

ఇలాంటివి మనము తెలిసీ తెలియక చాలా చేస్తూ ఉంటాం.. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో, లేదా మరే ఇతర కారణాల ద్వారానో, ఉచితంగా స్వీకరించిన వన్నీ, కర్మ బంధాలై, జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి..

కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే, నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో, ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మ బంధాలవుతాయని తెలియక, మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము..

ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే, అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం.. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా, దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప, మాయం కాదు..

ఒకతను వెళ్తూ, ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టుముట్టడం చూశాడు. మరికొంత దూరం వెళ్ళాక, ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూశాడు. అతను ఆగి, రాజుని సందేహంగా అడిగాడు. 'రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకీ, మీకూ గల తేడా ఏమిటీ?'

అందుకా రాజు నవ్వి జవాబు చెప్పాడు. 'తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ, బంధితుడు. అతను పారిపోకుండా, వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛగల వాడిని. ఈ రక్షక భటులు, నన్ను కాపాడటానికి, నా చుట్టూ ఉన్నారు. నేను వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతారు'. ఆ రక్షక భటులు కర్మలు. దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి, అతని నేరాలకి తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు, స్వార్ధ కర్మల్లాంటి వారు. స్వార్ధ కర్మలు మనల్ని బంధిస్తాయి. కానీ, రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు, నిస్వార్ధ కర్మల్లాంటి వారు. నిస్వార్ధ కర్మలు, మనిషిని రక్షిస్తాయి తప్ప, బంధించవు.

త్వరగా పెరిగే ఓ లత, ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని, ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది. 'చూడు, నేను ఎంత త్వరగా పెరిగి, నిన్నంతా అల్లుకున్నానో? మరి నువ్వో? ఓ అంగుళం కూడా పెరగలేదు'..

ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. 'వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి. నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను.'

[ పరిపూర్ణ జీవితం! = https://youtu.be/yt7pEUOPVcw ]

హిందూ సనాతన ధర్మం, ఆ కొబ్బరి చెట్టులాంటిది. అలాంటి హిందూ మతానికి, కర్మ-జన్మలు మూలస్ధంభాలు..

ధర్మో రక్షతి రక్షితః!

22 February, 2021

కర్మ?! KARMA


కర్మ?!

కర్మ అంటే ఏమిటి? దాని స్వభావం ఏమిటి? సాధారణంగా ఈ ప్రశ్నకు ‘మంచీ, చెడు’ కర్మలంటే ఏమిటో నిర్వచిస్తూ జవాబు చెప్పటం పరిపాటి. కానీ, కర్మ అనేది అంతకంటే చాలా లోతయిన విషయం. కర్మలలో చాలా రకాలు ఉంటాయా? ఉంటే, మానవుని మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది?

[ వనదేవతలు 'సమ్మక్క సారక్క'ల చరిత్ర! = https://youtu.be/p7n8ABOEXZQ ]

‘నా జీవితం’ అని మీరు చెప్పుకునేది ఏమిటో తెలుసా? కొంత మొత్తం జీవశక్తి, దాంతో పాటు దాన్ని నియంత్రించేందుకు కావలసిన కొంత సమాచారం. ఈ సమాచారాన్ని, ఈ కాలపు పరిభాషలో చెప్పాలంటే, ‘సాఫ్ట్ వేర్' అనవచ్చు. కొంత మొత్తం జీవ శక్తితో, కొంత సమాచారం అనుసంధానమై, జోడించబడి ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఏర్పడే సాంకేతిక పరిజ్ఞానం వల్ల నడిచే వ్యవస్థే ‘మీరు’. మీలో అమర్చి ఉన్న సమాచారం ఎలాంటిదో, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది.

మీ పాత సంస్కారాలు, మీరు పుట్టిన సమయానికి ఎంతో కాలం ముందునుంచే ఏర్పడి వస్తూ ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఉన్న మీ అవగాహనను బట్టి, మీ తల్లిదండ్రులెలాంటి వారూ, కుటుంబం ఎలాంటిదీ, ఎలాంటి విద్యా బుద్ధులు అలవడ్డాయి, ఎలాంటి మత పరమైన, సాంఘిక పరమైన నేపథ్యం మీకు లభించిందీ, ఎలాంటి సాంస్కృతిక సంప్రదాయాలలో పెరిగారూ.. ఇలాంటి విశేషాలు మాత్రమే, మీ వ్యక్తిత్వాన్ని రూపు దిద్దే సమాచారం అని మీరు భావించవచ్చు..

ఒక వ్యక్తిలో అమరిక చేయబడ్డ మొత్తం సమాచారం ఎలాంటిదో, దాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం, విశిష్టతలూ ఏర్పడతాయి. ఆ సమాచారం అంతటినీ కలిపితే, అదే 'కర్మ' అవుతుంది. దీన్ని సంప్రదాయికంగా, ‘కర్మ’, లేక ‘కర్మ శరీరం’, లేక 'కారణ శరీరం' అంటారు. జన్మ ఏర్పడటానికి కారణం ఇదే..

కర్మలలో రకాలు..

కర్మ అనే ఈ సమాచారం, రక రకాల స్థాయిలలో ఉంటుంది. ఇందులో ఉన్న వాటిలో కొన్ని, మనం ఇప్పుడు చర్చిస్తున్న విషయానికి సంబంధించినవి కావు. మనకు విషయం అర్థమయ్యేందుకు, ఈ క్రింది రెండు రకాలూ చాలు..

1) సంచిత కర్మ

2) ప్రారబ్ధ కర్మ

మొదటిది 'సంచిత కర్మ'. ఇది మన పూర్వ కర్మలన్నీ రాశి పోసి పడేసిన గిడ్డంగి. జీవ పరిణామానికి తొలి దశ అయిన ఏక కణ జీవి దశ నుంచీ.. ఆ మాటకొస్తే, అంతకంటే ఇంకా ముందున్న అప్రాణి దశ నుంచీ పోగుపడుతూ వస్తున్న కర్మల రాశి, 'సంచిత కర్మ'. అప్పటి నించి వచ్చిన సమాచారమంతా, ఇందులో భాగం. మీరు కళ్ళు మూసుకుని, మీలోకి మీరు ధ్యాసగా చూసుకుంటే చాలు.. ఈ బ్రహ్మాండ తత్త్వం అంతా తెలుసుకోగలరు. అలా తెలుసుకోవటానికి, మీ మేధాశక్తినంతా ఉపయోగించనక్కర్లేదు. బ్రహ్మాండ తత్త్వానికి సంబంధించిన సమాచారం అంతా, మీ శరీర నిర్మాణంలో ఇమిడే ఉందిగనుక, సృష్ట్యాది నుంచీ సమస్త సమాచారాన్నీ నింపుకుంటూ వస్తున్న గిడ్డంగి మీది. అదే మీ 'సంచిత కర్మ'. కానీ, మీరు నేరుగా గిడ్డంగిలో ఉన్న సరుకుతో, చిల్లర వ్యాపారం చేయలేరు. చిల్లర వ్యాపారం చేసుకునేందుకు, చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకోవాలి.

ఈ జన్మకు మాత్రమే సరిపడే (సరుకు ఉన్న) దుకాణాన్ని, 'ప్రారబ్ధం' అంటారు. 'ప్రారబ్ధ కర్మ' అంటే, ఈ జన్మ కోసం మాత్రమే కేటాయించిన సమాచారపు మోతాదు మొత్తం. మీ జీవితం ఎంత చురుకుగా, ఎంత క్రియాశీలతతో సాగుతున్నదో, దాన్ని బట్టి, తనకు ఈ జన్మకు కావలసినంత సమాచారాన్ని, తనే కేటాయించుకుంటుంది. సృష్టి కరుణామయమైన దృక్పథంతో సాగుతుంది. మీరు ఇంతవరకూ పోగు చేసుకున్న కర్మల రాశి మొత్తాన్నీ, ఒకే విడతలో మీకిస్తే, అది మోయలేక మీరు క్రుంగి, కృశించి, నశిస్తారు. ఇప్పుడే, జనంలో చాలా మందికి, ఒకే ఒక్క జన్మలో, 30-40 సంవత్సరాల కాలంలో పోగయిన జ్ఞాపకాల బరువే, మోయరానిదై క్రుంగదీస్తుంది. ఇక అంతకొక నూరు రెట్లు ఎక్కువ జ్ఞాపకాల బరువు వాళ్ళ నెత్తి మీద వేస్తే, వాళ్ళు అసలే బ్రతకలేరు. అందుకే ప్రకృతి, వాళ్ళు ఒక్క జన్మకు మోయగలిగినంత పూర్వ జ్ఞాపకాల బరువును మాత్రమే, వాళ్ళకు ప్రారబ్ధ కర్మగా కేటాయిస్తుంది.

కర్మ: సాధకుడి జీవితంలో దాని పాత్ర..

మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారంటే, మీరొక ప్రతిజ్ఞ చేస్తున్నట్లు. ‘నేను నా చరమ గమ్యాన్ని అతి త్వరగా అందుకోవాలనే వేగిరపాటులో ఉన్నాను’ అని. దానికోసం నూరు జన్మలు గడపటం మీకు ఇష్టం లేదు. పైగా, అలా నూరు జన్మలు గడిపితే, ఆ నూరు జన్మలలో మరింత కర్మ ఫలం పోగై, దాన్ని వదిలించుకోవటానికే, మరో వెయ్యి జన్మలు ఎత్తవలసి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, మీ ప్రస్థానం వేగం పెంచాలని మీ కోరికగనక, ఆధ్యాత్మిక ప్రక్రియలను ఆరంభించి, నిర్దిష్టమైన పద్ధతిలో దీక్షా స్వీకారం చేస్తే, జీవితంలో ఆధ్యాత్మిక సాధన లేకుండా లభించని కొత్త పార్శ్వాలు, మీ ముందు ఆవిష్కృతమౌతాయి. మీకు ఆధ్యాత్మిక ఆసక్తి ఏమీ లేకపోతే, మీ జీవితం కొంత ప్రశాంతంగా గడుస్తుంది. నిజమే, కానీ అది నిర్జీవమైన జీవితం అవుతుంది. అది జీవ స్థితి కంటే, మృత్యు స్థితికి దగ్గరగా ఉంటుంది. మీలో ఉన్న జీవాన్ని కదిలించి, ఊపివేసే కుదుపులేవీ లేకుండా, మీరు అనాయాసంగా కాల వ్యయం చేసి, వెళ్ళి పోతారన్న మాట.

చాలా మందికి మరొక దురభిప్రాయం కూడా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారంటే, ఇక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఇంకా జీవితం నిరాటంకంగా సాగిపోతుందీ అని. మీరు కొన్ని మనసుకు హాయిగా ఉండే నమ్మకాలూ, విలువలూ అలవరచుకుని, ఒక దిశలో మాత్రమే ఆలోచించటం మొదలుపెడితే, అంతా నిర్మలంగానూ, విస్పష్టంగానూ కనిపిస్తుంది. కానీ, మీరు నిజంగా ఆధ్యాత్మిక మార్గం పట్టుకున్నారంటే మాత్రం, ఏదీ అంత స్పష్టంగా కనిపించదు. అంతా అలికివేసినట్లు, అస్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఎంత వేగంగా పురోగమిస్తే, అస్పష్టత అంత ఎక్కువవుతుంది.

ఉదాహరణకు, మనము ఓక వూరు నుండి వేరే వూరు వెళుతున్నాము. ఆ గమ్య స్థలం దాదాపు, 450 కిలోమీటర్లు. సాధారణంగా, ఆ ప్రయాణానికి అయిదు గంటలు పడుతుంది. రోడ్డు మీద అయిదు గంటలు కారు నడుపుతూ వెళ్ళే ఉద్దేశ్యం లేదు. అందుకే, వేగం పెంచేశాను. దాదాపు గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వెళ్ళాం. మా మార్గంలో వచ్చే గ్రామ సీమలు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవి. నేనూ ఆ ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ వెళ్ల వచ్చనుకున్నాను. కానీ, వేగంగా కదులుతున్న దృశ్యాలను కళ్ళు తిప్పి చూద్దామని ఎంత ప్రయత్నించినా, ఆ గ్రామ సీమలన్నీ, అతి వేగంగా, అస్పష్టంగా, దృశ్యాదృశ్యంగా కదిలి పోయాయి. ఏమీ కనిపించలేదు. అసలు నా ముందున్న రోడ్డు మీద నుంచి, ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లించ లేకపోయాను. మంచు కూడా కురుస్తుంది. విపరీతమైన వేగంతో ప్రయాణం చేశాం.

కనుక, మీరు ప్రయాణ వేగం పెంచిన కొద్దీ, చుట్టూ ఉన్నవన్నీ అలికినట్లూ, అస్పష్టంగా అయిపోతాయి. మీరు చేస్తున్న పని మీది నుంచి, కొన్ని క్షణాలు కూడా దృష్టి మళ్లించటం కుదరదు. గ్రామ సీమలన్నీ కన్నుల పండుగగా చూసుకుంటూ వెళ్లాలంటే, మీరు నిదానంగా, నిశ్చింతగా వెళ్ళాలి. మీరు గమ్య స్థానం తొందరగా చేరాలనుకుంటే మాత్రం, వేగం వీలైనంత ఎక్కువ పెంచాలి. అప్పుడిక మీరు ఏదీ చూడలేరు. ముందుకు పోతూ ఉంటారంతే..

ఆధ్యాత్మిక మార్గమూ అలాంటిదే.. మీరు నిజంగా ఆ మార్గం పట్టారంటే, మీ చుట్టూ అంతా కోలాహలమే, గందరగోళమే.. కానీ, ప్రయాణమంటూ సాగుతున్నదిగనుక ఫర్వాలేదు. ఈ వేగం మీకు సౌకర్యంగా లేదనుకుంటే, జీవ పరిణామ వేగం ఉండనే ఉంది. ఆ నత్త నడక వేగంతో, ఓ పది లక్షల సంవత్సరాలు పడితే పడుతుంది గమ్యం చేరటానికి..

ప్రతి సాధకుడూ, ముందే నిర్ణయించుకోవాలి.. తను నిదానంగా, కులాసాగా, దోవంతా చూసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాడా? లేక అతి త్వరగా గమ్యస్థానం చేరాలని, ఆతురతలో ఉన్నాడా? అని..

యతో ధర్మస్తతో జయః

Link: https://www.youtube.com/post/UgyzVNtPpdHSWqhxT5l4AaABCQ