శుక్రనీతి: స్త్రీ పురుషులు పొరపాటున కూడా బయటపెట్టకూడని విషయాలు!
సప్తరుషుల్లో ఒకరైన భృగు మహర్షి కుమారుడు, శుక్రాచార్యుడు. తండ్రిలాగే శుక్రాచార్యుడు కూడా, గొప్ప విద్వాంసుడు. అసురుల ముఖ్య గురువైన శుక్రాచార్యుడు, రాక్షసుల వైపు చేరి, దుష్టత్వంతో ప్రవర్తించినప్పటికీ, త్రిమూర్తుల ప్రియ భక్తుడు. శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త, సాహిత్యాలను కూడా రచించాడు. అంతేకాదు, పురాణాల ప్రకారం, మరణించిన వారిని కూడా బతికించే మృత సంజీవనీ విజ్ఞాన శాస్త్ర విద్యలో, ప్రావీణ్యత సంపాదించాడు. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు, ప్రస్తుత కాలానికీ ఎంతో ఉపయోగపడతున్నాయి. ఆయన చెప్పిన విధంగా, కొన్ని విషయాలకు దూరంగా ఉంటే, జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది? స్త్రీ, పురుషులు రహస్యంగా ఉంచవలసిన కొన్ని విషయాలేంటి - అనేటటువంటి శుక్ర నీతిలోని ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gn9aq9Eend8 ]
ఎదుటివారిని ఆకర్షించడం, నేరం కాదు. అయితే, భౌతిక అందం కోసం, స్త్రీ లేదా పురుషుడు, ప్రాకులాడకూడదు. దీనివల్ల, శారీరక సౌందర్యం మరుగున పడిపోయి, మనిషి తన స్వచ్ఛమైన హృదయాన్ని కోల్పోతాడు. ఈ నిబంధనను అనుసరించడం కష్టమైనా, దీని వల్ల ఎంతో ఆనందం సొంతమవుతుంది. భౌతిక అంశాలూ, మాయకూ దూరంగా ఉండాలి. మనుషులనూ, వస్తువులనూ వేర్వేరుగా చూడాలి. ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దానిపైనే దృష్టిని కేంద్రీకరించాలి. ఒకవేళ లక్ష్యం ప్రక్కదారి పడితే, అది మన నాశనానికి దారి తీస్తుంది. కపట ప్రేమకు దూరంగా ఉండాలి.
ఓ తల్లి తన బిడ్డలకు ప్రేమను పంచుతుంది. అది నిజమైన ప్రేమ. కేవలం ప్రపంచం కోసం నటించేదీ, మన స్థితిని బట్టి పుట్టేదీ, ప్రేమ కాదు. జీవితంలో ఇలాంటి విషపూరిత ప్రేమలకు దూరంగా ఉండాలి. అదే విధంగా, ఒక పురుషుడు, లేదా స్త్రీ, వారి వ్యక్తిగత క్షణాలనూ, లేదా విషయాలనూ, ఎవరితోనూ పంచుకోకూడదు. అనేకమంది వ్యక్తులు, తమ స్నేహితులతో కలసి కూర్చుని, అసంబద్ధమైన విషయాలను సైతం పంచుకుంటారు. కానీ, అలా చేయడం వల్ల, మీరు మీ సంబంధం యొక్క గౌరవాన్నీ, విలువలనూ కోల్పోతారు. చెడు మార్గానికి గర్వం, అత్యాశా, అపరిపక్వత కలిగిన మాటలనేవి, నిజమైన సంపద. కానీ, అవి పెరిగే కొలదీ, మనిషి పతనానికి దారి తీస్తుంది. దురాశ, దురదృష్ట కర జీవితానికీ, దుఃఖానికీ దారితీస్తుందని వివరిస్తుంది శుక్రనీతి. కావున, ఏ సమయంలోనైనా, ఎవరికైనా, స్నేహితులూ మరియు బంధువులకూ కూడా, సంపద యొక్క నిజమైన లెక్కను బహిర్గతం చేయాలి. గొప్పలకు వెళ్తే, తిప్పలు తప్పవన్న మాట కూడా, ఈ నీతి నుండే వచ్చింది. కొందరు తమ వద్దనున్న దానికన్నా అధికంగా, గొప్పలకు పోతుంటారు. ఇటువంటివి, చెడు వ్యక్తి, లేదా దొంగల చెవిన పడితే, తర్వాత జరిగే పరిణామాలకు, జీవితాన్నే బలివ్వాల్సి రావొచ్చనేది, శుక్రాచార్యుడి మాటల్లోని గూఢార్థం.
జీవితం ఎలా సాగుతుందనేది, మనం వేసుకునే ప్రణాళికల మీద ఆధారపడి ఉంటుంది. పరుగెత్తడం ప్రారంభించిన తర్వాత, ప్రశ్నించుకోకూడదు. గత విషయాలను తలచుకుంటూ బాధపడటంకంటే, వర్తమానంలో జీవించడం ఉత్తమం. చర్యకు ప్రతిచర్యలాగే, మంచి చేస్తే మంచే జరగుతుంది. ఎప్పుడూ విధిపై నమ్మకం ఉంచాలి. అనుకూల, లేదా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఒకేలా స్వీకరించాలి. విధితో పోరాటానికి సిద్ధపడేముందు, మీరు చేసిన కర్మలను తెలుసుకోవాలి. గత జన్మలో చేసిన కర్మల ఫలితం, ఈ జన్మలో అనుభవిస్తారు. వాటి నుంచి తప్పించుకోవడం, ఎవరికీ సాధ్యం కాదు.
వయస్సూ, సంపాదనా, దేవుడిని పూజించే విధానం, ఆరోగ్యం, ఇతరులకు సహాయంచేసే విషయాలూ, సమాజాన్ని గౌరవించే విధానం గురించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలుపరాదు. ఎవరితోనూ, మీ భక్తిని ఎన్నటికీ పంచుకోవద్దని, శుక్ర నీతి హెచ్చరిస్తుంది. మంత్రాలనూ, మరియు మీ కోరికల ఉద్దేశ్యాన్నీ, ఇతరులకు ఎన్నడూ బహిర్గతం చేయవద్దు. ప్రత్యేకించి, మీ బలహీన గ్రహాలను పటిష్టపరచడానికి మీరు మంత్రోచ్ఛారణలు చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ, వాటిని బహిరంగ పరచకూడదు. ఇలాంటివి, అప్రయోజనకరంగా మారడంతో పాటు, ఇతరులకు మీ ప్రతికూల లక్షణాల గురించిన అవగాహన తెస్తుంది. దాని వల్ల, తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో, తనను తాను విశ్వసించాలి కానీ, చుట్టూ ఉన్నవారి అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన పనిలేదు. ఎవరికైనా సహాయం చేయాలని మనసుకు తోస్తే, ఇతరుల చర్చలతో సంబంధం లేకుండా చేయగలగాలి. ఈ రోజుల్లోనూ అటువంటి దాతలు ఉన్నారు. కానీ, కొందరు ప్రచారాల కోసం సేవ అన్న మార్గంలోనే పయనిస్తున్నారు. నిజానికి ఈ కాలంలో కనీసం ఒక్క ఫోటో లేకుండా, అన్నం పెట్టడానికి కూడా చేయి రావడం లేదు. పేదవారికి విరాళం ఇచ్చిన తర్వాత, వారి చర్యల గురించి బహిర్గతం చేయడం తప్పు. విరాళములు ఎల్లప్పుడూ, రహస్యంగా ఉంచాలి. ఎవరైనా ఆ విరాళం గురించి చెప్పినట్లయితే, వారికి లభించిన ధర్మం, నాశనమవుతుంది. బద్ధకస్తుడూ, త్రాగుబోతూ, స్త్రీలోలుడూ, అప్పులు చేసి ఎగ్గొట్టేవాడికి, సమాజంలో ఎక్కువకాలం మనుగడ సాధ్యం కాదు. తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధుల నుంచి తప్పించుకు తిరిగేవారూ, జీవితంలో చాలా కోల్పోతారు.
కాబట్టి, శుక్రాచార్యుడు చెప్పినట్లు, ఈ విషయాలను గుర్తుంచుకుని మెలగడం వలన, సంతోషకరమైన జీవనానికి పునాది పడుతుంది.
సర్వేజనాః సుఖినోభవంతు!