Ads

Showing posts with label History of holy Saraswati River. Show all posts
Showing posts with label History of holy Saraswati River. Show all posts

11 October, 2021

ఎవరి శాపంవల్ల ‘సరస్వతీ దేవి’ నదిగా మారింది? History of holy Saraswati River

 


ఎవరి శాపంవల్ల ‘సరస్వతీ దేవి’ నదిగా మారింది?

ప్రపంచాన్ని శాసించేది జ్ఞానం. ఆ జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతీ దేవి. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు భార్యగా, చదువుల తల్లిగా, పూజలందుకుంటున్న తల్లి సరస్వతీ మాత. తెల్లని కమలంపై, శ్వేతవర్ణ వస్త్రాలతో, వీణను మీటుతూ, ప్రశాంత వదనంతో, శోభాయమానంగా విరాజిల్లే సరస్వతీ, రాక్షస సంహారిణి కూడా.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ziecu5wQhwI ​]

శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించి, సకల లోకాలనూ కాపాడిన ఆదిపరాశక్తి అంశ. శుంభ అంటే చెడు ఆలోచనలను కలిగించేవాడు, నిశంభుడు అంటే, జ్ఞాపకశక్తిని పొగొట్టేవాడు. మనలో కలిగే చెడు ఆలోచనలను తొలగించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే తల్లి, జ్ఞానాంబిక. అటువంటి సరస్వతీ దేవి, హంస మరిము నెమలిని వాహనాలుగా ఏర్పరుచుకోవడం వెనుక దాగిన రహస్యాలేంటి? ఎవరి శాప ప్రభావంచేత, సరస్వతీ దేవి నదిగా మారింది? సరస్వతీ దేవి ఆరాధన ఎందుకంత ప్రత్యేకం - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి ।
వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ।।

సరస్వతి దేవి సర్వచైతన్య స్వరూపిణి. విశ్వానికి ముందే ఉంది కనుక, ఆమె ఆద్య. జ్ఞాన రూపిణి కనుక, విద్య. గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ అనేవి, వేదమాత యొక్క నామాలు. ఈ వేదమాత, ప్రాత:కాలంలో గాయత్రిగా, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యాకాలంలో సరస్వతిగా, మనందరిచే ఉపాసించబడుతుంది. వేదమాతకు మూడు పేర్లున్నా, శక్తి మాత్రం ఒక్కటే. ఈ అనంత విశ్వంలో, నిరంతరం ప్రసరిస్తూ ఉన్న ప్రాణశక్తి, సరస్వతిగా, ప్రపంచంలోని ప్రాణులను కాపాడేది, గాయత్రిగా. సృష్టికి కారణం కాబట్టి, సావిత్రిగా పిలువబడుతోంది.

శ్రీ బ్రహ్మ వైవర్తన పురాణంలో, జ్ఞానరూపిణి అయిన సరస్వతి, నదిగా మారడం వెనుక గల కారణం, వివరించబడి ఉంది. ఒకనాడు గంగా, సరస్వతీ మధ్య వివాదం జరగడంతో, ఒకరినొకరు శపించుకున్నారు. ఆ ప్రభావం చేతనే, భూలోకంలో నదులుగా మారి, మానవుల పాపాలను కడుగుతున్నారు. గంగా దేవి నదిగా మారి, భగీరథుడి తపస్సుతో భూలోకానికి చేరి, మనందరికీ పుణ్యగతులను కలిగిస్తోంది. లయకారకుడి శిరస్సునచేరి, పవిత్రురాలైంది. సరస్వతీ దేవి, గంగ శాపంతో పుణ్యనదిగా మారి, భరతఖండంలో ప్రవహిస్తోంది. తరువాత పవిత్రతను పొంది, బ్రహ్మదేవుడికి భార్యగా మారింది. సరస్వతీ దేవి, జ్ఞాన ప్రదాయిని. ఆమె వాహనాలు, హంస, మయూరం. హంస శబ్ద శక్తికీ, ప్రాణ శక్తికీ సంకేతం. యోగశాస్త్రంలో శ్వాసకు హంస అనే పేరుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే రెండు రెక్కలతో కూడిన ప్రాణశక్తిని, హంస అంటారు. ఊపిరి మనకు మూలాధార చక్రం నుంచి కదిలివచ్చి, శబ్దరూపంలో వెలికి వస్తుంది. ఆ ప్రాణశక్తి, వాయురూపంగా, శబ్దరూపంగా వెలికి వచ్చేటప్పుడు, పర, పశ్యంతి, మధ్యమా, వైఖరి అనే నాలుగు రూపాలతో వస్తుంది. ఆ ప్రాణశక్తిని అధివసించి ఉంటుంది, శబ్దశక్తి. అందుకే, శబ్దశక్తి సరస్వతి, ప్రాణశక్తి హంస.

హంసను విచక్షణకు సంకేతంగా భావిస్తుంది, మన సంస్కృతి. ఎందుకంటే, హంస పాలలో నీటిని వేరుచేయగలిగే గొప్ప శక్తి కల ప్రాణి. అలాగే, మనం కూడా విద్య నుండి కేవలం మంచి మాత్రమే గ్రహించాలి. ఇక సరస్వతీ దేవి మరో వాహనం, మయూరం. దీనిని రాక్షస సంహర సమయంలో ఉపయోగించారు, అమ్మవారు. నెమలి, చిత్రాగ్ని. అనేక రంగులతో కూడి ఉండే కాంతి శక్తి, అగ్ని స్వరూపం. ఇది ఒక సంవత్సరంలో, మారుతున్న రుతువులకు సంకేతం. అందుకే, ఇది కాలాగ్ని, యజ్ఞాగ్ని. మయూరవాహనంపై ఉన్న అమ్మవారు, యజ్ఞఫలప్రదాయిని, యజ్ఞస్వరూపిణి. సరస్వతి తత్త్వం, శుద్ధ సత్త్వ గుణం. అంటే, రజోగుణం, తమోగుణంలోని దోషాలు లేనటువంటింది. సరస్వతీ ఆరాధికులు, సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి. సత్యమూ, శౌచమూ, అహింసా వంటి పవిత్రమైన పద్ధతులను పాటిస్తూ, వాక్కును నిగ్రహించుకోవాలి.

సరస్వతీ దేవి అష్టాక్షర మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించేవారు, బృహస్పతితో సమానమైన పండితులవుతారు. కవిత్వశక్తినీ, వాగ్వైభవాన్నీ ప్రసాదించే పరమపవిత్రమైన సరస్వతీ మంత్రాన్ని, మొదటిసారి నారాయణుడు, గంగాతీరంలో వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. తరువాత ఇదే మంత్రాన్ని భృగుమహర్షి, పుష్కర క్షేత్రంలో, సూర్యగ్రహణకాలంలో శుక్రుడికి ఉపదేశించగా, మారీచ మహర్షి, అదే పుష్కర క్షేత్రంలో, చంద్రగ్రహణ కాలంలో, బృహస్పతికి ఉపదేశించాడు. తరువాత బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడి ద్వారా, తిరిగి భృగుమహర్షి ఈ మంత్రాన్ని ఉపదేశం పొందాడు. తరువాత ఎందరో మహర్షులు, ఈ మహామంత్రాన్ని ఉపదేశం పొంది, సాధన చేశారు. ఆదిశేషుడు పాణినిమహర్షికీ, భరద్వాజ మహర్షికీ, శాకటాయనుడికీ, పాతాళలోకంలో ఈ దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఇలా ఇంతమంది చేత జపించబడ్డ సరస్వతీ మంత్రం, మహా మహిమోపేతమైనదిగా, లోకంలో ప్రసిద్ధి చెందింది. అలాగే, సరస్వతీ కవచ స్తోత్రం కూడా, ఎంతో మహిమాన్వితమైనది. ఇది కల్ప వృక్షం లాగా, అన్ని కోరికలనూ తీరుస్తుంది.

కృష్ణద్వైపాయనుడు కూడా, ఈ సరస్వతీ కవచాన్ని ఉపాసించే, వేదాలను రచించగలిగాడు. పూర్వం, యాజ్ఞవల్క్యమహర్షి తన ప్రారబ్ధ వశాన, గురుశాపానికి గురై, తాను నేర్చుకున్న విద్యలన్నీ మరచిపోయాడు. దాంతో, తీవ్ర మనోవేదనకు గురైన యాజ్ఞవల్క్యుడు, కోణార్క క్షేత్రానికి వెళ్లి, సూర్య భగవానుణ్ణి స్తుతించాడు. ఆయన వేదనను అర్థం చేసుకున్న సూర్యదేవుడు ప్రత్యక్షమై, వేదవేదాంగాలనూ, సకల శాస్త్రాలనూ బోధించి, అవి శాశ్వతంగా గుర్తుండడం కోసం, సరస్వతీ దేవిని స్తుతించమని చెప్పి, అంతర్థానమయ్యాడు. సూర్యభగవానుడు చెప్పిన విధంగానే, సరస్వతీ మాతను స్తుతించి, ఆమె అనుగ్రహాన్ని పొందాడు యాజ్ఞవల్క్యమహర్షి. సరస్వతీ స్తోత్రాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినవారు, గొప్ప కవీంద్రులవుతారు. మంచి వక్తగా, కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. పరమ మూర్ఖులైనా, సరస్వతీ దేవి స్తోత్రాన్ని పఠిస్తే పండితులవుతారు.

సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే ।
విద్యారూపే విశాలాక్షీ విద్యాం దేహి నమోస్తు తే ॥ ౧౫॥