Ads

Showing posts with label శనీశ్వరుడికి భార్య ద్వారా కలిగిన శాప రహస్యం!. Show all posts
Showing posts with label శనీశ్వరుడికి భార్య ద్వారా కలిగిన శాప రహస్యం!. Show all posts

15 March, 2021

శనీశ్వరుడికి భార్య ద్వారా కలిగిన శాప రహస్యం! Why was Shani Dev Cursed by his Wife?


శనీశ్వరుడికి భార్య ద్వారా కలిగిన శాప రహస్యం!

నవ గ్రహాలలో ఒక గ్రహం శని గ్రహం. కానీ, హిందువులు శనిని దేవుడిగా, ప్రత్యేకంగా ఆరాధిస్తారు, పూజిస్తారు. మన సనాతన ధర్మంలో, ప్రతీదీ దైవత్వాన్ని కలిగి ఉంటుంది. అదే మన ధర్మం యొక్క గొప్పతనం. చెట్టూ, పుట్టా, రాళ్లూ, రప్పలూ, ఇలా ప్రాణం లేని వాటిలో కూడా దేవుణ్ణి చూడడం, మన వారి సంస్కారం. అటువంటి మన ఆచారాలలో భాగంగా వస్తున్నదే, నవగ్రహాలను పూజించడం. ఈ నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం, బలమైన గ్రహం, శని గ్రహం. దేవ, దేవతలపై ఉండే భక్తితో, వారిని కొలుస్తుంటాం. కానీ, శనిదేవుణ్ణి మాత్రం, భయంతో, ఆయన దృష్టి మనపై చెడుగా పడకూడదని కొలుస్తాం. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-gTD309WjDs ]

శనీశ్వరుని చూపు మనపై పడితే, అష్టదరిద్రాలూ చుట్టుకుంటాయనేది, అందరికీ తెలిసిన సత్యం. కానీ, శని దేవుడు, ప్రజలను, వారి వారి తప్పుల ప్రకారమే శిక్షిస్తాడు. శనీశ్వరుని దృష్టి చెడుగా మారడానకి కారణం, ఆయన భార్య. మన గ్రంథాలలో వివరించబడిన శనీశ్వరుని భార్యలెవరు? వారిలో ఎవరు శని దేవుణ్ణి శపించారు? ఎందుకు శపించారు? అసలు శని దేవుణ్ణి, ఈశ్వరుని పేరుతో కలిపి శనీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు? అనే ఆసక్తికర విషయాల గురించి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ | 

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||

సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలితాన్ని, వెను వెంటనే కలిగించే దేవుడు, శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిదేవుడు, సూర్య భగవానుడి కుమారుడు, యమధర్మరాజుకూ, యమునకూ అగ్రజుడు. యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శని, జీవులు బ్రతికుండగానే హింసించి, యాతనలకు గురిచేసి, శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో, శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. శనీశ్వరుని మాహాత్మ్యాల గురించి, అనేక పురాణాలలో వివరించబడింది. సమస్త లోకాలకూ ఆది దేవుడైన ఆ పరమశివుని మెప్పు పొంది, ఆయన పేరును తనలో కలుపుకున్న గొప్ప వ్యక్తి. శని దేవునికి శనీశ్వరుడు అనే పేరు రావడం వెనుక, ఒక కథ ఉంది.

కృతయుగంలో ఒకనాడు, నారదుడు కైలాసానికి వెళ్లి, శివునితో శని దేవుని ప్రాశస్త్యాన్నీ, ఆయన గొప్పతనాన్నీ పొగడసాగాడు. అది విన్న పరమేశ్వరుడు, శనిదేవుడు అంత శక్తివంతుడైతే ఆయన ప్రభావాన్ని తనపై చూపించి, ఆయన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమన్నాడు. ఈ విషయం నారదుని ద్వారా తెలుసుకున్న శని, పరమశివుడిని ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని, తిరుగు వర్తమానం పంపించాడు. శని దేవుని కంట పడకూడదనే ఉద్దేశ్యంతో, శివుడు కైలాశాన్ని వదలి, దండకారణ్యంలోని ఒక రావి చెట్టు తొర్రలో దాక్కుని, తపస్సు చేయసాగాడు. మరునాడు శివుడు కళ్లు తెరచి చూసే సరికి, ఎదురుగా శని దేవుడు నిలబడి ప్రణామాలర్పించాడు. అప్పుడు శివుడు, ‘ఏమైంది నీ శపథం? నన్నేం చేయలేకపోయావే?’ అని ప్రశ్నించాడు. శని దేవుడు వినయంగా నమస్కరించి, ‘పరమాత్మా, ఈ సకల సృష్టిలోని చరాచర జీవరాశులకూ ఆరాధ్య దైవమైన మీరు, కైలాసం వదలి, దండకారణ్యంలో, దిక్కులేని వారిలా, ఈ చెట్టు తొర్రలో దాక్కోవడం, నా ప్రభావం కాక మరేమిటి ఈశ్వరా?’ అని ప్రశ్నించాడు.

ఆ సమాధానం విన్న పరమేశ్వరుడు చిరుమందహాసంతో, తనను మెప్పించిన శనికి, ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని ఆశీర్వదించాడు. మానవులు ఆయనను శనీశ్వరా అని పూజిస్తే, శని తరపున తాను ఆశీస్సులు ఇస్తానని వరం ఇచ్చాడు. అయితే, శని దేవుడు తనకన్నా, తన భార్యలను ఆరాధిస్తే, అమితానందం  చెందుతాడని ప్రతీతి. శని దేవునికి, ద్వాజినీ, దామినీ, కంకాళీ, కలహప్రియా, కంటకీ, తురంగీ, మహిషీ, అజా అనే ఎనిమిది మంది భార్యలున్నారు. మన దోష పరిహారాల కోసం శని దేవుణ్ణి పూజించే ముందుగా, ఆయన భార్యల పేర్లతో కూడా పూజించాలి. శనీశ్వరుని దృష్టి, చెడు దృష్టిగా చెప్పబడుతుంటుంది. అందుకు గల కారణం, ఆయని అష్ట భార్యలలో ఒకరై దామినీ దేవి శాపం. చిత్రరధుని కుమార్తె అయిన దామిని, దైవిక శక్తులు కలిగిన స్త్రీ. ఆమె సౌందర్య రాశి మాత్రమే కాదు.. మేథో సంపన్నురాలు కూడా. ఒకనాడు దామిని, తల్లి కావాలనే కోరికతో, శనీశ్వరుణ్ణి చేరింది. తన చిన్న నాటి నుండి శ్రీకృష్ణుని భక్తుడైన శనీశ్వరుడు, ఆనాడు పరంధాముని ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు.

శనీశ్వరుణ్ణి ధ్యానం నుండి తన వైపుకు మళ్లించాలని, అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, శనీశ్వరుడు చలించలేదు. తన భర్త తీరుతో బాధపడిన దామిని, తనను నిర్లక్ష్యం చేయడం మాత్రమే కాకుండా, కనీసం తన వంక కూడా చూడలేదన్న బాధతో, ఇకపై శని దేవుని దృష్టి ఎవరి మీద పడితే, వారు ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తారని శపించింది. శనిదేవుడు, ఎవరినైనా చూస్తే, వారు క్లిష్ట పరిస్థితులలో చిక్కుకుని బాధపడాల్సి ఉంటుందని, తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కింది. అందుకే, శనీశ్వరుని చూపు శాపకారకమైందిగా, హానికరమైందిగా చెప్పబడుతోంది. తన భార్య శాపం కారణంగా, భక్తులకు ఎటువంటి అపాయం కలుగకూడదనే, శనీశ్వరుడు ఎల్లప్పుడూ, తల దించుకునే ఉంటాడు. నవగ్రహారాధన చేసే సమయంలో కూడా, శనీశ్వరునికి ఎదురుగా నిలబడకూడదని మన పెద్దలూ, పండితులూ చెప్పడానికి గల కారణం, ఆయన భార్య దామిని శాపం. శనీశ్వరుడు క్రూరమైన వాడు కాదు. వారి వారి కర్మానుసారం, పాప ఫలితాలను అనుభవించేలా చేస్తాడు.

Link: https://www.youtube.com/post/UgzgUMLIvzztroJQ17Z4AaABCQ