మహాభారతంలో వెలుగు చూడని కొన్ని అద్భుత సంఘటనలు!
మన సనాతన ధర్మంలో, పంచమ వేదమైన మహాభారతం, ఎంతో ఖ్యాతి గడించింది. భారతంలో లేనిది, ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు.. ఈ జగత్తులో జరిగేవన్నీ, భారతంలో ఉన్నవే అని పండితుల ఉవాచ. ఎంతో గొప్ప ఇతిహాసంగా, మన భారతవనిలో జరిగిన యథార్థ గాధగా, ఆనాటి యుగాన్ని నేటి కాలానికి పరిచయం చేసిన మహోత్కృష్టమైన గ్రంథం, మహా భారతం. అందులోని ప్రతి పాత్రా, ప్రతి ఘట్టం, అమోఘం, అనిర్వచనీయం. ఎన్ని సార్లు చదివినా, విన్నా, ఇంకా మనకు తెలియని ఎన్నో నిగూఢ సత్యాలు అందులో దాగి ఉంటాయి. మహాభారతంలోని అద్భుత ఘట్టాలలో, వెలుగుచూడని కొన్ని సంఘటనలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/86b81wxqFiM ]
1. దుర్యోధనుడిని కాపాడిన అర్జునుడు
పాండవులు కౌరవులతో ఆడిన మాయా జూదంలో ఓడి, అరణ్యవాసం చేస్తున్న సమయంలో, ఆ అటవీ ప్రాంతానికి దుర్యోధనుడు వెళ్ళాడు. ఒక చెరువుకు అవతల ప్రక్కన పాండవులు నివసిస్తుండగా, ఇవతలి ప్రక్కన దుర్యోధనుడు, తాత్కాలిక బసను ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు అర్ఘ్యమివ్వడానికి చెరువులోకి దిగగా, అతడిని గంధర్వులు బంధించారు. అప్పుడు వారి నుండి దుర్యోధనుడిని రక్షించాడు అర్జునుడు. అలా గంధర్వుల నుండి తనను కాపాడినందుకు ఏదైనా వరం కోరుకొమ్మని, అర్జునుడితో అన్నాడు దుర్యోధనుడు. అందుకు అర్జునుడు సున్నితంగా తిరస్కరించి, తగిన సమయం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పాడు.
2. బంగారు బాణాలు
మోసపూరితంగా లాక్కున్న రాజ్యం కోసం, కౌరవులతో యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవులు. వీరి యుద్ధం వెనుక అనేక కారణాలు దాగి ఉన్నాయి. దుర్యోధనుడి అహంకారం, రాజ్య కాంక్షే ఈ యుద్ధానికి పునాది. భీష్ముడూ, ద్రోణాచార్యుడూ, కర్ణుడి వంటి వీరాధివీరులెందరో కౌరవుల పక్షాన నిలచినా, దుర్యోధనుడికి మాత్రం, వెలితిగానే ఉండేది. యుద్ధంలో గెలుపుపై ధీమా లేదు. దాంతో దుర్యోధనుడు భీష్ముడు దగ్గరకు వెళ్లి, ‘మీరు పాండు పుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగి చేయడం లేద’ని నిందించాడు. ఆ మాటలకు ఆగ్రహావేశాలకు లోనైన భీష్ముడు, అయిదు బాణాలను పట్టుకుని, వాటిని మంత్రించి, ఆ అయిదు బాణాలతో పంచ పాండవులను వధిస్తానని, దుర్యోధనుడికి మాటయిచ్చాడు. ఆ బాణాలను సురక్షితంగా ఉంచదలచి, ముందు జాగ్రత్తతో వాటిని, ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటాననీ, ఉదయాన్నే తిరిగి అందజేస్తాననీ, దుర్యోధనుడు తనతో పాటు పట్టుకెళ్ళాడు.
3. మాట నిలబెట్టుకున్న దుర్యోధనుడు
భీష్ముడు మంత్రించిన బాణాలను, దుర్యోధనుడు తన అధీనంలో ఉంచుకున్నాడన్న సంగతి, సర్వాంతర్యామి అయిన శ్రీ కృష్ణుడు గ్రహించాడు. ఆనాడు అరణ్యంలో దుర్యోధనుడిని కాపాడినందుకు, ఆయనిచ్చిన వరాన్ని అర్జునుడికి గుర్తు చేసి, వెళ్లి, ఆ అయిదు బాణాలనూ తీసుకురమ్మని, కృష్ణ భగవానుడు సలహా ఇచ్చాడు. ఆ విధంగానే అర్జునుడు, దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి, ఇచ్చిన వరాన్ని గుర్తు చేసి, భీష్ముడిచ్చిన అయిదు బాణాలనూ తనకిమ్మని అడిగాడు. క్షత్రియుడిగా దుర్యోధనుడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని, తప్పనిసరి పరిస్థితులలో, బాణాలను అర్జునుడికిచ్చేశాడు. తిరిగి భీష్ముడి దగ్గరకు వెళ్లి, మళ్లీ మంత్రించిన బాణాలను ఇమ్మని కోరాడు. అందుకు భీష్ముడు, అది అసాధ్యమనీ, మళ్ళీ ఆ మంత్రం పనిచేయదనీ చెప్పి, తిరిగి పంపిచేశాడు. ఇదంతా కృష్ణ లీలగానే భావించి, ఆనందించాడు భీష్ముడు. మహారాజు ఆజ్ఞ మేరకు, తప్పక కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నాడే కానీ, నిజానికి భీష్ముడికి పాండవులంటే అమితిమైన ప్రేమ.
4. తండ్రి మెదడును తిన్న సహదేవుడు
పాండవులలో వీరుడు అర్జునుడే అయినా, విజ్ఞానవంతుడు మాత్రం సహదేవుడు. ఆ తెలివి తేటలు తండ్రి పాండురాజు నుంచి, తనకు లభించాయి. పాండురాజు మహా మేధావి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో, ఏం జరుగుతుందో ఇట్టే గ్రహించగల అనితర సాధ్యుడు. పాండు రాజు, మరణానికి చేరువలో ఉన్నప్పుడు, తన అయిదుగురు కొడుకులనూ పిలిచి, తన మరణానంతరం, తన మెదడును అందరూ సమ భాగాలుగా చేసుకుని తినమని, ఆదేశించాడు. కానీ, వారిలో సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి, పాండు రాజు మెదడును తిన్నాడు. అందుకే, పాండు రాజుకున్న శక్తులన్నీ, సహదేవుడికి వచ్చాయి. జ్యోతిష్యంలో దిట్ట అయిన సహదేవుడి గురించి తెలిసిన శకుని, కురుక్షేత్రానికి తగిన ముహుర్తం పెట్టించమని, దుర్యోధనుడిని పంపించాడు. సహాదేవుడికి, భవిష్యత్తులో జరిగబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో, ముందే తెలుసు.. కానీ, ఏమీ ఎరుగనట్లే, నిమ్మళంగా ఉన్నాడు. దుర్యోధనుడే తమకు మొదటి శత్రువు అయినప్పటికీ, నిజాయితీగా కురుక్షేత్రానికి మంచి ముహుర్తం నిర్ణయించి పంపించాడు.
5. అర్జునుడి కుమారుడి ఆత్మసంతర్పణ
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయాన్ని కోరుతూ, తనని తాను కాళీమాతకి బలిచ్చుకున్నాడు, ఇరావణుడు. అతడు అర్జునుడికీ, ఉలూచికీ పుట్టిన కొడుకు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం, కాళీమాతకి పూజ చేశాడు. అయితే, తనని తాను ఆత్మసంతర్పణ ఇచ్చుకునేముందు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భర్త చనిపోతాడని తెలిసి, ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది? అందుకే, కృష్ణ పరమాత్ముడు మోహినీ అవతారాన్ని దాల్చి, అతని కళ్యానేచ్చను నెరవేర్చాడు. ఆ తరువాత ఇరావణుడు, కాళీ మాతకు ఆత్మ సంతర్పణ చేసుకున్నాడు.
6. ధృతరాష్ట్రుడి 101వ కొడుకు
ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, ఒక కుమార్తె అని చాలా మందికి తెలుసు. కానీ, అతనికి 101 మంది కొడుకులు ఉన్నారు. వందమంది పుత్రులు గాంధారికి పుడితే, ఒక కొడుకు మాత్రం, దాసీకి జన్మించాడు. గాంధారి గర్భవతి అని తెలిశాక, ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు, సౌవలి అనే దాసీని నియమించారు. సౌందర్యవతి అయిన ఆ దాసీని మోహించాడు, ధృతరాష్ట్రుడు. అలా వారిద్దరికీ పుట్టిన వాడే, యుయుత్సుడు.
7. కురుక్షేత్ర వంటశాల
కురుక్షేత్ర సంగ్రామంలో, అఖండ భారతం మొత్తం పాల్గొంది. కొందరు పాండవుల వైపూ, మరికొందరు కౌరవుల వైపు. అందుకే, కురుక్షేత్ర యుద్ధాన్ని, మహాభారత యుద్ధం అని కూడా అంటారు. అన్ని రాజ్యాలూ, ఏదో ఒక వైపు ఉండి యుద్ధంలో పాలుపంచుకోగా, ఉడుపి రాజు మాత్రం, ఎటూ మద్దతు తెలుపకుండా, తటస్థంగా ఉండిపోయాడు. అతడు కృష్ణునితో, ‘యుద్ధంలో పాల్గొన్నవారికి రోజూ ఆహారపానీయాలు అవసరం. వాటన్నింటినీ నేను అమరుస్తాను’ అని చెప్పి, అనుమతి తీసుకున్నాడు. అలా ఆ ఉడుపి రాజు, 18 రోజుల పాటూ, ఇరువైపుల సైనికులకూ, భోజనాలను ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ఎప్పుడూ ఒక్క మెతుకు కూడా వృథా అవ్వకుండా చూసుకునేవాడు. రోజూ వందల మంది సైనికులు చనిపోతుండేవారు. రోజుకు ఎంత మంది చనిపోతున్నారు? ఎంతమంది ఉన్నారు? అనే లెక్క ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ, ఉడుపి రాజు మాత్రం, ఆ రోజు ఎంత మంది సైనికులుంటే, వారికి మాత్రమే సరిపోయేట్టుగా, భోజనం వండించేవాడు. సైనికుల లెక్క ఉడుపి రాజుకు ఎలా తెలిసేదో, ఆశ్చర్యమనే చెప్పోచ్చు. ఇలాంటి ఎన్నో అద్భుత సంఘటనలు, మన మహా భారతంలో దాగి ఉన్నాయి.
కృష్ణం వందే జగద్గురుమ్!
Link: https://www.youtube.com/post/UgwaR6wbpPtb_UcEOhh4AaABCQ