Ads

Showing posts with label How to Talk to God. Show all posts
Showing posts with label How to Talk to God. Show all posts

07 January, 2022

'ప్రార్థన' - భగవంతుడితో సంభాషణ! How to Talk to God

 

'ప్రార్థన' - భగవంతుడితో సంభాషణ!

మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం, సహజం. ధనం ధర్మంగా సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవచ్చు. అంతులేని కోరికలు, గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ధనం, ఇంధనంలా దహించుకుపోతూంటుంది. జీవితంలో ఈ విషయం, ప్రతి మనిషికీ, ఏదో ఒక రోజు తప్పనిసరిగా అర్థం అవుతుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dtTEMWXYWHs ]

అప్పుడు.. ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న జ్ఞానం కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస, ఆ సమయంలో మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి, గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై, ఒక ఆవేదనా రూపమై, చెలరేగుతుంది. అదే 'ప్రార్థన!'. పూర్తి వివరణ తెలుసుకోవడానికి, ఈ వీడియోను చివరిదాకా చూడండి..

మన హృదయాన్ని దైవం ముందు ఆవిష్కరించుకోవడాన్ని, ప్రార్థన అన్నారు. అది ఏ గ్రంథం లోనిదైనా కావచ్చు. శ్లోకం కావచ్చు, పద్యం గానీ, పాట గానీ కావచ్చు. మాటలే లేని మౌన ధ్యానమూ కావచ్చు. భగవంతుడితో భక్తుడు జరిపే సంభాషణ, ప్రార్థన. ప్రార్థన మనిషి జీవితంలో, ఆలోచనల్లో భాగం. ప్రార్థన మన శ్వాస వంటిదే. కవులు తమ కావ్యారంభంలో, ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. తమ కావ్యాలకు యశస్సూ, పండితాదరణా కావాలని కోరుకుంటారు. కావ్యావతారికల్లో ఇష్టదైవాన్ని, తమ ప్రభువులకు విజయ పరంపర కలిగించమని ప్రార్థిస్తారు. రాజాశ్రయం కోరని పోతన, 'శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్‌' అని అన్నాడు. అంటే, మోక్షం కోసం రాస్తున్నానని, విన్నవించుకున్నాడు. భక్త రామదాసు కీర్తనల్లో, ఆర్తి, ప్రేమ, కోరిక కనిపిస్తాయి. వీటిలోంచి విన్నపం పుడుతుంది. అదీ ప్రార్థనే. అధికారికి విన్నవించుకునేటప్పుడు, అతడి విశ్రాంతి సమయం చూసుకుని, మనోభావం, చిత్తవృత్తీ గ్రహించి మరీ వ్యవహరిస్తారు. అలాగే భగవంతుడికీ షోడశోపచారాలు చేసి, కొంతసేపు కీర్తిస్తారు. నీ సేవకుడినంటూ దాసోహం చేస్తారు.

కష్టాల్లో ఉన్నప్పుడూ, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడూ, కొందరికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు కష్టాలు తొలగించమని, ప్రార్థిస్తారు. మొసలి వల్ల తన ప్రాణం పోవడం నిశ్చయం అనుకున్న గజేంద్రుడు, 'నా బలం నశించిపోతోంది. ధైర్యం తరిగిపోయింది. ప్రాణాలు పోతున్నాయి. వచ్చి రక్షించు!' అని శ్రీహరిని ప్రార్థించాడు. నిత్య జీవితంలో సంకటాలు ఎదురైనప్పుడూ, కోరికలు నెరవేరనప్పుడూ, ఏదైనా ఆశించినప్పుడూ, దైవాన్ని ప్రార్థించడం పరిపాటి. కానీ, ప్రార్థనను జీవితంలో భాగంగా చేసుకోవాలి.

రామకృష్ణ పరమహంస, ప్రతినిత్యం తాను భగవంతుడితో మాట్లాడుతున్నానని చెప్పేవారు. నరేంద్రుడు ఆయన దగ్గరకు వెళ్ళి, తన సమస్యలు చెప్పి, తన కష్టాలు తీరేలా జగన్మాతను ప్రార్థించమని అర్థించాడు. రామకృష్ణులు, 'నువ్వే ప్రార్థించు. అమ్మ నీ మొర ఆలకిస్తుంది' అని అన్నారు. నరేంద్రుడు ఆలయానికి వెళ్ళి, కళ్లు మూసుకుని దేవిని ప్రార్థిస్తుంటే, ఆ శక్తి స్వరూపిణి తన కళ్ల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆ సమయంలో ఆయనకు తన కష్టాలూ, కన్నీళ్లూ గుర్తుకు రాలేదు. ఆ తల్లిని భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రసాదించమని కోరుకున్నాడు. దేవి అంతర్ధానమయ్యాక, మళ్ళీ ప్రాపంచిక విషయాలు గుర్తుకు వచ్చాయి. తన కోరిక చెప్పుకోలేకపోయానని బాధపడ్డాడు. ఇలా మూడుసార్లు జరిగింది. సమస్యలూ, కష్టాలూ, సంక్షోభాలూ, అందరి జీవితాల్లోనూ ఉంటాయి. ఎవరికి వారే, వాటిని పరిష్కరించుకోవాలి. అందుకు అవసరమైన శక్తిని ఇవ్వమని మాత్రమే, భగవంతుని ప్రార్థించాలి.

ప్రార్థనలో హృదయశుద్దీ, భగవద్విశ్వాసం ముఖ్యం. నమ్మకం లేనప్పుడు, ప్రార్థన సాధ్యం కాదు. సర్వాంతర్యామి మనముందు నిలబడి, మనం చెప్పేది శ్రద్ధగా వింటున్నట్లు, నమ్మాలి. దైవాన్ని నిరాకారుడిగానూ, నిర్గుణుడిగా కూడా ప్రార్థించవచ్చు. దైవాన్నే గాక, త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువునూ ప్రార్థించవచ్చు. ప్రార్థన వల్ల అజ్ఞానికి జ్ఞానం, పిరికివాడికి ధైర్యం, కష్టాల్లో ఉన్నవాడికి ఓదార్పూ లభిస్తాయి. ప్రార్థనవల్ల, మనలోని అహంకారం నశిస్తుంది, సాత్వికత పెంపొందుతుంది, ఆత్మబలం ఇనుమడిస్తుంది, మనసు ప్రక్షాళనమవుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, శాంతి సహనాలు వృద్ధి చెందుతాయి. ప్రార్థించే సాధకుడికి ప్రశాంత జీవనశైలి అవసరం. ప్రార్థన మన జీవన విధానంలో మార్పును తీసుకువస్తుంది. ప్రార్థించేవారికి, శరణాగతి ముఖ్యం. ధర్మవిరుద్ధమైన, న్యాయ ప్రతికూలమైన ప్రార్థనలు ఎన్నటికీ ఫలించవు. సాధకుడికి ధార్మిక వర్తనం ముఖ్యం. యోగ్యమైన ప్రార్థన, ఎన్నటికీ వ్యర్థం కాదు.

వ్యక్తిగత క్షేమం గురించి కాక, రుషులూ, మహనీయులూ, లోక కల్యాణం కోసం ప్రార్థించారు. సకల జనులకూ శుభం కలగాలనీ, అన్ని లోకాలూ క్షేమంగా ఉండాలనీ ప్రార్థించారు. సగుణారాధన విశ్వసించని బ్రహ్మసమాజం వంటి సంస్థల్లో, ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనమూ, నిర్భాగ్యుల కోసం, బలహీనుల కోసం ప్రార్థించాలి! పరుల సుఖాలనే మన సుఖమనీ, విశ్వశ్రేయస్సే మనకూ శ్రేయోదాయకమనీ, బుద్ధిగా జీవించాలనీ, త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే, 'ప్రార్థన!'.

భగవంతుడు మనిషికి అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం, గుండెల్లో ఆరడి చేస్తూనే ఉంటుంది. అందుకు కారణం, ఏదో ఒకమూల స్వార్థ పిశాచం పట్టి పీడిస్తూ ఉండడం వల్లే, అలా మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో, శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు. తక్కినదంతా, ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. ఆ మాట గీతాచార్యుడు చాలా స్పష్టంగానే వ్యక్తపరిచారు. అయినా, 'అజ్ఞానం, అహంకారం, మమకారం' అనే ఈ మూడూ ఏకమై, మనలను పెడదారికి ఈడుస్తూ ఉంటాయి. అలా జరగకుండా, మనస్సును నిర్మలంగా ఉంచమనీ, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమనీ, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమనీ, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే, నిజమైన 'ప్రార్థన!'. ఆ ప్రార్థన సన్నని వెలుగై, మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను, వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారి దీపమై, వెలుగును చూపాలని అర్థించాలి. 'అందరూ బాగుండాలి.. అందులో మనమూ ఉండాలి' అనే భావనతో, జీవనం కొనసాగించాలి. అదే మనం చేయవలసిన 'ప్రార్థన'!

కృష్ణం వందే జగద్గురుం!

[ మంచిమాట వీడియోలు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gbq-DusM1YjHrgyBxuhCXRi ]

Link: https://www.youtube.com/post/UgkxzauIt-imaloF5GDQDjs2Nzrlf7N9uuXK