Ads

Showing posts with label Amruta Hastam. Show all posts
Showing posts with label Amruta Hastam. Show all posts

03 December, 2020

అమృత హస్తం! - Amruta Hastam


అమృత హస్తం!

ఎవరి జీవితంలోకి తొంగి చూసినా, సుఖ దుఃఖాలు ఒకే స్థాయిలో ఉంటాయి. కాకపోతే, ఎంత చెట్టుకంత గాలి అన్నట్లుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో, మన కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేక పోవడం, అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతోషాన్ని పంచుకునే వారుంటారు. కానీ, మన కష్టాన్ని పంచుకోవడానికీ, కన్నీళ్లను తుడిచి పోవడానికీ, ఎవరు ముందుకొస్తారు?

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

మనం నవ్వుల్ని తోటివారితో, ప్రకృతితో పంచుకుంటాం. కానీ, మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే, అవతలి మనిషికి మధుర హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో, అవతలి వారి గాయపడిన గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి, మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగానంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి. అవతలి వారి గాయాన్ని తనదిగా భావించే, స్పందించే మనసు ఉండాలి.

అలాంటి ఒకరు మనకుంటే, మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు, కన్నీరు రాకపోలేదు. నిజానికవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ, అంత ప్రియమైన స్నేహితుడున్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడున్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక, కన్నీరు కాటు వేయగలదా? కష్టం వేటు వేయగలదా? కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు, స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ భాష్పాల్ని ఆనంద భాష్పాలుగా మార్చకుండా వదులుతాడా, వదలగలడా? పెనుతుపానును గోవర్ధన గిరి క్రింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో, కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృత హస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు. వాటిని కమనీయంగా మలచే ఆ హృదయపు సొంపులో ఉంది. 

శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచే నేర్పు, శిల్పిలో ఉండాలి. పాపాయిగానో, యువతిగానో, రాజుగానో, సర్పంగానో, సర్వేశ్వరుడిగానో.. అదంతా శిల్పి నేర్పు, ఓర్పు. మన కన్నీళ్లకు అర్థాన్ని మార్చే నేర్పు, వాటిని తుడిచే వాళ్లకుండాలి. ఏది ఏమైనా, కన్నీళ్లకు, తుడిచే ఒక అమృత హస్తం కావాలి. నీకు నేనున్నానంటూ, ఆ కన్నీళ్లను అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి.

ఆ హస్తం మనదే అయితే.. అలాంటి హృదయం మనకే ఉంటే.. మనమే ఆ శ్రీకృష్ణుడైతే? మన ఇంటికప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవరికి ఏం సహాయం చేయాలన్నా, మనకు ధనం అవసరం లేదు, బలం అవసరం లేదు. 'మనం', ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒక్కరికైనా, నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే, లోకమే తోడుగా మన పక్కన నిలబడదా? మన వెనుక నడచి రాదా? ఒక్కరు కోటి మందిగా మనకు గొడుగు పట్టరా?

'ప్రేమంటే' హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది, అంత శక్తి ఉంది. మనమూ, ఆ ‘ఒక్కరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు, లక్షల మంది ఉంటారు. కానీ, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు, కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు, జీవితమంతా కష్టాలూ ఎదురు దెబ్బలతో సహవాసం చేసినా, ఏ ఒక్కరోజూ, ఆ భావంతో బాధ పడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్నీ, సానుభూతినీ కోరిన రుజువుల్లేవు. ఎందుకంటే, ఇతరుల కన్నీటిని తుడవడంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన ‘శ్రీ కృష్ణుడు’ ఆయన. సకల జీవరాశి కష్టాలనూ ఎరిగిన వెన్నదొంగ ఆయన! కృష్ణం వందే జగద్గురుం!

Manchimata Videos:

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]