వనదేవతలు 'సమ్మక్క సారక్క'ల అద్భుత చరిత్ర!
కొండ, కోనలనే ఆవాసాలుగా చేసుకున్న గిరిపుత్రుల ఆరాధ్య దేవతలు, సమ్మక్క- సారక్క. ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో జరిగే అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క- సారక్కల మేడారం జాతర. భారతదేశంలోని అతి పెద్ద గిరిజన ఉత్సవంగా, తెలంగాణ కుంభమేళగా జరుపుకునే మేడారం సమ్మక్క- సారక్కల జాతరకు, ఎంతో ప్రాముఖ్యత ఉంది. సమస్త గిరిజనులూ, కొన్ని శతాబ్దాలుగా, సమ్మక్క సారక్కలను తమ కష్టాలు కడతేర్చే వన దేవతలుగా కొలుస్తున్నారు. ఈ మేడారం సమక్క-సారక్కల జాతర వెనుక ఒక గొప్ప చరిత్రతో పాటు, ఎన్నో విశేషాలున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. గిరిజన పురాణం ప్రకారం, సమక్క-సారక్కలు ఎవరు? వారి చరిత్ర ఏమిటి? వారు వన దేవతలుగా, గిరిజనుల ఆరాధ్య దేవతలుగా ఎలా మారారు? ఈ మేడారం జాతరలో జరిగే వింతల గురించి, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/p7n8ABOEXZQ ]
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ప్రధాన కేంద్రం నుంచి, 110 కిలో మీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలో గల, మారుమూల అటవీ ప్రాంతమే మేడారం. దట్టమైన అడవులూ, కొండకోనలూ, వన్యమృగాల మధ్య, ఈ మేడారంలో, ప్రతీ ఏడాదీ వచ్చే మాఘ శుద్ద పౌర్ణమి నుండి, మూడు రోజుల పాటు ఈ మహా గిరిజన జాతర, అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గొప్ప జాతర వెనుక గొప్ప చరిత్రతో పాటు, విషాదం కూడా దాగి ఉంది. మరి ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, మనం ఒకసారి తెలుగు నేలను పాలించిన కాకతీయుల కాలానాకి వెళ్లాలి. దాదాపు 12 వ శతాబ్దంలో, నేటి కరీంనగర్ జిల్లా, జగిత్యాల పరిసర ప్రాంతం మొత్తం, దట్టమైన అరణ్యంగా ఉండేది. ఆ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గిరిజన తండా, 'పొలవాస'. ఈ తండాతో పాటు, ఆ చుట్టు ప్రక్కల గిరిజనులకు దొర, 'మేడరాజు'. ఒకానొక సమయంలో, మేడరాజుతో పాటు కొంతమంది గిరిజనులు అడవికి వేటకు వెళ్లగా, అక్కడ ఒక పుట్ట ప్రక్కన, చిన్న పాప ఉండగా, ఆమె చుట్టూ పెద్ద పులులు, కాపలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయట. ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయిన మేడరాజూ, అతని పరివారం, ఆ బిడ్డను వారి గూడానికి తీసుకువెళ్లి, సమ్మక్క అని పేరు పెట్టి, తమ బిడ్డగా చాకారు.
రూపవతీ, గుణవతీ అయిన సమ్మక్క, తమ వారిలో ఎవరికైనా జబ్బుచేసినా, ఎవరైనా గాయపడినా, మూలికా వైద్యం చేసేది. ఆమె చేతులతో ఇచ్చిన ఔషధం తీసుకున్నవారు, చావుకి దగ్గరున్నా, తిరిగి బ్రతకడమే కాకుండా, అతి కొద్ది రోజులలోనే, పూర్తి ఆరోగ్యవంతులుగా మారేవారు. ఆ గూడెం ప్రజలంతా, సమ్మక్కను ఒక దేవతలా కొలిచేవారు. అయితే, ఆమె యుక్త వయస్సుకురాగానే, మేడారం రాజైన 'పగిడిద్ద'కిచ్చి, వివాహం చేశారు. వారికి సారలమ్మ, నాగులమ్మ, అనే ఇద్దరు ఆడపిల్లలూ, జంపన్న అనే కుమారుడు జన్మించారు. ఇదిలా ఉంటే, నాడు తెలుగు నేలను పాలించే కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు, తన రాజ్య విస్తీర్ణంలో భాగంగా, పొలవాసను ఆక్రమించుకున్నాడు. దాంతో ఆ ప్రాంతానికి రాజైన మేడరాజు, మేడారంలో ఉన్న పగిడిద్దరాజు, సమ్మక్కల వద్దకు చేరి, వారి ఆశ్రయం పొందాడు. అయితే, కొంతకాలానికి కరువు ప్రళయ తాండవం చేయడంతో, పగిడిద్దరాజూ, ఆయన ప్రజలూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే, పగిడిద్ద రాజు, కాకతీయుల సామంతులలో ఒకడవ్వడంతో, ప్రతీ ఏడాది కట్టే కప్పం చెల్లించాల్సిందిగా, ప్రతాపరుద్రుని వద్ద నుంచి, ఆదేశం వచ్చింది.
అప్పుడు తాము కప్పం కట్టే పరిస్థితిలో లేమని, పగిడిద్ద రాజు, ప్రతాపరుద్రునికి విన్నవించుకున్నాడు. అయితే, పొలవాస గిరిజన రాజైన మేడరాజు, పగిడిద్ద రాజు వద్ద ఆశ్రయం పొందినట్లూ, అతడు సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరి పోసినట్లూ, అందుకే వారు కప్పం కట్టకుండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లూ, ప్రతాపరుద్రునికి తప్పుడు సమాచారం వెళ్లడంతో, ఆయన పగిడిద్ద రాజు విన్నపాన్ని తిరస్కరించాడు. అంతేకాదు, కప్పం కట్టకపోతే, యుద్ధం తప్పదని గట్టిగా హెచ్చరించాడు. ఇక చేసేది లేక, పగిడిద్ద రాజు కాకతీయులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి, సంపెంగవాగు వద్ద యుద్ధానికి దిగాడు. అయితే, అపార సైన్య సంపత్తిగల కాకతీయుల ముందు, పగిడిద్ద రాజు సైన్యం, ఎక్కువ సేపు నిలువలేకపోయింది. పగిడిద్ద చాలాసేపు, అలుపెరుగని విరోచిత పోరాటం చేశాడు. అయితే, అతన్ని ఎలాగైనా మట్టుపెట్టాలని, కాకతీయ సైనికులు మూకుమ్మడిగా, బళ్లాలతో పొడిచి చంపేశారు. భర్త మరణంతో, కదనరంగంలోకి దిగిన సమ్మక్క, తన కూతురు సారమ్మతో కలిసి, కాకతీయులను ఊచకోత కోసింది.
వీరి కరవాలం ధాటికి, ఎవ్వరూ నిలువలేక పోయారు. ఆ తరుణంలో మేడరాజు చనిపోగా, జంపన్న తీవ్ర గాయాలతో, అక్కడున్న సంపెంగ వాగులో పడి చనిపోయాడు. అప్పటి నుండి, ఆ వాగుని జంపన్న వాగుగా పిలుస్తున్నారు. అయితే, వీరోచితంగా పోరాడుతున్న సమ్మక్క సారాలమ్మలను ఎదురొడ్డి నిలువలేని కాకతీయ సైనికులు, దొంగదెబ్బతీసి, వారిని పొడిచేశారు. తీవ్రగాయాలపాలైన సారమ్మ యుద్ధ ప్రదేశాన్ని వదిలి, కన్నెపల్లి ప్రాంతానికి వెళ్ళి, అక్కడ చనిపోయినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతుంటే, మరికొంతమంది వాదన ప్రకారం, ఆమె కన్నెపల్లి వద్ద అదృశ్యమయ్యి, పసుపు భరణిలా మారిందని చెబుతున్నారు. ఇక సమ్మక్క చిలుకల గుట్ట వరకూ వెళ్లి, అక్కడున్న మలుపులో అదృశ్యమైంది. సమ్మక్క జాడను అనుసరిస్తూ వెళ్లిన కాకతీయ సైనికులకు, చిలుకల గుట్ట నుంచి ఆమె ఆచూకి తెలియకపోగా, ఆమె అదృశ్యమైనట్లుగా భావిస్తున్న ప్రదేశంలో, కుంకుమ భరణి కనిపించింది. ఆ మహాతల్లి కుంకుమ భరిణగా మారినట్లు, భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆనాటి నుండి, గిరిజనులు సమ్మక్క- సారక్కలను తమ దేవతలుగా కొలుస్తున్నారు.
ఇలా రెండు సంవత్సరాలకు ఒకసారి, మాఘ శుద్ద పౌర్ణమి మొదలుకుని, మొత్తం మూడు రోజుల పాటు, మేడారంలో సమ్మక్క సారక్కల జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతర మొదలవ్వడానికి పదీ, పదిహేను రోజుల ముందు నుంచే, మేడారానికి అనేక ప్రాంతాల నుండి కోయదొరలు వచ్చి, నివాసాలు ఏర్పాటు చేసుకుని, అమ్మవార్ల అనుగ్రహంతో, విశిష్ఠమైన వన మూలికలను, అక్కడికి వచ్చే భక్తులకు అమ్ముతారు. అంతేకాదు, మేడారం జాతర నిర్వహించే పది రోజుల ముందు నుంచే, అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక జాతర మొదటి రోజు, అంటే, మాఘ శుద్ద పౌర్ణమి నాడు, సారక్కను తరతరాలుగా పూజిస్తున్న 'కాక' అనే ఇంటి పేరుగల పూజార్లు, కన్నెపల్లిలో కొలువైన సారక్కకు, ఉదయం నుంచి పూజలు నిర్వహించి, సాయంత్రం సమయానికి మేడారం తీసుకువచ్చి, సారక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ మరుసటి రోజు 'కొక్కెర' అనే ఇంటి పేరు గల సమ్మక్క పూజార్లు, 'సిద్దబోయిన' ఇంటి పేరుగల వారి వద్దకు వచ్చి, అక్కడ నుంచి చిలుకల గుట్టకు వెళ్లి, కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను, మేడారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.
మూడవ రోజు అమ్మవార్లిద్దరికీ, ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఆ రోజే భక్తులు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని, సమ్మక్క-సారక్కలకు మొక్కుగా సమర్పించుకుంటారు. ఇలా మూడు రోజులు గడిచాక, నాలుగవ రోజు, సమ్మక్క-సారక్కలను మళ్లీ యధాస్థానాలకు తీసుకెళ్లిపోతారు. 1940 వ సంవత్సరం ముందు వరకూ, కేవలం తెలంగాణా పరిసర ప్రాంతాలలోని గిరిజనులు మాత్రమే, ఈ జాతరను జరుపుకోగా, ఆ తరువాత, చుట్టు ప్రక్కల రాష్ట్రాలైన మహారాష్ట్రా, మద్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీసఘడ్, జార్ఖండ్ లలోని గిరిజనులు కూడా, ఈ జాతరకు తరలి రావడం మొదలైంది. ఆ తరువాతి కాలంలో, కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా, పల్లెలూ, పట్టణాలలోని అనేక మంది ప్రజలు, మేడారం తరలి వెళ్తుండడంతో, ఆ జాతరలో లక్షల మంది జనం సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకుని, తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే, 1996 లో, నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్రం, ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. నాటి నుండి, ప్రభుత్వ పర్యవేక్షణలో, సమ్మక్క-సారక్కల జాతర ఎంతో వైభవోపేతంగా జరుగుతోందని చెప్పాలి. మేడారంలో జాతర మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ, ఏ ఒక్కరు కూడా వన్యప్రాణులచే మరణించినట్లు కానీ, కనీసం గాయపడినట్లు గానీ, ఒక్క సంఘటన కూడా లేకపోవడం ఒక విశేషమైతే, ఈ జాతరలో భాగంగా, భక్తులు సమ్మక్క-సారక్కలకు ప్రసాదంగా సమర్పించుకునే బెల్లం ఉంచే స్థలంలో, ఒక్క చీమ కూడా ఉండకపోవడం మరో విశేషం. ఇదంతా ఆ దేవతల కరుణ అనీ, వారి మహిమ వల్లే ఇటువంటి ఆశ్చర్యాలు జరుగుతున్నాయనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Link: https://www.youtube.com/post/UgxWUkLJWaIoiUfxJTN4AaABCQ