Ads

Showing posts with label Akshinthalu. Show all posts
Showing posts with label Akshinthalu. Show all posts

30 July, 2021

అక్షతలు - ఆశీర్వాదం! Akshinthalu

  


అక్షతలు - ఆశీర్వాదం!

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు?
ఆశీర్వచనానికీ, అక్షతలకీ ఏమిటి సంబంధం?
పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి?


హిందూ సనాతన సంస్కృతిలో, ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో, చిన్న వారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 

విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అనీ, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీ భవ అనీ, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అనీ, ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి, ఆ దీవెనలు..

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో, అక్కడ పండితులు, 'గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్తా సుఖినోభవంతు' అనే ఆశీర్వచనంతో.. దేశంలో రాజు, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులూ, బ్రాహ్మణులూ, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి, దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనుమలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ వగైరా.. సమాజంలో అందరి శ్రేయస్సూ కోరుతూ, ఆశీర్వచనం చేస్తారు..

అయితే, ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? అంటే, తప్పకుండా ఫలిస్తాయి..

సత్పధంలో నడిచే వారికి, సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు, తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల, జాతకంలో వుండే దోషాలు తొలగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా, నాశనమవుతాయంటారు..

గురువులూ, సిధ్ధులూ, యోగులూ, వేద పండితులూ, మనకన్నా చిన్నవారైనా, వారి కాళ్ళకి నమస్కరించి, వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది, వారి వయస్సుకి కాదు.. వారి విద్వత్తుకూ, వారిలోని సరస్వతికి..

అక్షతల సంకేతం!

సాధారణంగా శిశువు జన్మించినప్పుడు, పురిటి స్నానం రోజునుంచీ, ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు, తలమీద అక్షతలు జల్లుతారు.

ఆశీర్వచనానికీ, అక్షతలకీ ఎమీటి సంబంధం?

అక్షతలే ఎందుకుజల్లాలి? వేరే ధాన్యాలు వున్నాయికదా? వాటిని చల్లవచ్చుకదా! మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి?

బియ్యం, చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే, మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట.. 

బియ్యంలో కలిపే పసుపు, గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా, పసుపు రంగు కలిపిన అక్షతలను, మంత్రపూర్వకంగా తలమీదజల్లుతారు..

మంత్రం అంటే, క్షయం లేనటువంటిది. అకారంనుంచి, క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి, శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు, చేతితో పట్టుకున్న అక్షతలకి కూడా, ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో, వారుకూడా క్షయం లేకుండా, ఆభివృధ్ధి చెందాలని, ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.

మన పూజలూ, శుభ సందర్భాల్లో, అక్షతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. ఏ పూజ చేసినా, దేవుని వద్ద అక్షతలు ఉంచి, మధ్యమధ్యలో, 'అక్షతాన్ సమర్పయామి' అంటూ, భక్తిగా అక్షతలు జల్లడం, హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్లూ, పేరంటాలలో, వధూవరులపై అక్షతలు జల్లి, ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ, అక్షతలు తలపై జల్లి, ఆశీర్వచనాలు పలుకుతారు.

మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందనీ, చెడు ఫలితాలూ, దోషాలూ అంటకుండా ఉంటాయనీ, పెద్దలు చెబుతారు. కేవలం పెళ్ళిళ్లూ, శుభకార్యాల్లోనే కాదు.. అశుభ కార్యాల్లో కూడా, అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.

బియ్యంలో తగినంత పసుపూ, చిటికెడు కుంకుమా, తడిచీ తడవనట్లు కొన్ని నీళ్లూ, నాలుగు చుక్కలు నూనె వేసి, అక్షతలను తయారుజేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు, లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే, ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి..