Ads

Showing posts with label How to view god. Show all posts
Showing posts with label How to view god. Show all posts

31 January, 2021

భగవంతుని దర్శనం కావాలంటే ఏంచేయాలి?! How to view god?!


భగవంతుని దర్శనం కావాలంటే ఏంచేయాలి?! 

భగవంతుని చూడాలంటే, రోజూ ఎంత సమయం పూజ, జపం చేయాలి? ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఏ మంత్రాన్ని ఎంత సాధన చేయాలి? అని కొంతమంది అడుగుతూ ఉంటారు.. మరికొంతమంది, దేవుడుంటే చూపించండి.. దాని కోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం, చూపించగలరా? అనికూడా ప్రశ్నిస్తుంటారు.. ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం..

[ వివేకానందుడి జీవితం ఊహాతీతం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/3xwTu3Y_7ZM ]

ఒకసారి వివేకానంద స్వామి, తన గురువయిన 'రామకృష్ణ పరమహంస'ను కూడా ఇలాగే, 'దేవుడున్నాడా?' అని, మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు.. దానికి రామకృష్ణ పరమహంస గారు 'దేవుడున్నాడు' అంటూ, ప్రశాంతంగా సమాధానమిచ్చారు.. దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవటంతో, మీరు చూశారా? అంటూ, మరొక మొండి ప్రశ్న వేశారు.. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చిరునవ్వుతో, 'దేవుడిని చూశాను.. చూస్తున్నాను.. నిన్నెలా చూస్తున్నానో, ఆయననూ అలాగే చూస్తున్నాను' అన్నారు..

దానికి వివేకానందులు, 'మరి నేను చూడాలంటే ఏమి చేయాలి?' అని అడిగారు గురుదేవులను.. గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి, ప్రక్కనున్న నీటి తొట్లో ముంచి, ఒక నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదలి పెట్టారు.. తర్వాత ప్రశాంతంగా వివేకానందులను చూస్తూ, 'నీకు ఇప్పుడేమనిపించింది?' అని అడిగారు..

గురుదేవా మీరు నీటి తొట్టెలో నన్ను ముంచినప్పుడు, 'ఇంకొక్క క్షణం గాలి లేకుంటే, నేను బ్రతకలేనని భయంవేసింది. ఒక్క శ్వాస తప్ప, ఇంకేమీ అవసరం లేదనిపించింది' అన్నారు వివేకానందులు..

వెంటనే గురుదేవులు వివరిస్తూ, 'శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి, నీవు లేకుంటే నేను బ్రతకలేననే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం, ఆయన దర్శనమవుతుంది' అని వివరించారు పరమగురువు..

అంత సాధన చేయాలి భగవద్దర్శనం కోసం. కానీ మనమో, కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనపడాలంటే ఎలా?!

'స్వామీ నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను. మిగతా సమయంలో నా బుద్ధి అలా.. అలా.. గాలికి తిరిగి, చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది. మరి నువ్వు నాకు కనపడతావా?' అంటే, ఆయన నీకెలా కనపడతారు? నీకు భగవద్దర్శనం కావాలంటే, ప్రతీ క్షణం ఆయన యందే నీ మనస్సు లగ్నం అయ్యి ఉండాలి. నువ్వు భౌతికంగా ఏ పనిలో ఉన్నా, నీ చిత్తమంతా ఆయన స్మరణలోనే ఉండాలి. అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతీ క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతిక్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ చేయనక్కర లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది.

అందుకే వివేకానందులవారన్నారొక చోట.. నీ పూజలు జపతపాలు, సాధనలూ ఏవీ భగవంతుని దర్శింపజేయలేవు.. కేవలం ఆయన కరుణతప్ప.. కనుక, మనం చేసేవి బుద్ధిగా, సక్రమంగా చేస్తూ వుంటే, మన మనస్సు పవిత్రమై, ఆయనను వదలి వుండలేని ఆర్తి మనలో కలుగుతుంది.. అప్పుడు లేగదూడ పిలుపును విన్న గోమాతలా, పరుగు పరుగున ఆయనే వస్తాడు.. మనకెందుకు తొందర?!

Link: https://www.youtube.com/post/UgwJxyOFHDJnqfiQAxt4AaABCQ