Ads

Showing posts with label మౌనంగానే ఎదగమని మొక్క చెబుతుంది. Show all posts
Showing posts with label మౌనంగానే ఎదగమని మొక్క చెబుతుంది. Show all posts

25 February, 2022

మౌనంగానే ఎదగమని మొక్క చెబుతుంది.. Incredible Benefits of Silence

  


‘మౌనం’ - మౌనంగానే ఎదగమని మొక్క చెబుతుంది.. మంచిమాట!

'మౌనమె నీ భాష ఓ మూగ మనసా..' అని ఆత్రేయ గారన్నారు.. ‘మౌనేన కలహో నాస్తి’ అంటే, మౌనంగా ఉంటే, కలహం ఉండదన్నది ఆర్యోక్తి. మౌనమంటే, ఆలోచన, ఆవేదన, ఆక్రోశము, భ్రాంతి, వాంఛ, వాక్కు లేకుండా, మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పరిపూర్ణమైన ఏకాగ్రత కలిగివుండడమూ, వాక్కును నియంత్రించడమే ‘మౌనం’. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా, అవసరం మేరకే, వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలనీ, అలా చేతకానప్పుడు, మౌనమే మేలనీ, విదురనీతి వివరిస్తుంది. అటువంటి మౌనం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, ఈ వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-xnI1bX1awc ]

మౌనం అనేది, దైవ భాష. లిపి లేని విశ్వ భాష. ధార్మిక దివ్యత్వానికి ప్రధాన ద్వారం. సనాతన భాషా స్రవంతి. మౌనమంటే, మాట్లాడక పోవడం కాదు. మూగగా ఉండి సంజ్ఞలు చేయడమో, లేదా వ్రాతల ద్వారా మన భావనలను వ్యక్తపరచడమో, నిశ్శబ్ధంగా ఆలోచించడమో, వాక్కును నిరోధించి, మనస్సుతో భాషించడమో కాదు. మౌనమంటే, మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమనే అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం. అయిదు శాంతులలో, మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని నానుడి. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడంకంటే, మౌనంగా ధ్యానం చేయడం వల్ల, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చ’న్నారు, స్వామి వివేకానందులవారు.

‘మౌనం’ మూడు రకాలు.. మొదటిది ‘వాగ్ మౌనం’. వాక్కును నిరోధించడమే, వాగ్ మౌనం. దీనినే, మౌన వ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల, పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రేలాపనలనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండవది ‘అక్ష మౌనం’. అంటే, కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక, ఏకాగ్రనిష్టలో ఉండటం. ఈ మౌనం వలన, ఇంద్రియ నియంత్రణ ద్వారా, ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడతాయి. మూడవది ‘కాష్ఠ మౌనం’. దీనినే, మానసిక మౌనం అంటారు. మౌన ధారణలోనూ, మనస్సు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దానిని అరికట్టినప్పుడే, కాష్ఠ మౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల, దివ్య శక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనో శక్తులు వికసిస్తాయి. ఎదుటి వారిలో పరివర్తన తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై, ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో, మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంభించిన మహాత్ముల్లో, శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఉన్నారు. మౌనమంటే, పదాల ప్రతిబంధకాలులేని నిశ్శబ్ద సంభాషణ అని, శ్రీ రమణ మహర్షి అంటారు. ‘మౌనం’ అన్నింటికంటే అతీతమైన, సమర్ధవంతమైన భాష.

మానసికంగా మౌనావస్థకు చేరుకోవడమే ధ్యానం. ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ, 'మౌనం' పాటించనిదే, ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగ సాధకులైన మహర్షులు, మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. రోజూ అరగంట మౌనంగా ఉంటే, శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు, ఆశలూ, ఆశయాలూ, కలలూ, కోరికలూ నెరవేరతాయని, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే, ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని, అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని, మాటనూ, మనస్సునూ మౌనంలోకి జార్చేస్తే, మనస్సు తేలికగా ఉంటుంది. ఎంతో మంది అనుభవ పూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

అయితే, మౌనం అన్ని సందర్భాలలో సమర్ధనీయం కాదు. కీలక సందర్భాలలో నోరు విప్పకపోతే, చేయని తప్పుకు సైతం, మౌనం అంగీకారం క్రింద పరిగణించే ప్రమాదమూ వుంది. ఇక ఆచి తూచి మాట్లాడటం, చేతకానితనం కాదు. తనపై, తన ఆలోచనలపై, తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకూ’ వెనక్కి రావు. అందుకే, వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, తెలుసుకోవాలి. ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు, మనలను పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం, మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్లు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే, ‘మౌనం’. మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిరాకు, కోపం, వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏ సాధన అయినా, మౌనం వల్లనే సాధ్యపడుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం, మౌనమే. మౌన సాధన చేసి, అందరం మౌనంగా ఎదిగే ప్రయత్నం చేద్దాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgkxQdpGk7kfWwMikqiCDx0Q2ixaF2OX0WTU