Ads

Showing posts with label రాహు కేతు దోషాలు! పరిహారాలు ఫలితాలు!. Show all posts
Showing posts with label రాహు కేతు దోషాలు! పరిహారాలు ఫలితాలు!. Show all posts

16 May, 2022

రాహు కేతు దోషాలు! పరిహారాలు, ఫలితాలు! Does planetary positions influence humans?

  


రాహు కేతు దోషాలు! పరిహారాలు, ఫలితాలు!

సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి, అయా రంగులుగా విడిపోయిన సప్త కాంతులు, మన శరీర, మనస్సులను ప్రభావితము చేస్తాయి. అంటే, ఆయా గ్రహాలు మనమీద ప్రభావం చూపిస్తాయని, జ్యోతిష్య శాస్త్రం ద్వారా, మన పూర్వీకులు మనకు తెలియజేశారు. అంతేకాదు, కాంతి, మనుష్యుల మీద ప్రభావం చూపుతుందనీ, ఛాయ కూడా మానవుణ్ణి ప్రభావితము చేస్తుందనీ, రాహు కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. రాహుకేతువులున్న స్థితి, ప్రతీ మనిషి మీదా, మంచి చెడుల ఫలితాలను చూపుతుంది. గ్రహాల గురించిన విషయాలూ, వర్ణనలూ, పుట్టుకల శ్లోకాలూ, ఏనాడో మన గ్రంధాలలో లిఖించబడి ఉన్నాయి. వాటిని మనకు కొన్ని కథల రూపములో అందజేశారు, మన పండితులు. గ్రహ పరిస్థితులకు సంబంధించిన మంచి చెడులూ, నివారణోపాయాలు కూడా, సవివరంగా తెలియజేశారు మన మహర్షులు. రాహుకేతువులు మన జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయి? ఆ గ్రహాల పుట్టుక? కాల సర్పదోషానికీ, రాహుకేతువులకూ సంబంధం? కాల సర్పదోషాలు ఎన్ని రకాలూ, వాటి నివారణ మార్గాలనూ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/DRzDLFPOb_s ]

కశ్యప ప్రజాపతికీ, అతని భార్య సింహికకీ, రాహువు, పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వాభాద్ర నక్షత్రాన, జన్మించాడు. రాహువు క్రూర రూపము కలవాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. రాహువు, క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి, అమృతపానం చేశాడు. దానిని సూర్య చంద్రులు విష్ణుమూర్తికి చెప్పడంతో, విష్ణువు అతడి తలను, మొండెం నుండి వేరు చేయగా, పాము శరీరాన్ని తోకగా పొందాడు. విష్ణుమూర్తి అతడిని అనుగ్రహించి, గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి, సూర్యచంద్రులకు శత్రువై, గ్రహణ సమయాన కబళించి, తిరిగి విడుస్తుంటాడని, పురాణ కథనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం, మాఘ కృష్ణ చతుర్ధశి, ఆశ్లేషా  నక్షత్రంలో, గ్రహ జన్మనెత్తాడు. అతడి భార్య కరాళ.

ఇక కేతువు, పార్ధివ నామసంవత్సరం, ఫాల్గుణమాసం, శుక్ల పౌర్ణమి, అభిజిత్ నక్షత్రంలో, బుధవారం నాడు జన్మించాడు. కేతువు గోత్రం, జైమినీ పైఠీనస. కేతువు బూడిద వర్ణంలో, రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం, గ్రద్ద. కేతువు అమృతం తాగిన తరువాత, విష్ణువు అతని తలను నరికి, ఆస్థానంలో పాము తలను ధరింపచేశాడు. అప్పటి నుండి, కేతువుగా నామధేయం చేయబడి, విష్ణు అనుగ్రహం చేత, గ్రహస్థితిని పొందాడు. కేతువు పత్ని చిత్రరేఖ. సాధారణంగా, కేతువు ఒంటరిగా కుజ ఫలితాలనిచ్చినా, ఏ గ్రహంతో చేరి ఉంటే, ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహ స్థానం పొందిన కేతువు, విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.

అగ్రే రాహు: రధౌ కేతు: మధ్యే షడ్ర్గహో, 
యది కాలసర్పాఖ్య యోగోయం నృపానాం సమరం ధృవం.

అగ్రే కేతు: రధౌరాహు: గర్భస్తే గ్రహసప్తకే,
యది అపసవ్యకాలసర్పాఖ్య దోషోయం నృపాణాo సమరం భవేత్.

సర్పమునకు రాహువు తల, కేతువు తోక అవుతుంది. జాతకంలోని జన్మ కుండలిలో, రాహు కేతువుల మధ్య, మిగిలిన అన్ని గ్రహాలూ వస్తే, దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి స్థాన స్థితులను బట్టి, వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే, కాలసర్ప యోగం వలన కలిగే దోష ఫలితం కూడా నిర్ణయించబడుతుంది. రాహు కేతువులిచ్చే ఫలితాలు, అందరూ అనుభవించక తప్పదంటారు, జ్యోతిష పండితులు. రాహు కేతువులు ఏ జాతకుడికైనా ఉచ్ఛస్థితినిచ్చినా, దానితో పాటు, తీవ్ర మనో వ్యాకులతా, ప్రాణనష్టం, రాజ్య భ్రష్టత్వం, భేదం, అవమానాలూ ఇవ్వక తప్పదంటున్నాయి, ఇతిహాసాలు. మహాభారత రామాయణాలలోని పుణ్య పురుషులు కూడా, అతి దీనంగా దుఃఖించి, కొన్ని సమయాలలో, హేయమైన జీవితం గడిపడం, కాలసర్ప దోష ఫలితమే అయి ఉండవచ్చని, జ్యోతిష పండితులు చెబుతూ ఉంటారు.

అయితే, సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా, అవి ఫలితాలు ఇవ్వకపోవడం వెనుకు వున్న కారణం, ఆ యోగాలను కాల సర్పం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి, ఉద్యోగంలో ఉన్నతి, ఇతరత్రా వాటికి ప్రధాన అవరోధంగా మారడం, కాలసర్పదోష ఫలితమే. జ్యోతిష వాక్కు ప్రకారం, కాలసర్ప దోషం వంశపారంపర్యంగా వస్తుందంటారు. కానీ చాలామంది, సర్పాలను చంపడం వల్లనే, కాలసర్ప దోషం ఏర్పడుతుందని అనుకుంటారు. అయితే, ఈ మాట కొంత నిజమే అయినా, కాల సర్ప దోషానికి చాలా కారణాలున్నాయి. సర్పాలను, తెలిసి గానీ తెలియక గానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, వాటికి అపకారం చేయటం, లేదా చంపడం చేసినా, ఆ దోషం మనలను వదలదు.. అని నిర్ణయ కౌముది చెబుతుంది. వాటిని పీడించినా, హింసించినా, బంధించినా, సంహరించినా, ఆ పాపం, సర్ప దోష రూపంలో, మనుషుల్ని పట్టి పీడిస్తుంది.

అయితే, మన జీవితాలను అస్తవ్యస్తం చేసే కాల సర్ప దోషాలు ఎన్ని రకాలున్నాయి? ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం వలన, ఎటువంటి దోషాలు కలుగుతాయో చూద్దాం..

1. కాలసర్ప దోషం: రాహువు - రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - కేతువు. ఈ గ్రహల అమరికలో ఉన్న జాతకులకు, కుటుంబ సమస్యలూ, దీర్ఘ రోగాలూ, ఇబ్బంది పెడతాయి.

2. అపసవ్య కాలసర్ప దోషం: కేతువు – రాహువుల మధ్య, మిగలిన ఏడు గ్రహాలూ రావడం. ఈ స్థితిలో ఉన్న జాతకులకు, ఆలస్య వివాహం, వైవాహిక జీవితంలో ఇబ్బందులు.

3. అనంత కాలసర్ప దోషం: లగ్నం నుండి సప్తమ స్థానం మధ్యలో, అన్ని గ్రహాలనూ బంధించేది, అనంత దోషం అవుతుంది. జాతకంలో ఈ విధంగా ఉండడం వలన, ప్రతీది అనేక ఇబ్బందులతో, బతుకు భారమైన జీవితం గడుస్తుంది.

4. గుళిక కాల సర్ప దోషం: మాములుగా, ఇది జాతక చక్రంలో ద్వితీయం నుండి ప్రారంభమై, 8 వ ఇంట సమాప్తం అవుతుంది. దీని ఫలితాలేంటంటే, ఆర్ధిక సమస్యలూ, కుటుంబ ఇబ్బందులూ. ఈ స్థితి, 27 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగిస్తుంది.

5. వాసుకి కాలసర్ప దోషం: 3 వ ఇంట మొదలై, 9 వ ఇంట సమాప్తం. ఇటువంటి జాతకస్థులకు, అన్నదమ్ముల మధ్య కలహాలూ, సమస్యలు. ఇది 36 సంవత్సరాల వరకూ ఇబ్బంది కలిగిస్తుంది.

6. శంఖపాల కాలసర్ప దోషం: 4 వ ఇంట మొదలై, 10 వ ఇంట సమాప్తమవువతుంది. దీని వలన కలిగే ఫలితాలు: తల్లి వలన, లేదా తల్లికి సమస్య, వాహన గండం, నివాస స్థల సమస్యలు. ఇది 42 సంవత్సరాల వరకూ ఇబ్బంది కలిగిస్తుంది.

7. పద్మ కాలసర్ప దోషం: 5 వ ఇంట ప్రారంభమై, 11 వ ఇంట సమాప్తం. ఇటువంటి జాతకులకు, జీవిత భాగస్వామితో కానీ, పిల్లలతో కానీ సమస్యలు. 48 సంవత్సరాల వరకూ, ఇది ఇబ్బంది కలిగిస్తుంది.

8. మహా పద్మ కాలసర్ప దోషం: 6 వ ఇంట ప్రారంభమై, 12 వ ఇంట సమాప్తం. ఈ జాతక ఫలితాలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధ, శత్రు బాధ. 58 సంవత్సరాల వరకు, దీని ప్రభావం ఉంటుంది.

9. తక్షక కాలసర్ప దోషం: ఏడవ ఇంట ప్రారంభం, లగ్నం వరకు. ఇటువంటి జాతకులకు, వ్యాపార నష్టాలు, వివాహ జీవితంలో ఇబ్బందులు.

10. కర్కాటక కాలసర్ప దోషం: 8 వ ఇంట ప్రారంభం, 2 వ ఇంట సమాప్తం. ఈ జాతకులకు, భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు.

11. శంఖ చూడ కాలసర్ప దోషం: 9 వ ఇంట ప్రారంభం, 3 వ ఇంట సమాప్తం. ఇలా ఉండడం వలన కలిగే ఫలితాలు, తండ్రి వల్ల ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్థితి.

12. ఘటక కాలసర్ప దోషం: 10 వ ఇంట ప్రారంభం, 4 వ ఇంట సమాప్తం. ఈ జాతకం కలిగిన వారికి, వ్యాపార, ఉద్యోగ సమస్యలు. 

13. విషక్త కాలసర్ప దోషం: 11 వ ఇంట ప్రారంభం, 5 వ ఇంట సమాప్తం. ఇటువంటి జాతకులకు, ఆర్ధిక, వ్యాపార కష్టాలు.

14. శేషనాగ కాలసర్ప దోషం: 12 వ ఇంట ప్రారంభం, 6 వ ఇంట సమాప్తం. దీని వలన కలిగే ఫలితాలు, ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.
ఇవేకాక, కాల సర్ప దోషాలు అనేకం చెప్పబడినవి, వాటిలో ఇవి ప్రముఖమైనవి.

"అపుత్రాః పుత్రశోకం చ కూరుపః పుత్ర జాయతే
అభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః

భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ 
సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"

నాగదోషం ఉన్న జాతకులకు, అశాంతిని కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగపోవడం, పుట్టిన సంతానం వెంటనే మరణించడం, అంగహీనులైన సంతానం జన్మించడం, వివాహం ఆలస్యమవ్వడం, భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు రావడం, వివాహ జీవితం అల్లకల్లోలంగా మారడం, భార్యాభర్తలు విడిపోవడం, ఆర్థిక సమస్యలు, మానసిక అశాంతి వంటివి, నాగదోషం వల్లనే ఏర్పడతాయని, పురాణాలు చెబుతున్నాయి. లగ్నం నుండి సప్తమ స్థానం వరకూ గ్రహాలున్నన్నట్లయితే, ప్రధమ భాగం, అంతరాయాలతో జీవితం సాగుతుంది. 7 నుండి 12 వ స్థానంలో ఉన్నట్లయితే, రెండవ భాగం ఇబ్బంది పెడుతుంది. 6, 7 , 8 వ స్థానంలో రాహువు ఉంటే, సర్ప దోషం ఏర్పడుతుంది. జాతకంలో ఈ దోషం ఏర్పడితే, మొదట తీవ్రమైన ఇబ్బంది పెట్టి, 33 సంవత్సరాల తర్వాత, ప్రభావం కొంత తగ్గుతుంది. స్త్రీ, పురుష బేధం లేకుండా, ఎటువంటి కాలసర్ప దోషమైనా, అశుభ ఫలితాలను కలిగించేవే కాబట్టి, జాతకంలో ఏర్పడిన కాలసర్ప దోషాన్ని అనుభవజ్ఞులైన పండితుడితో, 72 వేల సార్లు జపం చేయిస్తే, నివారణ కలుగుతుంది. జీవిత ప్రారంభ దశ అనుకూలంగా లేకపోతే, సంతృప్తి అనిపించదు. అందుకు కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే, శ్రేయస్కరం. తొమ్మిది గ్రహాలకు, తొమ్మిది నాగులను నియమించబడిందని, సర్ప శాస్త్రం తెలియబరుస్తుంది. ఆశ్లేష బాలి, నవనాగా మండలం, నారాయణ నాగాబలి, మహా సర్ప బలి అనే ఈ నాలుగు రకాల పరిహారాలతో, తొమ్మిది రోజుల హోమమును చేస్తారు. నాగ దోషం గల జాతకులు ధరించిన వస్త్రాలను, ఉప హోమ గుండములో వేస్తారు. జాతకుడు పుట్టిన సంఖ్యను బట్టి, ఒక రంగు ఉంటుంది. ఆ రంగు వస్త్రాలను పూర్ణాహుతిలో వేస్తారు. ఈ తొమ్మిది రోజులు, జాతకులు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. పొట్లకాయ తినకూడదు. ప్రతి నిత్యం, సర్ప సూక్తం చదవాలి. ఇలా పరిహారాలు చేసుకునే వారికి, శీఘ్ర సంతానం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలూ, వ్యాపార సమస్యలూ, అనారోగ్య సమస్యలూ నయమవుతాయి.

స్వప్నంలో పాములు వస్తే, అది సర్ప దోషమని సర్ప శాస్త్రం, మనకి తెలియపరుస్తుంది. అలాంటి వారు కూడా, దోష పరిహారము చేసుకోవడం మంచిది. ఎక్కువగా కాలసర్ప నివారణ పూజలు, శైవక్షేత్రాల్లోనే చేస్తారు. అందులోనూ, పడమర నుంచి, తూర్పునకు జలాలు ప్రవహించే ప్రాంతాలలో, ఈ పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే, మిగిలిన శైవ క్షేత్రాలతో పోలిస్తే, త్రయంబకేశ్వర్, కుక్కే, మన్నర్సాల, కౌలాలంపూర్, మున్నగు ప్రదేశాలలో, ఈ దోషానికి పరిహారాలు చేస్తుంటారు. శ్రీకాళహాస్తి వెళ్లి, రాహు, కేతు సర్ప దోష పరిహారం చేయించుకుని, మినుములూ, కందులూ, ఉలవలూ దానం చేయడం వలన, కాల సర్ప దోషాన్ని దూరం చేసుకోవచ్చు. బంగారం, లేదా వెండితో నాగ పడగ చేయించి, ఏకాదశ రుద్రాభిషేకం తర్వాత, ఆ పడగను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా, దోషం పోతుంది. వెండితో సర్పాకార ఉంగరం చేయించి వేలికి ధరించడం, ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రంలో, 108 ప్రదక్షిణలు చేసి, దేవుడికి వెండి పడగను సమర్పించడం వల్ల కూడా, కాల సర్ప దోషం పోతుంది. అలాగే, కుజ, రాహు, కేతు గ్రహాలకు, విడివిడిగా జపాలు చేయించి, గ్రహ దానాలు చేయడం కూడా, శుభప్రదం. నాగదోషం త్రీవ్రమైనదయితే, శుక్ల పౌడ్యమినాడు, శ్రీకాళహస్తిలో నిద్రచేసి, మరుసటి దినం శివ దర్శనం చేసుకుని, పూజలు జరిపించడం వల్ల, నివారణ కలుగుతుంది.

ఆరు ముఖాల రుద్రాక్షలు, చెవి పోగులుగా, లేదా గాజులుగా, లేదా ఉంగరంగా ధరించడం వలనా, ఏనుగు తోక వెంట్రుకలతో చేసిన ఉంగరాన్ని ధరించడం వలన గానీ, నివారణ పొందవచ్చు. రాహు కాలంలో ప్రతి సోమవారం, నాగ దేవతకు క్షీరాన్ని నివేదన చేసి, పూజ చేయాలి. తీవ్రమైన నాగదోషం ఉన్నవారు, నాగ పంచమి రోజున, శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి, దుర్గ, పాతాళ వినాయకుని పూజించటం వల్ల, రాహు కేతు దోషం, నివారణమవుతుంది. నాగదోష నివారణ చేయించుకోవడానికి, శుక్లచవితి, శుక్లపంచమి తిథులూ, శుక్రవారము, ఆదివారమూ విశిష్టము. అయితే, పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులూ, కృష్ణపక్షము, నాగపూజకు అనువైన, శుభ దినాలు కావు. నాగ శాంతి పూజలు, వీలైనంతవరకు, శుక్లపక్షములో, చవితి, పంచమి రోజుల్లో కానీ, అంతకు పూర్వదినములలోగానీ నిర్వర్తించడం ద్వారా, ఆ గృహంలో అరిష్టాలు తొలగి, వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతతా కలుగుతాయి. అయితే, మన జన్మ జాతకంలో ఉన్న యోగాలు, మన కర్మ ఫలాలు మాత్రమే. ఈ యోగాలను మార్చే శక్తి, మన కర్మలకు మాత్రమే ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించే కష్ట సుఖాలు, గత జన్మలో మనం చేసుకున్న కర్మ ఫలాలు. ఈ దోషాలు మనిషి పుట్టుకకు ముందూ, తరువాతా కలిగే జన్మల రహస్యాలను ఇముడ్చుకుని ఉంటాయి.

సర్వేజనాః సుఖినోభవంతు!