Ads

Showing posts with label యద్భావం తద్భవతి!. Show all posts
Showing posts with label యద్భావం తద్భవతి!. Show all posts

07 March, 2021

యద్భావం తద్భవతి!


యద్భావం తద్భవతి!

ఇది ప్రసిద్ధ చైనా కవి 'సటంగ్ పో' జీవితంలో జరిగిన యదార్థ ఘటన.

ఆయన జీవిత కాలం, సామాన్య శకం 1036 నుండి 1100 మధ్యకాలం. ఆయన రాజాస్థానంలో, సాహిత్య విభాగానికి అధిపతి..

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

ఒకసారి ఆయన దిన చర్యలలో భాగంగా, బుద్ధుని ఆలయానికి వెళ్ళాడు..

అక్కడొక సన్యాసి కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. తాను కూడా వెళ్ళి అతని పక్కన కూర్చుని, ధ్యానం చేశాడు..

ధ్యానానంతరం ఆ సన్యాసిని, 'నేను ధ్యానం చేసేటప్పుడు ఎలా కనిపించాను?' అని అడిగాడు..

'బుధ్దినిలా కనిపించారు' అని చెప్పి, 'మరి నేనెలా కనిపించాను?' అని అడిగాడు సన్యాసి..

'పెంట కుప్పలా కనిపించారు' అన్నాడు సటంగ్ పో, అతిశయంగా..

ఆ మాటలకి సన్యాసి చిరునవ్వు నవ్వాడు..

ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయిన కవి, 'మీకు కోపం రాలేదా?' అని అడిగాడు..

'కోపమెందుకు? మన మనసు ఎలా వుంటే, ఎదుటివారు అలా కనిపిస్తారు.. 

నా మనసు నిండా బుద్ధుడు నిండి వున్నాడు కాబట్టి, నువ్వు నాకు బుధ్దినిలా కనిపించావు..

నీ మనసు నిండా పెంట వుంది కాబట్టి, నీకు నేను పెంటకుప్పలా కనిపించాను' అని వివరించాడు సన్యాసి..

దానితో సటంగ్ పో ముఖం చిన్నబోయింది..

ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన ధర్మం, నీతి ఏమిటంటే..

'యద్భావం తద్భవతి' అని వేదంలో చెప్పినదానికి ఇది చక్కని, సరియైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు..

మన మనస్సు దేనితోనైతే నిండి ఉంటుందో.. అది భయంతోగానీ, అసూయతోగానీ, ధైర్యంతోగానీ, ఆధ్యాత్మిక వైరాగ్యంతోగానీ కావచ్చు.. దానితోనే మన చూపూ, మన ఆలోచనలూ, మన చేతలూ ఆధారపడి ఉంటాయని అర్ధం..

ఒకరిపై ఒకరు అసూయతో, ద్వేషంతో, మనం మన జీవితాన్నే పూర్తిగా వ్యర్థం చేసుకుంటున్నాము. అందుకు మనం ఎదుటివారికంటే ముందు, మన మనస్సును తెలుసుకుని, ఆ మనస్సు దేనితో నిండి ఉందో కనుక్కుని సరిదిద్దుకున్నప్పుడు, మన జీవితం సార్ధకతమవుతుంది.. అందుకు మన పురాణాల్లో, 'సర్వం ఆ పరమేశ్వరుడి శక్తి నిండి వుంది.. నీలో కూడా ఆ శక్తే ఉన్నది.. నీవు ఆ శక్తినే చూడాలి.. అంతేకానీ, ఆ శక్తిని నీలోనూ, బయటి ప్రపంచంలోనూ, వేరు వేరుగా చూడకూడదు..' అనే ఉద్దేశ్యంతో, సనాతనంగా ఒక ప్రణాళికతో, బాల్యం నుండీ ధర్మ బోధనలు, గురు ముఖంగా నేర్పింపబడేవి.. అందువల్ల, పూర్వ కాలంలోని ప్రజలు ధర్మబద్ధంగా జీవించారు.

మరి ఇప్పుడున్న కాలంలో అలాంటి ధర్మ బోధనలు ఏవి? ఎక్కడ బోధించ బడుతున్నాయి? ధర్మం అనే పదం ఒకటి ఉందనే సంగతి కూడా ఇప్పటి కొంతమంది పిల్లలకి తెలియదు. ఈ పోటీ యుగంలో ఇవి అవసరం లేదనీ, పోటీతత్వమే ఊపిరిగా సాగుతున్న బోధనలు మారాలి.. అంత వరకూ, భావి తరాలను దృష్టిలో ఉంచుకుని, కనీస భాద్యతగా, తల్లిదండ్రులే ఈ ధర్మ బోధనలు తమ పిల్లలకు అందే విధంగా చూడాలి.. ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgziTuNnE0-7dzKudJt4AaABCQ

14 February, 2021

యద్భావం తద్భవతి!


యద్భావం తద్భవతి!

జన్మించిన ప్రతి జీవికీ, పరిపూర్ణంగా జీవించాలన్న కోరిక ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకూ నరికినా, అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే సెలయేటికి ఓ కొండ అడ్డుపడినప్పుడు, అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా, నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకుని, ముందుకు ప్రవహిస్తుంది. అడవిలోని మొక్కలకు నీళ్లు పోసే వారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై, ఆశగా ఎదురు చూస్తాయి.

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

వీలు కానప్పుడు, పులి కూడా రెండడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణ భయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బ్రతకాలన్న బలమైన వాంఛ ఉంటుంది. ఒక్కోసారి వెనక్కి రావడమూ, ముందుకు పోవడంలో భాగమవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం.. జీవన పయనం, ఏ దిశలో సాగుతోంది? అన్నది ముఖ్యం కాదు.. అది ఆరోహణా భావనతో ఉందా? లేదా? అన్నదే ప్రధానం.. జీవ చైతన్యానికి, నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం, పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని, అంతకన్నా కాదు.

ఈ సృష్టిలో పశు పక్ష్యాదులూ, ఎడారుల్లో సంచరించే జీవులూ, ఉభయచరాలూ, ఎంతో ఓర్పూ, సహనంతో కాలం వెళ్ళ బుచ్చుతాయి. మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని జీవిస్తాయి. జీవకోటిలో తెలివి తేటలున్న మనిషి మాత్రం, అనుకున్నదే తడవుగా, ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు.

పేదవాడొకడు తన ఇంటిముందు ఓ మొక్కను నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయ్యింది. అది పండ్లు ఇచ్చి, ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కానీ, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక, శరీరంతో పాటు మనస్సూ బలహీన పడింది. ఫలితంగా, అతడి నిరీక్షణ కాలాన్ని మరింత పొడిగించిన భావన కలుగజేసింది. విసుగు తెప్పించింది. కోరిక నెరవేర లేదని, అతడిలో కోపాగ్నిని రగిలిచింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాత రెండూ లేని చెట్టు ఎందుకని, దానిని నరికివేశాడు. మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే, పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. ఆ సన్నివేశం చూశాక, అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందర పడ్డానని బాధ పడ్డాడు. జీవితం ఇలాగే, అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం. అందువల్లే, ‘ఫలితం' పని చేసేవాడి చేతిలో లేదు. అది కాలపురుషుడి నిర్ణయం.. అని గీత చెబుతుంది.

సానుకూలంగా లేని పరిస్థితుల్లో, ఆకలిగొన్న జంతువొకటి, ఎత్తున ఉన్న కొమ్మ ఆకులు తిందామనుకుంది. అందుకోసం, దాని పొట్టి మెడ చాచడం మొదలు పెట్టింది. కాళ్లూ పొడుగుంటే బాగుండేదని భావించింది. రోజూ దాని ప్రయత్నాలు సానుకూల వైఖరితో సాగేవి. కొంత కాలానికి, దాని మెడ పొడుగ్గా సాగింది. కాళ్లూ పెద్దగా అయ్యాయి. అదే జిరాఫీగా రూపాంతరం చెందింది. మానసిక భావాలకు అనుగుణంగా, శరీరం స్పందిస్తుంది. అది ప్రాకృతిక నియమం. అమీబా నుంచి చింపాంజీ దాకా జరిగిన జీవ పరిణామ క్రమంలో, ఆశావహ దృక్పథం కీలకం. అందువల్లే, ‘యద్భావం తద్భవతి’ అన్నారు వేదాంతులు. ‘నీ సంకల్పమే నువ్వు’ అని బుద్ధుడు ప్రబోధించాడు. దుందుడుకు వైఖరితో ఎటువంటి ప్రయోజనాలూ సిద్ధించవు. సానుకూల ధోరణితోనే మానవుడు ముందుకు వెళ్ళగలడు! సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgxzFxiJdoO60QSwsvF4AaABCQ