Ads

Showing posts with label సనాతన ధర్మంలో పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము... Show all posts
Showing posts with label సనాతన ధర్మంలో పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము... Show all posts

17 September, 2021

సనాతన ధర్మంలో పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము..

 

సనాతన ధర్మంలో పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము..


వ్యక్తి ఇష్ట ప్రాప్తికీ (కోరినది లభించడానికి), అనిష్ట పరిహారానికీ (ఇష్టం లేనివి తొలగడానికి) దేవతల్ని ప్రార్ధించడం, పూజించడం చేయాలని, ప్రాచీన శాస్త్రాల నిర్దేశం. నిష్కామోపాసన శ్రేష్ఠమే అయినా, సకామారాధన దోషం కాదు. అందునా, ధర్మ విరుద్ధం కాని అభీష్టాలను అడగడం మంచిదే..

[ హిందూ ఆలయాల వెనుక శాస్త్రీయ రహస్యం! = https://youtu.be/y_Igp1f9aA4 ]

1. గంటలు:

దేవాలయాలలో పూజ సమయంలో గంటలు మ్రోగిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి, బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది, మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2. దీప హారతి:

దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం.. దీనిలోని అంతరార్థం ఏమిటంటే, దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. 'స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి' అని..

3. ధూపం:

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడున్న వారందరికీ, మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:

వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని, ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని, భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:

ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి, గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి, ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ, భక్తుడు చలించక, కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ, శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం. 

6. పూజ:

దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కానీ, భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులూ, భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కానీ, ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7. పత్రం (శరీరము):

ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8. పుష్పం (హృదయము):

ఇక్కడ పుష్పం అంటే, చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9. ఫలం (మనస్సు):

మనస్సు ఫలాలను అంటే, మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక, భగవంతునికి అర్పితం చేయాలి. దాన్నే త్యాగం అంటారు.

10. తోయం (నీరు):

భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే, మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం, మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.

11. కొబ్బరి కాయలు:

హృదయం అనే కొబ్బరి కాయ, కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు, సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరి కాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటి పెట్టుకుని ఉంటుంది. హృదయము అనే కొబ్బరి కాయను, పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు. మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో, అలాగే, మంచి పనులు చేస్తే, మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:

చేతులు జోడించగానే, పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లూ, పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో 'కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను, హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను' అని చేతులు జోడించుటయే, నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:

ముల్లోకములన్నియూ, భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరమైన విగ్రహమునకుగానీ, లింగమునకుగానీ, ప్రదక్షిణము చేసినట్లయితే, ముల్లోకములూ చుట్టి, సర్వ దేవతలకూ నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది. అందుకే ప్రదక్షిణమును, పూజాంగములలో ఒకటిగా చేర్చారు..

సర్వం భగవదార్పణమస్తు!