Ads

Showing posts with label విమర్శ ఎలా ఉండాలి?!. Show all posts
Showing posts with label విమర్శ ఎలా ఉండాలి?!. Show all posts

25 June, 2021

విమర్శ ఎలా ఉండాలి?! Dealing with criticism positively

 

విమర్శ ఎలా ఉండాలి?!

‘ఈ ప్రపంచంలో సలహాలివ్వడం కంటే, విమర్శించడం చాలా తేలిక’ అన్నాడో ఫ్రెంచ్‌కవి. సలహా ఇవ్వాలంటే, ఎదుట ఓ మనిషి ఉండాలి. విమర్శించడానికి, ఎదుట ఎవరూ ఉండనక్కర్లేదు. నేటి సమాజంలో సమయం, సందర్భం లేకుండా, విమర్శలు విపరీతమైపోయాయి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-czpLOxeLjk ​]

ఒక కావ్యాన్నో, కవితనో, లేదా ఏదైనా ప్రణాళికనో, అంశాన్నో విశ్లేషించేవారికి, ఆ కవి, లేదా ఆవిష్కర్తకన్నా, ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి. తార్కికంగా, నిష్పాక్షికంగా, అర్థవంతంగా చేసే విమర్శలు, మనోవికాసానికీ, ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికీ ఉపయోగ పడతాయి. విమర్శ మంచి గంధంలా పరిమళించాలి. మలయ మారుతంలా, మనస్సును తాకాలి. విన్నవారి హృదయాలు నొచ్చుకోకుండా, వారి ఆలోచనా సరళిని ప్రభావితం చేయాలి. వ్యక్తిని చూడకుండా, మిత్రుడా, శత్రువా అన్న ఆలోచనతో నిమిత్తంలేకుండా, కేవలం అతడి సృజనాత్మకతనూ, మంచిని మంచిగా, చెడును చెడుగా విడమరచి చేసే విమర్శ, సద్విమర్శ. ఈ సద్విమర్శ, ఉభయులకూ ఎంతో శ్రేయస్కరం.

రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల్లో, మనకు విమర్శలు కోకొల్లలుగా కనబడతాయి. తన బోధలనూ, హితవునూ లక్ష్యపెట్టక, పుత్ర వ్యామోహమనే హాలాహల సాగరంలో మునిగిపోయిన ధృతరాష్ట్రుణ్ని, అనేక సందర్భాల్లో విమర్శించాడు, విదురుడు. మరిగే నీటిలో మన ప్రతిబింబం కనపడనట్లే, అతి వ్యామోహంలోనూ, అత్యంత ఆగ్రహంతోనూ రగిలి పోయేవాడికి, విమర్శలూ, హితబోధలూ చెవికెక్కవు. మిడిమిడి జ్ఞానంగలవాళ్లూ, సహనం లేనివాళ్లూ, విచక్షణ తెలియనివాళ్లూ, తమ దోషాలను ఇతరులు ఎత్తి చూపినప్పుడు, అస్సలు సహించరు. ‘తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు’ అన్న మొండి వాదనకు సిద్ధపడతారు. రాజసూయ యాగం చేయాలని ధర్మజుడు తలపెట్టి, కృష్ణుణ్ని అగ్ర పూజకు ఆహ్వానించిన తరుణంలో, శిశుపాలుడు అజ్ఞానంతో, అహంకారంతో, వాసుదేవుణ్ని అనేక విధాలుగా దూషిస్తూ, కువిమర్శ చేసి, చివరకు ప్రాణాలు కోల్పోయాడు. రావణుడు తన అకృత్యాలను విమర్శించిన మండోదరినీ, విభీషణుణ్ణీ లెక్కచేయలేదు. సత్యభామ పలు మార్లు సవతులను నిందించి, విమర్శించి, తగిన దుష్ఫలితం పొందింది.

విమర్శ గురించి విశ్లేషిస్తూ స్వామి వివేకానంద, ‘మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించాలి. బలహీనపరచే ప్రతి ఆలోచననూ తిరస్కరించాలి’ అని ప్రబోధించారు.

విమర్శలను సహృదయతతో, వినమ్రతతో స్వీకరించడమే సంస్కారం. ప్రతి రచయితలోనూ, ఓ విమర్శకుడూ ఉండి తీరాలన్నది అనుభవజ్ఞుల మాట.

రచయితలు ఏది రాసినా, ఆత్మ పరిశోధన చేసుకోవాలి. స్వయం విమర్శ చేసుకోవాలి. విమర్శకులపైన వ్యక్తిగతమైన విరోధం పెట్టుకుని, ఎదురు దాడికి దిగడం, శ్రేయస్కరం కాదు.

‘వినడానికి కటువుగా ఉన్నా, మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి’ అనేవారు ‘భారతరత్న’ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

విమర్శలకు గురైనప్పుడు కుంగిపోకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.

అదేపనిగా ఇతరులలోని ప్రతి అంశాన్నీ, ప్రతి లోపాన్నీ ఎత్తి చూపడమే వృత్తిగా పెట్టుకునేవాడు, తననుతాను ఉద్ధరించుకోలేడు. పొరపాట్లను ఎత్తి చూపేవారు, సరిదిద్దే సూచనలు కూడా ఇవ్వడం, సమంజసం. నిరాధారమైన విమర్శకూ, నిర్మాణాత్మకమైన విమర్శకూ మధ్యగల భేదాన్ని గుర్తించడం అవసరం. ఆ పరిజ్ఞానమే, వ్యక్తి అభ్యున్నతికి శ్రీరామరక్ష.

Link: https://www.youtube.com/post/UgxvP3Q41kPfW75PVfx4AaABCQ